జల సంక్షోభం: చెన్నై నగరం ఎందుకు ఎండిపోయింది? - అభిప్రాయం

నీటి సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిత్యానంద్ జయరామన్
    • హోదా, బీబీసీ కోసం

ఒక ఏడాది వరదలు.. మరుసటి ఏడాది తుఫాను.. ఆ పై ఏడాది కరవు.. వరుస దెబ్బలు తింటున్న చెన్నై నగరం ప్రపంచ విపత్తు రాజధానిగా అపకీర్తి మూటగట్టుకుంటోంది. అయితే ఈ పరిస్థితి ఒక్క చెన్నై నగరానిది మాత్రమే కాదు. ఇలా ఎందుకు జరుగుతోందో పర్యావరణ ఉద్యమకారుడు నిత్యానంద్ జయరామన్ వివరిస్తున్నారు.

నేను ఈ వ్యాసం రాస్తున్నపుడు చెన్నైలో వర్షం పడింది. మొదటి తొలకరి జల్లు. కానీ అరగంటలో ఆగిపోయింది. అయినాకానీ నగర వీధుల్లో వరద పోటెత్తింది. ట్రాఫిక్‌ జాం అయిపోయింది. చెన్నై నగరంలో వరదల ముప్పు, నీటి కొరత - రెండిటికీ మూలాలు ఒకటే కావటం వైచిత్రి.

వృద్ధి చెందే తొందరలో గుడ్డిగా పరుగులు తీసిన నగరం.. తన నీటిని సంరక్షించే వనరులనే మింగేస్తూ విస్తరించింది.

1980 నుంచి 2010 మధ్య నగరంలో భారీ నిర్మాణాలు వెల్లువెత్తాయి. ఫలితం.. అప్పటికి 47 చదరపు కిలోమీటర్లుగా ఉన్న భవనాల కింది భూభాగం విస్తీర్ణం అమాంతంగా 402 చదరపు కిలోమీటర్లకు పెరిగిపోయింది.

మరోవైపు.. చిత్తడిభూముల కింద ఉన్న ప్రాంతాలు 186 చదరపు కిలోమీటర్ల నుంచి 71.5 చదరపు కిలోమీటర్లకు కుదించుకుపోయింది.

కరవు కానీ, భారీ వర్షాలు కానీ ఈ నగరానికి కొత్త కాదు. ఈ ప్రాంతానికి అక్టోబర్, నవంబర్‌లలో నీళ్లు మోసుకొచ్చే ఈశాన్య రుతుపవనాలు ఎప్పుడెలా ఉంటాయన్నది అంచనా వేయలేం. కొన్ని సంవత్సరాలు కుండపోత కురిపిస్తాయి. మరికొన్ని సంవత్సరాలు ముఖంచాటేస్తాయి.

ఈ రెండు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. ఈ ప్రాంతంలో ఎలాంటి జనావాసాలనైనా డిజైన్ చేయాల్సి ఉంటుంది. వృద్ధిని అడ్డుకునేది భూమి కొరత కాదు.. నీటి కొరత. చెన్నై, దాని పరిసర జిల్లాల్లో తొలి వ్యవసాయ ఆవాసాలు సరిగ్గా ఇదే చేశాయి.

ఈ ప్రాంతపు చదునైన తీర మైదానాల్లో పెద్దగా లోతులేకున్నా విస్తారమైన చెరువులను తవ్వారు. ఆ చెరువులను తవ్వితీసిన మట్టినే వాటికి కట్టలుగా పోశారు. నిజానికి ఇక్కడ ముందుగా నీరు నిలబడటానికి, ప్రవహించటానికి సదుపాయాలను సృష్టించారు. ఆ తర్వాతే జనావాసాలు వచ్చాయి.

జల సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

ఈ వ్యవసాయ తర్కంతో ఖాళీ భూములకు జీవమొచ్చింది. ప్రతి గ్రామంలో.. పోరంబోకుగా వర్గీకరించిన నీటి వనరులు, పచ్చికమైదానాలు, అటవీ ప్రాంతాలు విస్తారంగా ఉండేవి. ఈ భూముల్లో భవన నిర్మాణాలు నిషిద్ధం. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం మూడు జిల్లాల్లోనే 6000కు పైగా చెరువులు ఉండేవి. వాటిలో కొన్నిటి వయసు 1500 సంవత్సరాల పైమాటే.

గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా సుదీర్ఘ దూరాలకు నీటిని రవాణా చేయటానికి బదులుగా.. నీరు ఎక్కడ కురిస్తే అక్కడే దానిని సంరక్షించే సాంకేతికత, వివేకం తొలినాళ్లలో నివసించిన వారికి ఉండింది.

కానీ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో అదంతా కనుమరుగైపోయింది.

