ఎన్ఎంసీ బిల్లుపై వైద్యులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?

ఎన్ఎంసీ

ఫొటో సోర్స్, Getty Images

భారత వైద్య మండలి (ఎంసీఐ) స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)ను ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది.

దేశంలో వైద్య విద్యకు సంబంధించి అతి పెద్ద సంస్కరణగా కేంద్రం ఈ బిల్లును అభివర్ణిస్తుంది.

ఈ బిల్లు వల్ల వైద్య విద్యలో పారదర్శకత ఏర్పడుతుందని, మెడికల్ కళాశాలల్లో తనిఖీల ఇబ్బందులు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది. దేశవ్యాప్తంగా వైద్యవిద్య ఏకీకృత విధానంలో నడుస్తుందని పేర్కొంటోంది.

అయితే, ఈ బిల్లును వైద్య సంఘాలు, మెడిసన్ విద్యార్థులు, డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంబీబీఎస్ అర్హత లేకుండా స్వల్పకాలిక కోర్సులతో వైద్యులుగా మారి ప్రాక్టీస్ ప్రారంభిస్తే ప్రజల ప్రాణాలకే ప్రమాదని.. దీన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎన్ఎంసీ

ఫొటో సోర్స్, Getty Images

బిల్లు పరిస్థితి ఏమిటి?

'ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956'ను రద్దు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్రం ఈ బిల్లులో పెట్టింది.

ఇప్పటికే ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. తొలుత లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ, కొత్తగా రెండు సవరణలు జతచేయడంతో దీన్ని మళ్లీ లోక్‌సభలో పాస్ చేయాల్సి ఉంది.

బిల్లులోని కీలకాంశాలు

  • కొత్తగా ఏర్పాటు చేసే ఎన్‌ఎంసీలో 25 మంది సభ్యులుగా ఉంటారు. వారిలో మెజారిటీ సభ్యులను కేంద్రం నామినేట్ చేస్తుంది.
  • ఏడుగురు సభ్యుల కమిటీ ఎన్‌ఎంసీ చైర్మన్, ఇతర సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది.
  • ఎన్ ఎంసీ లో 8 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో నలుగురు వైద్య విద్యకు సంబంధించిన వివిధ బోర్డుల అధ్యక్షులు ఉంటారు. ముగ్గురిని వైద్య, ఫార్మా, హెచ్‌ఆర్‌డీ శాఖలు సిఫారసు చేస్తాయి.
  • ఎన్‌ఎంసీ కాలపరిమిత నాలుగేళ్లు. ఇందులోని తాత్కాలిక సభ్యులు రెండేళ్లకి ఒకసారి మారతారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటారు.
  • కమిషన్ చైర్మన్‌, సభ్యుల్ని తొలగించే అధికారం కేంద్రానికి ఉంటుంది.
  • వైద్య విద్యకు సంబంధించి అన్ని ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిట్లీ 50 శాతం సీట్లలో ఫీజుల నియంత్రణ, అమలు ఎన్ఎంసీ పరిధిలోనే ఉంటుంది.
  • మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి, మెడికల్ ప్రాక్టీస్ అనుమతికి సంబంధించి ఎంబీబీఎస్ చివరి ఏడాది నిర్వహించే పరీక్షను ఇకపై అర్హత పరీక్షగా పరిగణిస్తారు. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) పేరుతో ఈ పరీక్ష పెడుతారు.
  • విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన వారు భారత్‌లో ప్రాక్టీస్ చేయాలంటే స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించాలి.
  • హోమియో, యునాని, ఆయుర్వేదం కోర్సులు చదివిన వారు ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు ద్వారా అల్లోపతి వైద్యం చేయడానికి అనుమతి లభిస్తుంది.
  • కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లు కూడా అల్లోపతి వైద్యం చేసేందుకు ఈ బిల్లు కొన్ని పరిమితులతో అనుమతి ఇస్తుంది. వీరిని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో మందులను సిఫారసు చేసేందుకు అనుమతిస్తారు. అయితే మెడికల్ ప్రాక్టిషనర్ల పర్యవేక్షణలోనే వీరు ఆ పని చేయాలి.
  • ‘భారత యువత గుండె బలహీనమవుతోంది’
  • ‘గ్యాస్’ ప్రాబ్లమ్? ఎందుకిలా వదులుతారు? దీన్ని ఆపొచ్చా?
ఎన్ఎంసీ

ఫొటో సోర్స్, Getty Images

బిల్లుపై ఎవరేమన్నారు?

