ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: మహిళా ఎమ్మెల్యేలలో అత్యధికులు గుంటూరు జిల్లా నుంచే

రోజా, మాధవీలత

ఫొటో సోర్స్, FACEBOOK/ROJASELVAMANI/ACTORMADHAVILATHA

ఫొటో క్యాప్షన్, రోజా వైసీపీ తరఫున, మాధవీలత బీజేపీ తరఫున పోటీ చేశారు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,186 మంది అభ్యర్థులు పోటీ పడగా, వారిలో మహిళా అభ్యర్థులు 187 మంది మాత్రమే. మరి, ఆ కొద్ది మంది మహిళల్లోనూ గెలిచిందెవరు? ఓడిందెవరు?

రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా, తాజాగా గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 14 మంది మాత్ర‌మే మ‌హిళ‌లు ఉన్నారు. అంటే, 8 శాతం సీట్లు మాత్రమే మహిళలకు దక్కాయి.

రాష్ట్రంలో మొత్తం 1,98,79,421 మంది మ‌హిళా ఓట‌ర్లున్నారు. ఈ సంఖ్య పురుషుల క‌న్నా ఎక్కువే. పురుష ఓటర్లు 1,94,62,339 మాత్ర‌మే.

వారిలో 1,57,87,759 మంది మహిళలు, 1,55,45,211 మంది పురుషులు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అంటే, ఓటింగ్‌లోనూ మ‌హిళ‌లే ముందున్నారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వ‌ర‌కూ క్యూలో నిలబడి మ‌హిళ‌లు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

ఫ‌లితాల్లో మాత్రం మ‌హిళ‌ల ప్రాతినిధ్యం నామమాత్రంగా క‌నిపిస్తోంది. ఈసారి మ‌హిళా ఎమ్మెల్యేల్లో అత్య‌ధికంగా గుంటూరు జిల్లా నుంచి విజ‌యం సాధించారు.

ఈ జిల్లాలో వైసీపీ త‌రఫున ముగ్గురు మ‌హిళా ఎమ్మెల్యేలు విజ‌యం సాధించారు. వారిలో సీనియ‌ర్ ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌ర‌తి ప్ర‌త్తిపాడు నుంచి, తొలిసారిగా బ‌రిలో దిగిన విడ‌ద‌ల ర‌జ‌నీ చిల‌క‌లూరిపేట నుంచి, ఉండ‌వ‌ల్లి శ్రీదేవి తాడికొండ నుంచి గెలుపొందారు.

ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసిన మహిళాల్లో గెలిచిందెవరు? ఓడిందెవరు?

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నుంచి విడద‌ల ర‌జినీ వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు.

ఫొటో సోర్స్, VIDADALARAJINI/FACEBOOK

ఫొటో క్యాప్షన్, గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నుంచి విడద‌ల ర‌జినీ వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు

ఎక్కువ మంది వైసీపీ వారే

శ్రీకాకుళం నుంచి ఇద్ద‌రు మ‌హిళా ఎమ్మెల్యేలు ఎన్నిక‌య్యారు. వారిలో పాల‌కొండ నుంచి విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి వ‌రుస‌గా రెండోసారి గెలిచారు. వైసీపీ త‌రఫున గెలిచిన ఆమెతో పాటుగా ఈసారి రెడ్డిశాంతి పాత‌ప‌ట్నం నుంచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి రెడ్డి శాంతి ఓట‌మి పాల‌యిన‌ప్ప‌టికీ ఈసారి శాస‌న‌స‌భ‌లో సీటు ద‌క్కించుకున్నారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం నుంచి వైసీపీ త‌రఫున పాముల పుష్ప శ్రీవాణి మ‌రోసారి విజ‌యం సాధించారు.

