'కశ్మీర్‌లో ప్రజాస్వామిక హక్కులను కాలరాశారు... దేశంలో భయోత్పాత అతివాద జాతీయవాద వాతావరణం నెలకొంది' - ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్. రామ్

ఫొటో సోర్స్, Getty Images
ప్రముఖ హేతువాద కార్యకర్త నరేంద్ర దభోల్కర్ స్మారక ఉపన్యాసం చేసేందుకు 'ది హిందూ' దినపత్రిక ప్రచురమ సంస్థ కస్తూరి అండ్ సన్స్ చైర్మన్ ఎన్. రామ్ మంగళవారం మహారాష్ట్రలోని పుణెకు వచ్చారు.
'భారత్ ముందు ప్రస్తుతమున్న మూడు పెద్ద సవాళ్లు: హేతువాదులపై దాడులు, భావ ప్రకటన స్వేచ్ఛకు పొంచి ఉన్న ముప్పు, అట్టడుగు వర్గాల సమస్యలు' అనే అంశంపై ఆయన ఉపన్యాసం ఇచ్చారు.
ఈ సందర్భంగా రామ్‌ను బీబీసీ మరాఠీ ప్రతినిధి జాహ్నవీ ములే ఇంటర్వ్యూ చేశారు. మీడియా స్వేచ్ఛ మొదలుకొని కశ్మీర్ వరకూ వివిధ విషయాలపై ఆయన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
కశ్మీర్ విషయంలో మీడియా రిపోర్టింగ్ చేస్తున్న తీరు గురించి మీరు ఏమనుకుంటున్నారు?
చాలా మంది విలేఖరులు వివేకంతోనే పనిచేస్తారు. ఎమర్జెన్సీ ప్రకటించకుడానే వార్తల ప్రసారాలకు ప్రభుత్వం అవరోధం సృష్టించింది. ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. రాజకీయ నాయకులను నిర్బంధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) కల్పించిన హక్కులను ఉల్లంఘించింది.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. కశ్మీర్‌లో అయితే అది లేనే లేదు. రాత్రికి రాత్రే ఓ రాష్ట్రాన్ని విభజించేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేశారు. సమయం వచ్చినప్పుడు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామంటున్నారు.
ఈ ప్రక్రియలో రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యికమైన హక్కులను కాలరాశారు. దీనికి వ్యతిరేకంగా నిరసనలు జరగాయనడంలో, ప్రజాస్వామ్యయుతంగా వాటిని అనుతించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ, దేశంలో భయోత్పాత, అతివాద జాతీయవాద వాతావరణం నెలకొని ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
రఫేల్ గురించి వార్తలు రాస్తున్నప్పుడు, మీకు ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయా?
లేదు, రఫేల్ గురించి నాపై ఎలాంటి ఒత్తిడీ రాలేదు. ఈ వార్త ప్రచురించవద్దంటూ నాకు ఎవరూ ఫోన్ చేసింది లేదు.
కానీ, ఆ తరువాత అధికారిక రహస్యాల చట్టం అంశాన్ని లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కోర్టు మీడియా స్వేచ్ఛను పరిరక్షిస్తూ గొప్ప ఆదేశం ఇచ్చింది. అధికారిక పత్రాలను ప్రచురించడాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి మీడియా స్వేచ్ఛలో భాగంగా చూశారు.
దాంతో మేం చాలా సంతోషంగా ఉన్నాం. కోర్టు రెండు ఆదేశాలిచ్చింది. ఆ రెండూ గొప్ప నిర్ణయాలే.
ఆరేళ్లు గడిచినా, దభోల్కర్‌ను హత్య చేసిందెవరో తెలియలేదుగా?
ఈ కేసు విచారణ కొంత ముందుకు సాగిందని నేను ఇదివరకే చెప్పా. కానీ, ఇంతవరకూ వారు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పట్టుకోలేకపోయారు. వాళ్లు మరింత మెరుగ్గా కృషి చేసి ఉంటే, అది దొరికేది.
ఆయుధాన్ని ఏదైనా కాలువలో పడేసి ఉండొచ్చు. నాతో వేరే వాళ్లు అన్నది, నేను చదివింది మీతో చెబుతున్నా.
