ఆంధ్రప్రదేశ్: పోషకాహారంలో అట్టడుగు స్థాయికి... - CNNS సర్వే రిపోర్ట్

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. విటమిన్ 'ఏ' అందని చిన్నారులు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ. గుడ్డు వినియోగంలో మాత్రం ఏపీ, తెలంగాణలు రెండూ ముందున్నాయి.’'
ఇవి తాజాగా సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్‌ఎన్‌ఎస్)లో వెల్లడించిన అంశాలు.
యునిసెఫ్, పాపులేషన్ కౌన్సెల్, ఎంవోహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ సహకారంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ సర్వే నిర్వహించింది.
సూక్ష్మ పోషకాహార అంశాలకు సంబంధించి జాతీయస్థాయిలో తొలిసారిగా అత్యంత విస్తృత స్థాయిలో ఈ సర్వే చేశారు.

ఫొటో సోర్స్, CNNS REORT
పోషకాహారంలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్
ఈ సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులకు సరైన పోషహాకారం అందడం లేదని తేలింది.
6 నుంచి 23 నెలల మధ్య వయసున్న చిన్నారుల్లో 'కనీస పోషకాహారం' విషయంలో ఆంధ్రప్రదేశ్ 1.3 శాతంతో చివరి స్థానంలో ఉంది.
35.9 శాతంతో సిక్కిం ప్రథమస్థానంలో నిలవగా, కేరళ, అరుణాచల్ ప్రదేశ్ రెండు, మూడుస్థానాలలో నిలిచాయి. జాతీయ సగటు 6.4 శాతంగా ఉంది. 3.6 శాతంతో తెలంగాణ 23వ స్థానంతో సరిపెట్టుకుంది.
తెలుగు రాష్ట్రాలు రెండూ జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, INTERNATIONAL CENTRE FOR DISEASE RESEARCH
బరువు తక్కువే..
నవజాత శిశువుల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారుల బరువు విషయానికొస్తే ఝార్ఖండ్‌లో 42.9 శాతం మంది చిన్నారులు ఉండాల్సిన దాని కంటే తక్కువ బరువుతో ఉన్నారు. ఈ విషయంలో ఝార్ఖండ్ అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగు స్థానంలో ఉంది.
ఈ విషయంలో 11.3 శాతంతో మిజోరం అగ్రస్థానంలో ఉండగా, 35.5 శాతం మంది తక్కువ బరువు చిన్నారులతో ఆంధ్రప్రదేశ్ 24వ స్థానంలో నిలించింది. ఇది జాతీయ స్థాయి (33.4 శాతం) కంటే తక్కువ. తెలంగాణ 30.8 శాతంతో ఏపీ కంటే కాస్త మెరుగ్గా ఉంది.

ఫొటో సోర్స్, SHAWN SEBASTIAN
మిగిలిన అంశాల్లో ఇలా...
పోషకాహారంపై విస్తృతస్థాయిలో జరిగిన ఈ సర్వేల్లో కొన్ని అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని 2 నుంచి 4 ఏళ్ల వయసున్న పిల్లల్లో విటమిన్ 'ఏ' లోపం తీవ్రంగా ఉండడంతో పాటు కూరగాయల వినియోగమూ తక్కువగా ఉంది. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు చివరి స్థానంలో నిలిచాయి.

ఫొటో సోర్స్, BBC/CNNS 2016-18 survey report
93.8 శాతం కూరగాయల వినియోగంతో మేఘాలయ ప్రథమస్థానంలో నిలవగా, తెలంగాణ 30.4 శాతంతో 29వ స్థానంలో, ఏపీ 29.2 శాతంతో 30వ స్థానంలో ఉన్నాయి.
అయితే, 5 నుంచి 9 ఏళ్ల పిల్లల్లో 'ఇతర కూరగాయల' వినియోగం విషయానికొస్తే తెలంగాణ 91.4 శాతంతో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది.
ఇదే వయసుకు సంబంధించి మాంసం వినియోగంలో 74.7 శాతంతో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. 62.1 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
గుడ్డు వినియోగంలో ఏపీ, తెలంగాణ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
పప్పు ధాన్యాలు, బీన్స్‌ల వినియోగంలో తమిళనాడు మొదటిస్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం
దేశంలో నవజాత శిశువుల నుంచి కౌమార దశ పిల్లల్లో మధుమేహం ప్రమాదం పెరుగుతోందని సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్‌ఎన్‌ఎస్) నివేదిక తెలిపింది.
ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరికి ప్రీ-డయాబెటిస్ లక్షణాలున్నాయని పేర్కొంది.
విటమిన్ డి, ఐరన్ లోపం కూడా పిల్లల్లో ఎక్కువవుతోందని హెచ్చరించింది.

