భార్యనే గెలిపించుకోలేకపోయారు.. మాకింకేం సాయం చేస్తారు: మాయావతి

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక మాయావతి సమాజ్‌వాది పార్టీతో పొత్తును ఉపసంహరించుకున్నారు. తాజా ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాది పార్టీలు పొత్తులో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని 80 సీట్లలో పోటీచేశాయి. కానీ ఈ కూటమి 15 ఎంపీ స్థానాలకే పరిమితమవగా, బీజేపీ 62 సీట్లతో విజయకేతనం ఎగరవేసింది.
ఈ నేపథ్యంలోనే రానున్న ఉపఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి ప్రకటించారు. కానీ భవిష్యత్తులో కూడా సమాజ్‌వాది పార్టీతో పొత్తు ఉండదని ఆమె చెప్పలేదు.
'మా మధ్య బ్రేక్ రావడం శాశ్వతం కాదు..' అని మంగళవారం మీడియాతో మాయావతి అన్నారు. రానున్న ఉపఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ మెరుగైన ఫలితాలు రాణిస్తే, అప్పుడు పొత్తు గురించి ఆలోచిస్తానని ఆమె అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మరో ప్రాంతీయ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్ కూడా మహాకూటమిలో భాగస్వామ్య పార్టీయే. కానీ, ఈ పార్టీ పోటీ చేసిన మూడు లోక్‌సభ సీట్లలో ఒక్కటి కూడా గెలవలేకపోయింది.
దళితుల నాయకురాలిగావున్న మాయావతి 4 సార్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్, కేంద్రంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేయడంతోపాటు, మూడు సార్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ములాయంసింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం సమాజ్‌వాది పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు.
మాయావతి ప్రకటనపై స్పందించిన అఖిలేష్, రానున్న ఉపఎన్నికల్లో తమ పార్టీ 11 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వీరి పొత్తుకు ఎందుకంత ప్రాధాన్యం?
ఉత్తర్ ప్రదేశ్‌లో ఎస్‌పీ, బీఎస్‌పీ రెండూ బలమైన ప్రాంతీయ పార్టీలే. గడిచిన ఎన్నికల్లో రెండు పార్టీలు జంటగా బీజేపీని డీ కొట్టేందుకు ప్రయత్నించాయి. వీరి పొత్తుపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉండేవి.
బహుజన్ సమాజ్‌వాది పార్టీకి చెందిన దళిత ఓటుబ్యాంకు, సమాజ్‌వాది పార్టీకి చెందిన యాదవ, ముస్లిం ఓటుబ్యాంకులు ఐక్యం అవుతాయని అందరూ భావించారు.
ఒకానొక దశలో, తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా, పొత్తుపై మాత్రమే దృష్టి పెట్టాలని మాయావతి భావించారు. బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో ఓడించాలన్న కోరిక మాయావతి, ములాయంసింగ్ యాదవ్‌లో ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
1993లో కూడా ఈ రెండు పార్టీలు ఒకసారి పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడు బీఎస్పీ మద్దతుతో ములాయంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ స్నేహం ఎక్కువకాలం కొనసాగలేదు.
1995 జూన్‌లో, మాయావతి తన మద్దతును ఉపసంహరించుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నేపథ్యంలో మాయావతి పార్టీ మీటింగ్ ఏర్పాటుచేసిన ఓ గెస్ట్‌హౌస్‌పై సమాజ్‌వాది నేతలు దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆ సమయంలో, ప్రత్యర్థులు తనపై దాడి చేస్తారన్న భయంతో ఆమె ఓ గదిలోకి వెళ్లి తాళం వేసుకున్నారని, చివరికి సురక్షితంగా బయటపడ్డారని వార్తలొచ్చాయి.
‘గెస్ట్‌హౌస్‌పై దాడి’గా చెబుతున్న ఘటన జరిగిన రెండు రోజులకు, ఎస్పీ, బీఎస్పీ కూటమి విడిపోయి, బీజేపీ మద్దతుతో మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ములాయం, మాయావతి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగింది.
అందుకే, తాజా ఎన్నికల ముందు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు జాతీయ స్థాయిలో ప్రధానాంశం అయింది. ఇద్దరు నేతలు నవ్వుతూ పలకరించుకున్న ఫొటోలు జాతీయ మీడియాలో మెరిశాయి.

ఫొటో సోర్స్, Getty Images
పొత్తు ఎందుకు విఫలమైంది?
భారత్‌లో ఉత్తర్ ప్రదేశ్.. రాజకీయంగా కీలకమైన రాష్ట్రం. దేశంలోనే ఎక్కువ లోక్‌సభ స్థానాలను కలిగిన రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. 2014లో బీజేపీ కూటమి 71 స్థానాల్లో గెలవగా, 2019లో 62 స్థానాల్లో గెలిచింది.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో, బీజేపీ గెలవడానికి దోహదం చేసిన సూత్రమే, ఇప్పుడు కూడా ఉపయోగపడింది అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎస్పీ, బీఎస్పీకి సంప్రదాయ ఓటుబ్యాంకును మినహాయించి, తక్కిన అన్ని కులాలు, వర్గాలపై బీజేపీ దృష్టి సారించింది.
మహాకూటమి వల్ల, ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు లాభం కంటే, నష్టమే కలిగిందని రాజకీయ శాస్త్రవేత్త గిల్స్ వెర్నియర్ అభిప్రాయపడ్డారు. మహాకూటమిలో భాగస్వాములయ్యాక, ఈ రెండు పార్టీల ఓటు శాతం బాగా పడిపోయింది. తాజా ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటు శాతం 7% పెరగగా, ఎస్పీ ఓటు శాతం 13.7%, బీఎస్పీ 26.3% ఓటు శాతాన్ని మాత్రమే సాధించగలిగాయి.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, సమాజ్‌వాది పార్టీ, తన సంప్రదాయ ఓటు బ్యాంకయిన యాదవ సామాజికవర్గంలో ప్రాబల్యం కోల్పోయింది. ఇలాంటప్పుడు మేం మరిన్ని సీట్లు సాధించడంలో సహాయం చేసే స్థితిలో ఆ పార్టీ లేదు అని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అఖిలేష్ యాదవ్ భార్యతోపాటు ఆ పార్టీ ప్రముఖులు కూడా ఓడిపోయిన విషయం గుర్తుచేశారు.
అఖిలేష్ దంపతుల గురించి మాట్లాడుతూ,
''అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ ఇద్దరూ నన్ను చాలా గౌరవించారు. మా మధ్యనున్న అంతరాలను మర్చిపోయి వారిని నేను కూడా గౌరవించాను. రాజకీయాలకు అతీతంగా మా స్నేహం కొనసాగుతుంది'' అన్నారు.
ఇవి కూడా చదవండి
- దిల్లీ మెట్రో రైలు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం - అరవింద్ కేజ్రీవాల్
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
- 45 రోజుల్లో 99 శాతం దోమల నిర్మూలన.. సాలీడు విషంతో చేసిన ప్రయోగాలు సక్సెస్
- తెలంగాణకు ఐదేళ్లు: విలీనం నుంచి విభజన దాకా..
- అమెరికా వీసా: ‘సరదాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రమాదంలో పడేయొచ్చు’
- ఇచట అమ్మానాన్నలు, భార్యాభర్తలు అద్దెకు ఇవ్వబడును
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








