ఆర్టికల్ 370: జమ్మూకశ్మీర్‌ అయిదు రోజుల కర్ఫ్యూ తరువాత ఎలా ఉంది.?

కశ్మీర్‌లో బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుకు భారత ప్రభుత్వం నిర్ణయించిన తరువాత తలెత్తిన పరిణామాల నేపథ్యంలో అక్కడి గత విధించిన 144 సెక్షన్‌ను శుక్రవారం ఎత్తివేశారు.

మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు శుక్రవారం అనుమతించారు. అయితే చారిత్రక జామా మసీదు మాత్రం తెరుచుకోలేదు.

జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ శుక్రవారం జమ్మూకశ్మీర్ గవర్నరు సత్యపాల్ మాలిక్‌తో సమావేశమైనట్లు రాజ్‌భవన్ అధికార ప్రతినిధి వెల్లడించించారు.

జమ్మూకశ్మీర్‌లో మంగళవారం నుంచి మకాం వేసిన డోభాల్ అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు, అక్కడ నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు గవర్నరును కలిశారని అధికార ప్రతినిధి తెలిపారు.

ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు వారి నిత్యావసరాలు తీరేలా సహకరించాల్సిన అవసరంపై చర్చించారని.. ఈద్ ఉల్ అజా నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారని గవర్నరు చెప్పారన్నారు.

144 సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వు

శుక్రవారం ఏం జరిగింది

* జమ్మూకశ్మీర్‌కి సంబంధించి భారత్ తీసుకున్న చర్యల నేపథ్యంలో పాకిస్తాన్ బెంబేలెత్తుతోందని.. భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను అభివృద్ధి చేస్తే ఇకపై ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉండదని పాకిస్తాన్ ఆందోళన చెందుతోందని భారత్ అన్నది.

* కశ్మీరీలు ఎవరూ ఇబ్బందులు పడరాదని డోభాల్ సూచించడంతో ఆంక్షలు మెల్లమెల్లగా సడలిస్తున్నారు. 144 సెక్షన్ ఎత్తివేశారు.

* శనివారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

* కశ్మీర్‌లో పరిస్థితులు కుదుటపడ్డాయని అధికారులు చెబుతున్నప్పటికీ.. బాగ్ ఎ మెహతాబ్, నతీపొరా, రాంబాగ్, బర్జుల్లా, నూర్ బాగ్ వంటి చోట్ల స్థానిక యువత భద్రతాబలగాలపై రాళ్లు విసరడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

* గురువారం నుంచి ఆంక్షలు కొద్దికొద్దిగా సడలించడంతో జనం వీధుల్లోకి రావడం కనిపించింది. కొన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి. ముఖ్యంగా కూరగాయలు, ఇతర నిత్యావసరాలు, మందులు విక్రయించే దుకాణాలు తెరుచుకున్నాయి.

* ఖోఖ్రాపార్-మున్నాబావో మధ్య తిరిగే థార్ ఎక్స్‌ప్రెస్‌ను పాకిస్తాన్ రద్దు చేసింది.

* ఆర్టికల్ 370 రద్దు తరువాత పరిస్థితులపై చైనా నాయకత్వంతో చర్చించేందుకు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమూద్ ఖురేషీ వెళ్లారు. 'పాకిస్తాన్‌కు చైనా మిత్రదేశం మాత్రమే కాదు. ఈ ప్రాంతంలో కీలక దేశం కూడా. కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను చైనా నేతలకు చెబుతాను. కశ్మీర్‌లో భారత్ మానవ హక్కులను ఎలా ఉల్లంఘిస్తుందో వివరిస్తాం' అన్నారాయన.

* సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాలు కశ్మీర్‌లో పరిస్థితులు తెలుసుకునేందుకు వెళ్లగా వారిని, శ్రీనగర్ ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నట్లు పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)