లసిత్ మలింగ: ఒక్క బాల్‌తో జీరో నుంచి హీరోగా...

మలింగ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శివకుమార్ ఉళగనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఊహకందని పరిణామాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు క్రీడల్లో ఎప్పుడూ చోటుచేసుకుంటుంటాయి. క్రికెట్ కూడా అలాంటి ఆటే. ఇందులో ఒక్క క్షణమే విజేతలను, పరాజితులను నిర్ణయిస్తుంది. అందుకే క్రికెట్‌ను అనుక్షణం ఉత్కంఠ కలిగించే అద్భుతమైన ఆటగా వర్ణిస్తుంటారు.

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మే12న హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇలాంటిదే.

12 బంతుల్లో 18 పరుగులు చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)దే విజయం. అది కూడా చేతిలో ఆరు వికెట్లు ఉన్నప్పుడు. ఇంకా షేన్ వాట్సాన్ క్రీజులోనే ఉన్నాడు. ఇలాంటి కీలక సమయంలో ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ డీ కాక్ వికెట్ల వెనకాల బంతిని వదిలేశాడు. చివరి ఓవర్లలో కేవలం 9 పరుగులు చేస్తే చాలు ధోనీ సేనదే కప్పు. అందరూ సీఎస్‌కే గెలుపు ఖాయమని భావించారు.

కానీ, చివరి ఓవర్ మ్యాచ్‌ను అనూహ్యంగా మలుపు తిప్పుతుందని ఎవరూ ఊహించలేదు. చివరి బంతికి రెండు పరుగులు చేస్తే మ్యాచ్ గెలుస్తుందనగా మలింగ బంతికి శార్థూల్ ఠాకూర్ వికెట్ల ముందు దొరికిపోయాడు.

మలింగ

ఫొటో సోర్స్, Getty Images

అనుభవాన్నే నమ్మాడు

100కు పైగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన మలింగ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు కూడా. కానీ, ఎంతో అనుభవం, నైపుణ్యం ఉన్నా ఆటగాడైనా చివరి ఓవర్లలో బౌలింగ్ చేస్తున్నప్పుడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కోక తప్పదు.

వాస్తవానికి, మ్యాచ్ చివరి ఓవర్ వరకు మలింగ ప్రదర్శన అంత గొప్పగా ఏమి లేదు. వాట్సాన్, బ్రావో అతని బౌలింగ్‌లో బాగానే పరుగులు పిండుకున్నారు. మొదటి మూడు ఓవరల్లో మలింగ 42 పరుగులిచ్చాడు.

చాలా మంది అభిమానులు మలింగ చివరి ఓవర్ వేస్తాడని అనుకోలేదు. పాండ్యా సోదరుల్లో ఒకరు చివరి ఓవర్ వేస్తారని అనుకున్నారు. కానీ, రోహిత్ శర్మ... అనుభవాన్నే నమ్మాడు. బాల్‌ను మలింగ చేతికి ఇచ్చాడు. చివరకి ఆ నిర్ణయం అద్భుతంగా పనిచేసింది.

ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన మలింగ మొత్తం 16 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో ఎన్నో గొప్ప ప్రదర్శనలు చేసిన మలింగ 2017 తర్వాత ఆ స్థాయికి మించి రాణించింది ఇప్పుడే.

ఒక వేళ మలింగ చివరి బంతికి వికెట్ తీయకపోతే సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ, అదృష్టం వెంటాడటంతో విజేతగా నిలిచాడు.

ఉత్కంఠబరిత మ్యాచ్‌లో అద్భుతంగా చెలరేగడం మలింగకు కొత్తేమీ కాదు. శ్రీలంక తరుఫున ఆడుతున్నప్పుడు , గత ఐపీఎల్‌ల్లో ఇలాంటి ప్రదర్శనలు చాలా సార్లు చేశాడు.

చివరి ఓవర్లో విజయ లక్ష్యం 10 పరుగులు కంటే తక్కువ ఉన్నప్పుడు బ్యాటింగ్ జట్టును ఓడించడం ఐపీఎల్‌ ఫైనల్ లో ఇదే తొలిసారి కాదు.