ఈ బిల్లుపై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ నకిలీ వైద్యులకు ఈ బిల్లు అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు.

ఎలాంటి అర్హత లేకుండా వైద్యం చేసేవారికి ఏడాది జైలు శిక్షతో, రూ. 5 లక్షల జరిమానా విధించే ప్రతిపాదనను బిల్లులో చేర్చినట్లు చెప్పారు.

ఈ బిల్లును అనుసరించి వైద్య విద్యార్థులకు నెక్ట్స్ (నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు.

'నెక్ట్స్‌ పరీక్షనే మెడికల్ పీజీ ఎంట్రెన్స్‌గా, విదేశాల్లో ఎంబీబీఎస్ చేసినవారికి స్క్రీనింగ్ టెస్ట్‌గా పరిగణిస్తాం' అని తెలిపారు.

ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..

ఈ బిల్లుపై చర్చ సమయంలో లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యురాలు డాక్టర్ కకోలీ ఘోష్ దస్తీదార్ తన ప్రసంగంలో పలు అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేశారు.

'సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా దేశంలోని వైద్యవ్యవస్థ మొత్తాన్నీ తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నం ఈ మెడికల్ కౌన్సిల్ బిల్లు. ఆరోగ్య రంగానికి కేంద్ర బడ్జెట్లో 2 శాతం కంటే తక్కువ నిధులు కేటాయిస్తున్నాం.

దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడానికి కేవలం 10 లక్షల మంది వైద్యులే ఉన్నారు.

ఆర్నెళ్ల కోర్సుతో వైద్యం చేసేయగలిగితే ఇక నాలుగైదేళ్ల కోర్సులెందుకు? ఇంటర్మీయట్ తరువాత ఆర్నెళ్ల కోర్సు చదివేసి వైద్యం మొదలుపెట్టి ప్రజలు ప్రాణాలు తీసి జనాభా తగ్గించేస్తారా.. ఇది ఎంతమాత్రం సహించరానిది.

మరిన్ని వైద్య సీట్లు, బోధకులు, పరికరాలు, వసతుల కోసం నిధులు కేటాయించాలి. ప్రపంచంలో వస్తున్న నూతన వైద్య విధానాలూ మనమూ అందిపుచ్చుకునేలా రీసెర్చిని ప్రోత్సహించాలి. సకాలంలో వైద్యం అందించగలిగితే మృత్యువు వరకు వెళ్లినవారిని కూడా బతికించే అవకాశం ఉంటుంది'' అన్నారామె.

జూనియర్ డాక్టర్ల అభ్యంతరం ఇదీ..

బిల్లును వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా గుంటూరులో ఏపీ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ జీజీహెచ్‌ శాఖ అధ్యక్షుడు పవన్‌కుమార్‌ మాట్లాడుతూ ఎంబీబీఎస్‌ అర్హత లేని వారు అడ్డదారిన డాక్టర్లుగా మారి వైద్యం చేస్తే రోగుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందన్నారు.

వీరికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) గుంటూరు నగర అధ్యక్షురాలు డాక్టర్‌ పమిడి ముక్కల విజయ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఇటీవల ఆమోదం పొందిన ఎన్‌ఎంసీ బిల్లు వల్ల ఎంతో కష్టపడి ఎంబీబీఎస్‌ వైద్య చదివే విద్యార్థులకు, వైద్య వృత్తిలో ఉన్న వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)