టీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ: 'డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దు' - ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ

ఫొటో సోర్స్, TSRTCHQ/facebook
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ముగిసింది. 52 రోజుల పాటు సాగిన సమ్మెను ముగిస్తున్నట్టు కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. హైకోర్టు తీర్పు మేరకు లేబర్ కమిషనర్ దగ్గర సమస్యల పరిష్కారం కోసం చర్చలకు వెళుతున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి.
ఈనెల 20వ తేదీన సమ్మె విషయంలో దిగి వచ్చిన కార్మిక సంఘాలు, ఈవాళ సమ్మె విరమణ ప్రకటించాయి. సమ్మెకు ముందు ఉన్న పరిస్థితులను కల్పించి, కార్మికులపై ఎలాంటి షరతులు లేకుండా విధులను నిర్వర్తించడానికి అనుకూల వాతావరణం కల్పిస్తే సమ్మెను విరమించి కార్మికులు విధుల్లో చేరతారని ఆరోజు జేఏసీ ప్రకటించింది. కానీ ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదు. దీంతో ప్రభుత్వ తరపున ఏ ప్రకటనా లేకపోయినా, తిరిగి ఈరోజు సమావేశమైన జేఏసీ దీనిపై చర్చించి విరమణ ప్రకటన చేసింది.
దీనిపై ఇంకా ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే విషయమై గవర్నర్ తమిళిసైని కలసి పరిస్థితి నివేదించారు.
ప్రభుత్వం సత్వరమే సమస్యలను లేబర్ కమిషనర్ కు నివేదించాలని కార్మిక సంఘాలు కోరాయి. మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని ప్రకటించింది జేఏసీ.
ఇప్పటి వరకూ మొత్తం 52 రోజులు సమ్మె సాగింది. ఈ సమ్మె కాలంలో మొత్తం 29 మంది కార్మికులు లేదా వారి సమీప బంధువుల మరణించినట్టుగా కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అందులో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పోరాటంలో కార్మికులదే నైతిక విజయమనీ పత్రికా ప్రకటన విడుదల చేసింది జేఏసీ. ఆర్టీసీ ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని జేఏసీ కోరింది. ఎలాంటి షరతులు లేకుండా విధులు నిర్వర్తించడానికి అనుకూల వాతావరణం కల్పించాలని జేఏసీ కోరింది.
ఈ అంశంపై బీబీసీ రవాణా శాఖ కార్యాలయాన్ని స్పందించింది. వారు స్పందించాల్సి ఉంది.
'ఇది కార్మికుల ఓటమి కాదు, ప్రభుత్వ గెలుపూ కాదు'
'ఇది కార్మికుల ఓటమి కాదు, ప్రభుత్వ గెలుపూ కాదు' అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి చెప్పారు.
''కార్మికుల కోసం దశల వారీగా అనేక సార్లు పోరాడాం. కార్మికులు సంపూర్ణంగా సమ్మెను విజయవంతం చేశారు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు హైకోర్టు సూచనలను ప్రభుత్వం లెక్క చేయలేదు. ఆర్టీసీ ఆస్తులను, ఆర్టీసీని అమ్ముకునే ప్రయత్నం జరిగింది. లేబర్ కోర్టుకు ప్రభుత్వం సరైన నివేదికలు ఇస్తుందని భావిస్తున్నాం'' అని అశ్వత్థామ రెడ్డి అన్నారు.
సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులందరూ రేపటి నుంచి విధులకు హాజరుకావాలని, తాత్కాలిక కార్మికులు ఉద్యోగాలకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తప్పనిసరి పరిస్థితుల్లో, కార్మికుల శ్రేయస్సు కోసమే సమ్మె విరమిస్తున్నామని జేఏసీ నాయకుడు రాజిరెడ్డి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
హాస్యాస్పదంగా ఉంది: ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ
రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ వ్యాఖ్యానించారు.
కార్మికులు ఇప్పుడు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారని.. ఇష్టానుసారం విధులకు గైర్హాజరై, తిరిగి తమకు ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే నిబంధనలు అమనుతించవని ఆయన స్పష్టం చేశారు.
ఓ పత్రికా ప్రకటనలో ఆయన ఈ విషయాలను తెలియజేశారు.
''పోరాటం కొనసాగుతుంది అంటూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారు. ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై, ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఉండదు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదు'' అని సునీల్ శర్మ అన్నారు.
హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని ఆయన చెప్పారు.
''బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి కార్మికులు ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారు. గౌరవ హైకోర్టు చెప్పిన దాని ప్రకారం వారి సమ్మె విషయంలో కార్మిక శాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారమే ఆర్టీసీ యాజమాన్యం కూడా తదుపరి చర్యలు తీసుకుంటుంది. అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుంది. అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాలి'' అని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే యూనియన్ల మాట విని కార్మికులు నష్టపోయారని, ఇక ముందు కూడా నష్టాలు కోరి తెచ్చుకోవద్దని సునీల్ శర్మ అన్నారు.
''రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దు. బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డగించవద్దు. అన్ని డిపోల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షిస్తాం. చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ క్షమించదు. చట్ట పరమైన చర్యలు, క్రమ శిక్షణ చర్యలు తప్పవు'' అని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ: ఆర్టీసీ చరిత్రలో చివరి సమ్మె ఇదే అవుతుందా?
- ‘తెలంగాణలో అమిత్ షా, కేసీఆర్‌ల రాజ్యం నడుస్తోంది’ - వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్
- భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా?
- ప్రణబ్ ముఖర్జీ: ‘నేను బాల్ థాకరేను కలవటం సోనియా గాంధీకి నచ్చలేదు’
- ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోం.. భారత సైనికులు వెనక్కి వెళ్లాలి: నేపాల్ ప్రధాని కేపీ ఓలీ
- విరాట్ కోహ్లీ: ‘ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేక కుమిలిపోయా.. క్రికెట్‌ను వదిలేయాలన్న ఆలోచనలూ వచ్చాయి’
- భారత బ్యాంకుల్లో వేల కోట్ల కుంభకోణాలు... ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి
- భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనవి ఎందుకయ్యాయి
- మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాలు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