విశాఖ జిల్లా పాడేరు నుంచి కొత్త‌ప‌ల్లి భాగ్య‌ల‌క్ష్మి కూడా వైసీపీ అభ్య‌ర్థిగా తొలిసారిగా బ‌రిలో దిగి గెలిచారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరులో వైసీపీ త‌రుపున పోటీ చేసిన తానేటి వ‌నిత విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆమె గ‌తంలో టీడీపీ త‌రఫున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌యిన‌ప్ప‌టికీ ఈసారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి కూడా ఇద్ద‌రు మ‌హిళా ఎమ్మెల్యేలు చెరో పార్టీ నుంచి గెలిచారు. ఇద్ద‌రూ మొద‌టిసారిగా పోటీ చేసి విజ‌యం సాధించ‌డం విశేషం. వారిలో 'రాజ‌మండ్రి సిటీ' స్థానం నుంచి కేంద్ర‌ మాజీ మంత్రి ఎర్రంనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భ‌వానీ టీడీపీ త‌రుపున పోటీచేసి గెలుపొందారు. రంప‌చోడ‌వ‌రం నుంచి ఉపాధ్యాయురాలిగా ప‌నిచేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నాగుల‌ప‌ల్లి ధ‌న‌ల‌క్ష్మి విజయం సాధించారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పాముల పుష్పశ్రీవాణి గెలిచారు

ఫొటో సోర్స్, FACEBOOK/PUSHPA SREEVANI

ఫొటో క్యాప్షన్, విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పాముల పుష్పశ్రీవాణి గెలిచారు

అనంత‌పురం జిల్లాలో కూడా ఇద్ద‌రికి అవ‌కాశం ద‌క్కింది. శింగ‌న‌మ‌ల నుంచి జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి రెండో ప్ర‌య‌త్నంలో గెలుపొందారు. క‌ళ్యాణ‌దుర్గం నుంచి ఉష‌శ్రీ చ‌ర‌ణ్ కూడా విజ‌యం సాధించారు. ఈ ఇద్ద‌రూ వైసీపీ తరఫున గెలిచారు.

క‌ర్నూలు జిల్లా పత్తికొండలో కే. శ్రీదేవి గెలిచారు. ఆమె తొలిసారిగా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి వార‌సుడిగా రంగంలో దిగిన కేఈ శ్యామ్‌ని ఓడించారు.

చిత్తూరు జిల్లా నుంచి ఒక్క‌రికే అవ‌కాశం ద‌క్కింది. సీనియ‌ర్ నేత ఆర్కే రోజా వ‌రుస‌గా రెండోసారి న‌గ‌రి నుంచి వైసీపీ త‌రఫున విజ‌యం సాధించారు. అంత‌కుముందు ఆమె రెండుసార్లు టీడీపీ త‌రఫున బ‌రిలో నిలిచి ఓట‌మి పాల‌య్యారు.

కృష్ణా, ప్ర‌కాశం, నెల్లూరు, క‌డ‌ప‌ జిల్లాల్లో ఒక్క మ‌హిళ‌కు కూడా ప్రాతినిధ్యం ద‌క్క‌లేదు. ఈ నాలుగు జిల్లాల ప‌రిధిలోని 48 అసెంబ్లీ స్థానాల‌కు గానూ ఒక్క మ‌హిళ‌కు చోటు లేక‌పోవ‌డం విశేషంగా క‌నిపిస్తోంది.

వివిధ పార్టీల త‌రుపున పోటీ చేసేవారి సంఖ్యే త‌క్కువ‌గా క‌నిపించ‌గా వారిలో విజ‌యం ద‌క్కించుకున్న వారు మ‌రింత త‌క్కువ‌గా ఉన్నారు.

అరకు లోక్‌సభ స్థానం నుంచి తండ్రి కిషోర్ చంద్ర దేవ్ పై పోటీ చేస్తున్న శ్రుతి దేవి (కాంగ్రెస్)

ఫొటో సోర్స్, SRUTHI DEVI/FB

ఫొటో క్యాప్షన్, అరకు లోక్‌సభ స్థానం నుంచి తండ్రి కిషోర్ చంద్ర దేవ్‌పై పోటీ చేసిన శ్రుతి దేవి (కాంగ్రెస్) పరాజయం పొందారు

పార్లమెంటుకు వెళ్తున్నది ఎవరు?

ఏపీ నుంచి పార్ల‌మెంట్‌కు న‌లుగురు మ‌హిళ‌లు విజ‌యం సాధించారు. ఆ న‌లుగురూ వైసీపీ అభ్య‌ర్థులే.

