'గాంధీ'ని అమ్మవారిలా భావించి ఏటా గాంధమ్మ పండుగ జరుపుతున్న శ్రీకాకుళం జిల్లా కేదారిపురం

గాంధమ్మ ఉత్సవం
    • రచయిత, విజయ్ గజం
    • హోదా, బీబీసీ కోసం

మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ... భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్ముడిగానే మనకు తెలుసు.. కానీ, ఆ గ్రామస్థులకు మాత్రం ఆయన శక్తి స్వరూపిణి. అందుకే ఏటా తొలకరి వర్షాలు కురిశాక గాంధీజీని గాంధమ్మగా పూజిస్తారు ఆ ఊరివాళ్లు. పసుపు కుంకుమలు సమర్పించి సంబరాలు చేసుకుంటారు.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురం గ్రామస్థులు ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న ఆచారం ఇది. స్వాతంత్ర్య ఉద్యమ నాయకుల్లో ఒకరైన గాంధీ మహాత్ముడు కూడా తమకు దేవుడే అని ఆ గ్రామస్థులు చెబుతారు.

బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాండించిన ఆ శక్తినే పంటలు పండించే దేవతా మూర్తిగా గుర్తించి పూజలు, సంబరాలు చేస్తున్నారు ఆ గ్రామస్థులు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏటా కేదారిపురంలో రైతులు పొలాల్లో నాట్లు వేయడానికి ముందు ఆగస్టు మొదటివారంలో ఈ గాంధమ్మ సంబరాలు చేస్తున్నారు.

గాంధీ అమ్మవారు

నైవేద్యం సమర్పయామి

ఈ సంబరాల్లో భాగంగా పెసరపప్పు, కొబ్బరి ముక్కలు, చక్కెర కలిపిన మిశ్రమం.. బెల్లం, నెయ్యి, గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని పువ్వులు, పసుపు, కుంకుమలతో అలంకరించిన వెదురు బుట్టల్లో ఉంచి గ్రామస్థులంతా మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి గ్రామం నడిబొడ్డున ఉన్న ఆలయం వద్దకు చేరుకుంటారు.

అక్కడ అప్పటికే సిద్ధంగా ఉంచిన గాంధీ చిత్రపటానికి పూజలు చేసి తమతో తీసుకొచ్చిన ప్రసాదాలను నైవేద్యంగా పెడతారు.

అనంతరం గ్రామస్థులంతా పూర్ణకుంభాలు, ప్రసాదాలు, ముర్రాటలతో ఊరేగింపు నిర్వహించి స్థానిక ఎర్రన్నగుడి, భూలోకమ్మగుడి, గాంధమ్మగుడి వరకూ వెళ్లి అక్కడ ముర్రాటలు సమర్పించడంతో ఈ సంబరం ముగుస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి గ్రామంలోని రైతులు పొలాల్లో నాట్లు వేసుకోవాలని ప్రకటిస్తారు.

నైవేద్యం

మాంసం ముట్టరు...

సాధారణంగా గ్రామదేవతల పండుగల సందర్భంగా జంతు బలులు ఇస్తారు.

కేదారిపురంలో ఈ గాంధమ్మ సంబరానికి ముందు పోలమ్మ, నూకాలమ్మ, పాతపట్నం అమ్మవార్లకు పూజలు చేస్తారు.

ఆ సందర్భంగా కోళ్లు, మేకలను బలి ఇచ్చినా చివరిగా నిర్వహించే గాంధమ్మ సంబరంలో మాత్రం జంతు బలులు ఉండవు. ఆ రోజు గ్రామంలో ఎవరూ మాంసాహారం తీసుకోరు.

గాంధమ్మ ఉత్సవం

'పంటలు బాగా పండుతాయని నమ్ముతాం'

'నా చిన్ననాటి నుంచి మా ఊరిలో ఈ గాంధమ్మ పండుగ జరుగుతోంది. గాంధీజీకి జాతర చేశాక గ్రామంలో పంటలు బాగా పండుతాయని, నీటికి ఎన్నడూ నీటి కొరత రాలేదు' అని కేదారిపురానికి చెందిన సూర్యనారాయణ 'బీబీసీ'తో చెప్పారు.

గ్రామదేవతలను పూజించినట్లే గాంధీజీనీ పూజిస్తామని.. ఆయన తమకు దేవుడితో సమానమని చెప్పారు.

అదే గ్రామానికి చెందిన నాగరాజు మాట్లాడుతూ ‘‘తాను ఉపాధి కోసం పలాసలో నివాసం ఉంటున్నా. ఏటా ఈ ఉత్సవం కోసం సొంతూరికి వెళ్తా’’అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)