పట్టణ తర్కం వేళ్లూనుకుంది. ఖాళీ భూములకన్నా నిర్మాణ ప్రాంతాలు ఎక్కువ విలువైనవన్న భావన పెరిగింది. నిజానికి.. రాయల్ చార్టర్ 17వ శతాబ్దంలో చెన్నపట్టణాన్ని నగరంగా చేర్చినపుడే ఈ ప్రాంతపు 'నీటి శూన్య' తేదీ ఖరారైందని కొందరు వాదించవచ్చు.

బ్రిటిష్ వలస ప్రాంతంగా పుట్టిన ఈ నగరం.. శరవేగంగా గ్రామీణ ప్రాంతాన్ని ఆక్రమించేసింది.

1876లో మద్రాస్ కరవు సంభవించినపుడు.. ఫుళాల్ అనే ఓ చిన్న గ్రామంలోని ఒక చిన్న సాగునీటి చెరువును తమ నిర్వహణలోకి తీసుకున్న బ్రిటిష్ పాలకులు.. నగరానికి తాగునీరు సరఫరా చేయటం కోసం ఆ చెరువు సామర్థ్యాన్ని విపరీతంగా పెంచారు. దాని పేరును రెడ్‌హిల్స్ రిజర్వాయర్ అని మార్చారు. అదే చెన్నై నగరపు తొలి కేంద్రీకృత, భారీ బడ్జెట్‌తో కూడిన తాగునీటి ప్రాజెక్టు.

దూరంగా ఉన్న ఓ నీటివనరు మీద ఆధారపడిన నగరవాసులకు, వేగంగా పట్టణీకృతమవుతున్న నివాస ప్రాంతాలకు.. స్థానిక నీటివనరులు, భూభాగాలతో అనుబంధం తెగిపోయింది. నగరంలో అంతర్గతంగా ఉన్న నీటి వనరుల ప్రాంతాలు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్‌కు అందుబాటులోకి రావటం.. నగరీకరణ అజెండాకు చాలా అనుకూలించింది.

ఉదాహరణకు 1920ల్లో 70 ఎకరాల పురాతన మైలాపూర్ చెరువును మూసివేశారు. ఇప్పుడది చాలా జనసమ్మర్థంతో నిండిపోయిన నివాస, వాణిజ్య ప్రాంతం. దాని పేరు టి.నగర్.

నిజానికి ఆ మైలాపూర్ చెరువు.. ఉత్తరంగా దాదాపు పది కిలోమీటర్లు విస్తరించి వున్న పెద్ద నీటి చెరువుల వ్యవస్థలో ఒక భాగం.

ఇప్పుడు ఈ చెరువుల్లో మిగిలిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే.. స్పర్‌ట్యాంక్ రోడ్, ట్యాంక్ బండ్ రోడ్ అని పిలిచే రహదారులు మాత్రమే.

చెన్నై నగరం వేగంగా ఆర్థిక కేంద్రంగా మారుతూ వచ్చింది. ఐటీ రంగం, ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా నిలిచింది. ఈ పరిశ్రమలు.. చెన్నై నగరానికి కొత్త వలసలను ఆకర్షించటం, అరకొరగా ఉన్న వనరులపై ఒత్తిడి పెంచటమే కాదు.. ఈ ప్రాంతపు నీటి సదుపాయాలను చావుదెబ్బ తీశాయి.

నాటి భూవినియోగ ప్రణాళిక.. మధ్యయుగపు తమిళనాడులో విలసిల్లిన సాధారణ సూత్రాలకు చాలా దూరం.

చిత్తడిభూముల్లో నిర్మాణాలకు అనుమతిలేదు. చెరువులకు ఎగువ ప్రాంతాల్లో తక్కువ సాంద్రత నిర్మాణాలకు మాత్రమే అనుమతించారు. కారణం.. వర్షపు నీటి రిజర్వాయర్‌లోకి చేర్చటానికి ముందుకు ఈ భూములు వాటిని ఇంకించుకోవాల్సి ఉంటుంది.

ఉపరితలం కింది పొరలోని ఈ నీరే.. చెరువుల్లో నీరు వినియోగంతో, కాలక్రమంలో తగ్గుతూ ఉన్నపుడు వాటిని నింపుతుంటుంది.

ఇటువంటి కనీస తెలివిడిని విస్మరించి.. చెన్నైలో అమూల్యమైన పల్లికరారానై చిత్తడి నేలల్లో ఐటీ కారిడార్ (నగరంలో ఐటీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతం)ను నిర్మించారు.

జల సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పుళల్ రిజర్వాయర్ - చెన్నై తొలి కేంద్రీకృత, భారీ బడ్జెట్ నీటి ప్రాజెక్టు

నగరంలో అతి పెద్ద తాగునీటి చెరువైన చేంబరంబాక్క ఎగువ ప్రాంతాన్ని ఇప్పుడు ఆటోమోటివ్ స్పెషల్ ఎకానమిక్ జోన్‌గా మార్చారు.

ఇతర నీటివనరులతో కూడా ఇదే తరహా నిర్లక్ష్యంతో వ్యవహరించారు.