25 మంది ఎంపీల‌కు గానూ న‌లుగురు మ‌హిళా నేత‌లు విజ‌యం ద‌క్కించుకోగా వారిలో సీనియ‌ర్ నాయకురాలు వంగా గీత ఉన్నారు. ఆమె గ‌తంలో ఏపీ అసెంబ్లీతో పాటుగా రాజ్య‌స‌భ‌కు కూడా ప్రాతినిధ్యం వ‌హించారు. ఈసారి పార్ల‌మెంట్‌లో దిగువ స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

తొలిసారిగా పోటీ చేసిన మ‌రో ముగ్గురు మ‌హిళా నేత‌లు డాక్ట‌ర్ భీశెట్టి వెంక‌ట స‌త్య‌వతి అన‌కాప‌ల్లి నుంచి, గొడ్డేటి మాధ‌వి అర‌కు నుంచి, చింతా అనురాధ అమ‌లాపురం నుంచి గెలిచారు.

2014 ఎన్నిక‌ల్లో ఏపీ నుంచి ఇద్ద‌రు మ‌హిళ‌లు మాత్ర‌మే ఎంపీలుగా గెలిచారు. క‌ర్నూలు నుంచి బుట్టా రేణుక‌, అర‌కు నుంచి కొత్త‌ప‌ల్లి గీత అప్ప‌ట్లో గెల‌వ‌గా, ఈసారి వారిద్ద‌రూ పోటీకి దూరంగా ఉన్నారు. అయినా, మ‌హిళా ప్రాతినిధ్యం రెట్టింప‌య్యింది.

వైసీపీ పత్తికొండ అభ్యర్థి శ్రీదేవి

ఫొటో సోర్స్, SRIDEVI/FB

ఫొటో క్యాప్షన్, కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ తరఫున బరిలో నిలిచిన శ్రీదేవి విజయం సాధించారు

33 రిజర్వేషన్ ఇవ్వాల్సిందే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో మ‌హిళ‌లకు త‌గిన రీతిలో ప్రాతినిధ్యం ద‌క్క‌క‌పోవ‌డం ప‌ట్ల ఐద్వా రాష్ట్ర కార్య‌ద‌ర్శి డి. ర‌మాదేవి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆమె త‌న అభిప్రాయాల‌ను బీబీసీతో పంచుకున్నారు.

"దాదాపుగా అన్ని పార్టీల‌లోనూ మ‌హిళ‌ల‌కు త‌గిన ప్రాతినిధ్యం ద‌క్క‌లేదు. గెలుపు గుర్రాల పేరుతో పోటీ చేసే అవ‌కాశ‌మే అంతంత‌మాత్రంగా ద‌క్క‌డంతో గెలిచిన వారి సంఖ్య కూడా నామ‌మాత్రంగా ఉంది. ఓటర్లలో స‌గానికి పైగా ఉన్న మ‌హిళ‌ల‌కు అందుకు త‌గ్గ‌ట్టుగా అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో మ‌హిళా స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న కూడా అదే రీతిలో ఉంటోంది. ఓట్ల కోసం మ‌హిళ‌ల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేసిన పార్టీల నేత‌లు పోటీ చేసేందుకు మాత్రం వారికి అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. మహిళలకు 33 శాతం రిజ‌ర్వేష‌న్ కల్పించే బిల్లు ఆమోదించాల్సిన అవ‌స‌రాన్ని ఈ అనుభ‌వం మ‌రోసారి చాటుతోంది. ఈ స‌భ‌లోన‌యినా అందుకు త‌గ్గ‌ట్టుగా నిర్ణ‌యం తీసుకోవాలి" అని ఆమె అన్నారు.

విజ‌య‌వాడ‌కు చెందిన ర‌చ‌యిత దుట్టా శ‌మంత‌క‌మ‌ణి మాట్లాడుతూ... మ‌హిళ‌ల‌కు చ‌ట్ట స‌భ‌ల్లో ప్రాతినిధ్యం ద‌క్క‌క‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు.

"మ‌హిళ‌లు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. రాజ‌కీయాల్లో కూడా ముందుకొస్తున్నారు. కానీ, అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో తెర‌మ‌రుగు అవుతున్నారు. ఏపీ అసెంబ్లీలో అతి త‌క్కువ సంఖ్య‌లో మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం ద‌క్క‌డానికి రాజ‌కీయ పార్టీలు, నేత‌ల తీరే కార‌ణం. ఈ తీరు మారాల్సిన అవ‌స‌రం ఉంది" అని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)