సీఎన్‌ఎన్‌ఎస్ సర్వే ఎలా జరిగింది?
యునిసెఫ్, పాపులేషన్ కౌన్సెల్, ఎంవోహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ సహకారంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ సీఎన్‌ఎన్‌ఎస్ సర్వే నిర్వహించింది.
ఈ తరహా సర్వే చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఈ సర్వేలో భాగంగా ప్రీ-స్కూల్ (0 నుంచి 4 ఏళ్ల లోపు), బడి పిల్లలు (5 నుంచి 9 ఏళ్ల లోపు), కౌమార దశ పిల్లలు (10 నుంచి 19 ఏళ్లు)ను వివిధ వర్గాలుగా విభజించారు.
ఈ సర్వేలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. నవజాత శిశువు నుంచి 19 ఏళ్ల పిల్లల వరకు పోషహాకారం, ఎత్తు, బరువు, స్థూలకాయం, విటమిన్ల సంగ్రహణ తదితర అంశాలను పరిశీలించారు.
2016 ఫిబ్రవరి నుంచి 2018 అక్టోబరు వరకు 30 రాష్ట్రాల్లో ఈ సర్వే చేశారు. ఈ సర్వేలో 1,12,316 మంది పిల్లలు, కౌమారుల నుంచి వివరాలు సేకరించారు.
51,029 మంది నుంచి రక్త, మల, మూత్ర నమూనాలను సేకరించారు. 30 రాష్ట్రాల్లో 2500 మంది సర్వే కోసం పనిచేశారు. 200 మంది ట్రైనర్లు, కోఆర్డినేటర్లను నియమించారు.
జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు... రాష్ట్రాలవారీగా స్త్రీ, పురుష నిష్పత్తిలో సర్వే అంశాలను విభజించారు.
ప్రధాన నగరాల్లో మురికివాడలు, మురికివాడలు కాని ప్రాంతాలవారీగా (దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా) వివరాలను సేకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 60, తెలంగాణలో 60 ప్రైమరీ శాంపిలింగ్ యూనిట్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Global hunger index 2019/bbc
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం భారత్‌లో తీవ్ర పేదరికం
దేశవ్యాప్తంగా పేదరికం స్థాయి తీవ్రంగా ఉండడం పిల్లలు, పెద్దల్లో పోషకాహార లోపానికి కారణమవుతోందని నివేదికలు సూచిస్తున్నాయి.
2019 గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 102వ స్థానంలో ఉంది.
వివిధ కొలమానాల ప్రాతిపదికన 117 దేశాల్లో సర్వే చేయగా 30.3 స్కోర్ సాధించింది.
20 నుంచి 35 మధ్య స్కోరును ఈ నివేదిక తీవ్ర పేదరిక స్థాయిగా గుర్తించింది.
పోషకాహార లోపం, వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, శిశు మరణాల రేటు వంటివి ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ నివేదిక ప్రకారం ఇప్పటికే భారత్‌లో పేదరికం తీవ్రంగానే ఉన్నప్పటికీ 2010తో పోల్చితే తగ్గుతూ వచ్చింది.
ఏజెన్సీ చిన్నారులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం, నాణ్యమైన పదార్థాలు అందిస్తున్నాం: ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత
ఆంధ్రప్రదేశ్‌లో పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు.
ఆమె బీబీసీతో మాట్లాడుతూ... ‘‘చిన్నారుల్లో పౌష్టికాహార లోపం రాకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉన్నట్టు గుర్తించాం. ఐసీడీఎస్ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అదేశించాం. గతంలో సరఫరా చేసిన పదార్థాలు నాణ్యంగా ఉండేవి కావు. గుడ్లు కూడా సక్రమంగా పంపిణీ చేయలేదు. ప్రస్తుతం మా ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి పెట్టింది. పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రచారం చేస్తూ, నాణ్యమైన సన్నబియ్యం కూడా అందిస్తూ పోషకాహార లోపాన్ని పూర్తిగా అరికట్టే పనిలో ఉన్నాం’’ అన్నారు.
ఇవి కూడా చదవండి
- అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పేదరికం తగ్గుతోందా
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని గుర్రంపై ఎక్కిన కిమ్
- బీబీసీ 100 వుమన్: ఈ జాబితాలో భారతీయులు ఎంత మంది?
- గూగుల్ పిక్సెల్ 4: 'రాడార్ ఫీచర్' కారణంగా భారతదేశంలో విడుదల రద్దు
- మహిళ అంగీకారంతో సెక్స్ చేసినా మగాడి మీద 'రేప్' కేసు పెట్టవచ్చా...
- జయలలిత తమిళనాడులో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించినప్పుడేం జరిగింది?
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- సిరియాలో టర్కీ సైనిక చర్యతో ఇస్లామిక్ స్టేట్ తిరిగి పుంజుకుంటుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