పేరుంగుడి చెత్త కుప్ప.. పల్లికారానై చిత్తడి భూముల మధ్యలో అంతటా విస్తరించింది.

తమిళనాడులో అతి పెద్ద పెట్రోకెమికల్ రిఫైనరీ కోసం 1960లో మనాలి చిత్తడిభూములను ఎండబెట్టారు.

నగరానికి అవసరమైన విద్యుత్ ఎన్నూర్ క్రీక్ మీద నిర్మించిన విద్యుత్ ప్లాంట్ల నుంచి వస్తుంది. అది సముద్రపు చిత్తడి నేల. ఇప్పుడు దీనిని.. ఆ విద్యుత్ ప్లాంట్లకు బూడిద కుప్పగా మార్చేశారు.

దాదాపు వెయ్యేళ్ల వయసున్న పళ్లవరమ్ పెద్ద చెరువును గత రెండు దశాబ్దాల్లో హైస్పీడ్ రహదారితో రెండు ముక్కలుగా చేశారు. అందులో ఒక ముక్క స్థానిక చెత్త కుప్పగా మారిపోయింది.

చెన్నై నగరపు మొత్తం నీటి అవసరాల్లో అతికష్టంగా నాలుగో వంతు నీటి సరఫరా కూడా జరగటం లేదు. మిగతా మొత్తాన్ని శక్తివంతమైన వాణిజ్య నీటి సరఫరాదారుల వ్యవస్థ పంపిణీ చేస్తోంది. వారు ఈ ప్రాంతపు నీటి వనరులను అడుగంటా పీల్చేస్తుండటంతో అవి వట్టిపోతున్నాయి.

నగరం నీటి అవసరాలను తీర్చటం కోసం.. చెన్నై చుట్టుపక్కల, ఆ వెనుక దూర ప్రాంతాల్లోని జనావాసాల్లో గల నీటిని, వారి జీవనాధారాలను బలవంతంగా లాగేసుకుంటున్నారు.

నగరం నిర్జలీకరించిన ఈ ప్రాంతాల్లో జలసంక్షోభం ఎన్నడూ వార్తల్లోకి రాదు.

జల సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

పెట్టుబడిదారీ విధానాన్ని మార్చివేసి.. దాని స్థానంలో ప్రకృతిని, ప్రజలను దోపిడీ చేయని ఇతర వ్యాపార పద్ధతులను ఆచరణలోకి తేనట్లయితే.. ఈ ప్రపంచం మారదు.

సాంకేతికత మీద గుడ్డి నమ్మకమున్న మన ప్రబల ఆర్థిక నమూనా విఫలమైంది.

ఆధునిక అర్థశాస్త్రం.. ఖాళీ భూములు, నిర్మాణాలు లేని భూములను నిరుపయోగంగా పరిగణిస్తుంది. ఆ భూములను తవ్వటం ద్వారా, రంధ్రాలు వేయటం ద్వారా, పూడ్చటం ద్వారా, ఖనిజాలు తవ్వుకోవటం ద్వారా, చదును చేయటం ద్వారా, వాటిపై భవనాలు కట్టటం ద్వారా మాత్రమే ఇటువంటి భూముల నుంచి విలువ రాబట్టగలమని ఇది నమ్ముతుంది.

ప్రపంచంలోని అన్ని ఆధునిక నగరాల్లోనూ భూ వినియోగాన్ని దిగజార్చటం.. వాతావరణ మార్పుకు కారణమవుతోంది. ఆయా నగరాలకు గల ప్రమాదాలను తేటతెల్లం చేస్తోంది.

చెన్నై నగరం తన విలువలను తన భూమిని, నీటిని ఎలా చూసుకుంటుందనే దానిని తిరిగి సమీక్షించుకోనిదే.. వరదలు కానీ, కొరతలు కానీ.. నీటితో ఈ నగర పోరాటం పరిష్కారం కాదు.

నగరం ఇంకా పెరిగిపోవటానికి, మరిన్ని భవనాలను నిర్మించటానికి అవకాశం లేదు. నిజానికి నగరం పరిమాణం క్రియాశీలంగా తగ్గాల్సిన అవసరముంది.

రాష్ట్రంలోని దిగువ ప్రాంతాల్లో.. భూహితమైన ఆర్థిక విధానాలను, ప్రభుత్వ విధానాలను ప్రోత్సహించటం ద్వారా నగరం నుంచి ప్రజలు ఒక ప్రణాళికా బద్ధంగా బయటకు వలస వెళ్లటం సులభం చేయవచ్చు.

కష్టమే అయినా కానీ.. ప్రకృతి ప్రకోపించే వరకూ వేచిచూడటం కన్నా ఇలా చేయటమే తక్కువ బాధాకరంగా ఉంటుంది.

నిత్యానంద్ జయరామన్ చెన్నైలో నివసించే రచయిత, సామాజిక కార్యకర్త.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)