2017 ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తరపున మిచెల్ జాన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేసి పుణె సూపర్ గెయింట్స్‌కు విజయం దక్కకుండా చేశాడు.

మలింగ

ఫొటో సోర్స్, Getty Images

ఒక్క బాల్‌తో హీరోలయ్యారు

1997లో కరాచీలో తీవ్ర ఉత్కంఠతతో కొనసాగుతున్న మ్యాచ్‌లో రాజేష్ చౌహాన్.. సక్లయిన్ ముస్తాక్ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టాడు. తన బౌలింగ్ ప్రదర్శనల కంటే ఈ మ్యాచ్ గురించే రాజేష్ చౌహాన్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

పాకిస్తాన్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో చివరి ఓవర్లో హృషికేశ్ కనిత్కర్ ఫోర్ బాది ఫలితాన్ని తారుమారు చేశాడు.

చేతన్ శర్మ బౌలింగ్‌లో మ్యాచ్ చివరి బంతికి సిక్సర్ కొట్టి పాక్‌ను గెలిపించిన జావెద్ మియాందాద్ ఇన్నింగ్స్‌ను భారత అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.

అకస్మాత్తుగా మలుపు తిరిగే ఇలాంటి మ్యాచ్‌ల్లో కొన్ని విషాదాలూ ఉన్నాయి.

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ చివరి ఓవర్లో బౌలింగ్ చేసి రెండు సార్లు ఇబ్బంది పడ్డాడు. టీ20 ఫైనల్‌లో వెస్టిండిస్ ఆటగాడు బ్రూత్‌వైట్ అతడి బౌలింగ్‌లో వరసుగా 4 సిక్సులు కొట్టాడు. సీఎస్‌కే తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లలో కూడా మరోసారి భంగపడ్డాడు. బంతితోనూ, బ్యాట్‌తోనూ జట్టుకు ఎన్నో విజయాలు తెచ్చిపెట్టినప్పటికీ ఈ రెండు ఓవర్లు స్టోక్స్ నైపుణ్యాన్ని ప్రశ్నించాయి.

మలింగ

ఫొటో సోర్స్, Getty Images

భారత్ 2011లో వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర వహించిన యువరాజ్ సింగ్ 2014లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో పేలవ ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు.

అయితే, తమ కెరీర్‌లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోక తప్పదని ఆటగాళ్లకు తెలుసు.

అలన్ డొనాల్డ్ ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎదుర్కోలేడని, తానే బ్యాటింగ్ చేయాలని భావించి సాధ్యంకాని పరుగు కోసం ప్రయత్నించి లాన్స్ క్లుసేనర్ అవుట్ అయ్యాడు.

నిజానికి అంతకు ముందువరకు క్లుసేనరే 1999 వరల్డ్ కప్ హీరో. ఈ తప్పిదం దక్షిణాఫ్రికాను వరల్డ్ కప్ నుంచి దూరం చేసింది.

2015 సెమీ ఫైనల్‌లోనూ దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడింది. రాస్ టైలర్ వికెట్ పడటంతో ఇక తాము వరల్డ్ కప్ ఫైనల్‌కు వచ్చేస్తామని ఆ జట్టు భావించింది.

కానీ, గ్రాండ్ ఇలియట్ తన జీవితంలో మరిచిపోలేని ఇన్నింగ్స్ ఆడి దక్షిణాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లాడు.

అందుకే, క్రీడలను రోలర్ కోస్టర్‌తో పోలుస్తారు. ఇందులో అందరు ఆటగాళ్లు ఎప్పుడో ఒకసారి ఎత్తు పల్లాలు చూడక తప్పదు. ఆదివారం లసిత్ మలింగ, ముంబై ఇండియన్ జట్టు ఆటతీరు ఇలానే కొనసాగింది. ఆట చివరి క్షణం వరకు మన ప్రదర్శనపై మనం నమ్మకం ఉంచాలనడానికి ఈ మ్యాచ్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)