మోదీ ప్రభుత్వం 200 టన్నుల బంగారాన్ని విదేశాలకు పంపించిందా?- Fact Check

బంగారు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
    • హోదా, బీబీసీ న్యూస్

నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం ఆర్‌బీఐకి చెందిన 200 టన్నుల బంగారం నిల్వలను రహస్యంగా విదేశాలకు తరలించిందంటూ ఓ తప్పుడు సందేశం సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ అవుతోంది.

ఆ సందేశాన్ని పరిశీలించి అందులో వాస్తవమెంతో తెలియజేయాలంటూ మా పాఠకుడు ఒకరు వాట్సాప్‌లో మాకో ఫొటో పంపారు.

"ఇది మరో భారీ కుంభకోణం. 200 టన్నుల బంగారాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి దొంగిలించారు. #చౌకీదార్‌చోర్‌హై" అంటూ ఆ సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

దక్షిణ దిల్లీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి, జర్నలిస్టు నవనీత్ చతుర్వేది ఆర్‌టీఐ ద్వారా సేకరించిన వివరాలతో నేషనల్ హెరాల్డ్ పత్రిక ఇటీవల ఒక కథనాన్ని ప్రచురించింది.

ఆ వార్తా కథనాన్ని ఆధారంగా చేసుకుని ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు.

నేషనల్ హెరాల్డ్ పత్రిక

ఫొటో సోర్స్, Social media

కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక ట్విటర్ హ్యాండిల్ కూడా గురువారం ట్వీట్ చేసింది. "2014లో ఆర్‌బీఐకి చెందిన 200 టన్నుల బంగారాన్ని మోదీ ప్రభుత్వం స్విట్జర్లాండ్‌కు రహస్యంగా తరలించిందా? మరి ఆ బంగారానికి బదులుగా మన ప్రభుత్వానికి ఏం వచ్చింది? ఈ లావాదేవీకి సంబంధించిన వివరాలను ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉంచలేదు?" అని ఆ ట్వీట్‌లో ప్రశ్నించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కాంగ్రెస్ పార్టీకి చెందిని మరికొన్ని అధికారిక ట్విటర్ హ్యాండిల్స్ కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేశాయి.

కానీ, ఆర్‌బీఐ ప్రకారం, మోదీ ప్రభుత్వం మీద చేస్తున్న ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడైంది.

"2014లో గానీ, ఆ తర్వాత కానీ ఆర్‌బీఐకి చెందిన బంగారం నిల్వలను భారత్ నుంచి మరే దేశానికీ తరలించలేదు" అని ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాల్ చెప్పారు.

ఆర్‌బీఐ

ఫొటో సోర్స్, Getty Images

ఆరోపణలకు ఆధారం ఏంటి?

తనను తాను పరిశోధనాత్మక జర్నలిస్టుగా చెప్పుకునే నవనీత్ చతుర్వేది, నరేంద్ర మోదీ ప్రభుత్వం రహస్యంగా 200 టన్నుల బంగారాన్ని విదేశాలకు తరలించేసిందని ఆరోపిస్తూ 2019 మే 1న లింక్‌డిన్‌లో పోస్ట్ చేశారు.

బంగారం నిల్వల తరలింపునకు సంబంధించిన సమాచారాన్ని ప్రతిపక్ష పార్టీకి, ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచిందని ఆయన ఆరోపించారు. దేశానికి చెందిన బంగారం నిల్వలను మోదీ ప్రభుత్వం తనఖా పెట్టిందని అన్నారు.

2018లో ఆర్‌టీఐ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఆ ఆరోపణలు చేశాను. నేను వేసిన పిటిషన్‌కు ఆర్‌బీఐ స్పందిస్తూ... 268.01 టన్నుల బంగారం నిల్వలు విదేశాల్లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్‌లో సురక్షితంగా ఉన్నాయి" అని చతుర్వేది బీబీసీతో చెప్పారు.

అయితే, ఆ బంగారం నిల్వలకు సంబంధించిన విషయం రహస్యమేమీ కాదు. దానికి సంబంధించిన వివరాలను 2018 జూలై 6న ఆర్‌బీఐ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.

2014, 2015 ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ల ఫార్మాట్‌ను మార్చడం వల్ల ఈ గందరగోళం పెరిగిందని చతుర్వేది అన్నారు.

’’విదేశాల్లో బంగారం నిల్వలు లేవన్న విషయాన్ని 2014 బ్యాలెన్స్ షీట్‌లో ఆర్‌బీఐ స్పష్టంగా పేర్కొంది. కానీ, 2015 షీట్‌లో మాత్రం ఆ స్పష్టత లేదు" అని ఆయన చెప్పారు.

కానీ, 2014 బ్యాలెన్స్ షీట్‌లో ఉన్నట్లుగా 2015 షీట్‌లోనూ వివరాలన్నీ స్పష్టంగా ఉన్నాయి.

ఆర్‌బీఐ

ఫొటో సోర్స్, Getty Images

తాజాగా శుక్రవారం ఆర్‌బీఐ పత్రికా ప్రకటన విడుదల చేసింది. "ఒక దేశానికి చెందిన రిజర్వ్ బ్యాంకు తన బంగారం నిల్వలను విదేశాల్లోని రిజర్వ్ బ్యాంకుల్లో భద్రపరచడం సాధారణంగా ఎప్పుడూ జరిగేదే" అని తెలిపింది.

తాజా వ్యవహారంపై సీనియర్ ఆర్థిక నిపుణులు ఎన్.సుబ్రమణియన్‌తో బీబీసీ మాట్లాడింది.

ఇది మన బంగారం, అది ఏ దేశంలో భద్రపరిచారన్నది సమస్య కాదు. ఒక దేశం నుంచి బంగారం తీసుకెళ్లి మరో దేశంలో భద్రపరచడం సాధారణంగా జరిగే విషయమే. విదేశాలకు తరలించినంత మాత్రాన ఆ బంగారాన్ని తనఖా పెట్టినట్లు కాదు. మన బంగారాన్ని అమెరికా లేదా బ్రిటన్ తీసుకెళ్లి అక్కడి సెంట్రల్ బ్యాంకులో భద్రపరచగానే అది వాళ్లకు చెందదు. అది మన బంగారమే" అని సుబ్రమణియన్‌ వివరించారు.

2018 నవంబర్‌లో ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత్ 586.44 టన్నుల బంగారం నిల్వలు కలిగి ఉంది. అందులో 298.14 టన్నుల బంగారం విదేశాల్లో సురక్షితంగా భద్రపరిచి ఉంది.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

1991లో 67 టన్నుల బంగారం తనఖా

గల్ఫ్ వార్ అనంతరం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం, దేశంలో రాజకీయ అస్థిరత వంటి పరిణామాలతో 1991లో భారత విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి.

భారత్ చేతిలో కేవలం మూడు వారాల దిగుమతులకు అవసరమైన విదేశీ మారక ద్రవ్యం మాత్రమే ఉంది. దాంతో, విదేశీ మారక నిల్వలను పెంచేందుకు భారత ప్రభుత్వం అప్పటికప్పుడు 67 టన్నుల (67,000 కిలోలు) బంగారాన్ని విదేశాల్లో తనఖా పెట్టాల్సి వచ్చింది.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)