భారత్‌లోని క్రిమినల్ ప్రాసిక్యూషన్ వ్యవస్థ చాలా సార్లు అసమర్థంగా కనిపిస్తోంది. అయితే, పూర్తి స్థాయి సామర్థ్యంతో అది పనిచేయకపోవడం వేరు, కావాలని ఓ కేసును వదిలేయడం వేరు. దభోల్కర్ కేసులో ఇప్పుడే మనమేమీ చెప్పలేం. సీబీఐ ఈ కేసును విచారిస్తోంది.
ఈ కేసునూ, గోవింద్ పాన్సరే హత్య కేసును కోర్టు పరిశీలిస్తోంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా, అది సరైనదే అయ్యుంటుందన్న విశ్వాసం నాకు ఉంది.

ఫొటో సోర్స్, PTI
రాజకీయ పార్టీలు, రాజకీయ భావజాలాలు భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తాయని మీరు అనుకుంటున్నారా? లేకపోతే సమస్య మూలాలు మన సమాజంలోనే ఉన్నాయా?
ఆ రెండూ నిజమేనని నేను అనుకుంటున్నా. గణాంకాలను పరిశీలించాలనుకుంటే, జర్నలిజం రంగంలోనే 2004 నుంచి 2014 వరకూ అందుకు సంబంధించిన ఉదాహరణలు నా వద్ద ఉన్నాయి. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సీపీజే సమాచారం ప్రకారం 2004 నుంచి పదేళ్ల కాలంలో భారత్‌లో పది మంది విలేఖరులు హత్యకు గురయ్యారు. ఆ తర్వాతి నాలుగేళ్లలో మరో పన్నెండు మంది హత్యకు గురయ్యారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు.
వీటన్నిటి వెనుక ప్రధాన కారణాల్లో రాజకీయ వాతావరణం కూడా ఒకటన్న విషయాన్ని మనం తోసిపుచ్చలేం. 2013లో దభోల్కర్ హత్యకు గురయ్యారు. నిజానికి, అప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో లేదు.
అధికారం ఎవరి చేతుల్లో ఉంది, ఏ పార్టీ ప్రభుత్వం నడుస్తుందోన్నవాటితో సంబంధం లేదు. మీరు చేసే పని నచ్చక మిమ్మల్ని చంపాలనుకునే వ్యక్తులు సమాజంలో ఉన్నారు.
వ్యతిరేకతను అణచివేసేందుకు ఇదొక మార్గం. ఇలాంటి వాటికి మనం కేవలం ప్రభుత్వాన్ని నిందించలేం. వ్యవస్థలోనే ఇది వేళ్లూనుకుపోయి ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టుల పని మరింత కష్టమవుతుందా ?
కచ్చితంగా. కానీ, అది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ముందుజాగ్రత్తలు చాలా ముఖ్యం. తమ విలేఖరుల భద్రత కోసం మీడియా సంస్థలు కూడా బాధ్యత తీసుకోవాలన్నది నా అభిప్రాయం.
ఈ ముప్పును మనం ఓ భూతంగా మారనివ్వకూడదు. సంఘ్ పరివార్ కారణంగా ప్రస్తుతం దేశంలో భయపూరితమైన వాతావరణం ఉంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.
మైనారిటీ వర్గాల్లోనూ ఇలాంటి భావజాలం ఉంది. జీహాద్, ఇదీ ఒకే రకమైనవి. రాజకీయ ఛాందసవాదం విలేఖరులకు ముప్పును పెంచింది. అలా అని అందరినీ ఒకే గాటన కట్టలేం.
మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు ఇంకా మెరుగ్గా పనిచేయగలదని నేను అనుకుంటున్నా.
ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టినందుకు కొందరు మహిళలను కొన్ని రోజులపాటు జైల్లో పెట్టిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇది ఎంతో పనికి మాలిన చర్య.
ఇవి కూడా చదవండి:
- 'కల్బుర్గి, గౌరీ లంకేశ్ హత్యల్లో వాడిన తుపాకీ ఒకటే'
- సనాతన్ సంస్థ 'హిందుత్వ తీవ్రవాద' శిక్షణ కేంద్రమా?
- గురు గోల్వల్కర్ : 'విద్వేష' దూతా లేక 'హిందూ జాతీయవాద' ధ్వజస్తంభమా...
- 'జై శ్రీరాం' అనాలంటూ ముస్లిం యువకుడిపై దాడి: పోలీసులు, హిందూసేన కార్యకర్తలు ఏమంటున్నారు
- వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్...
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
- బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’: కళ్లకు కడుతున్న ఫొటోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








