రాయలసీమలో హింస: తాడిపత్రిలో టీడీపీ కార్యకర్త, తంబళ్లపల్లెలో వైసీపీ సానుభూతిపరుడు మృతి... పలువురికి గాయాలు

ఫొటో సోర్స్, Madhu
రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వీరాపురంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కర్రలతో, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దాడిలో టీడీపీ కార్యకర్త సిద్దా భాస్కరరెడ్డి చనిపోయారు. గాయపడ్డ వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘర్షణలో నలుగురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేసి ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేశారు.
ఈ రెండు వర్గాల మధ్య ముందు నుంచి కక్షలు ఉన్నాయని అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బీబీసీతో అన్నారు. ఓటు వేయడానికి ఇరు పక్షాలు ఒకేసారి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నప్పుడు వాగ్వాదం జరిగిందని, పరస్పరం దాడులు చేసుకున్నారని ఆయన అన్నారు.
ఈ దాడిలో భాస్కరరెడ్డి అనే టీడీపీ కార్యకర్త మరణించగా, వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అశోక్ కుమార్ వివరించారు.
చిత్తూరు జిల్లాలో ఘర్షణ, ఒకరు మృతి
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పీటీఎం మండలం టీ.సదుము గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో వైసీపీ సానుభూతిపరుడు వెంకటరమణా రెడ్డి మృతి చెందారని ములకలచెరువు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
చిత్తూరులో ఎం.ఎస్.బాబుపై దాడి
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కలకడ కట్టకింద పల్లి దగ్గర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ బాబుపై దాడి జరిగింది. వాహనం ధ్వంసమైంది. ఈ దాడి టీడీపీ కార్యకర్తలే చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.
చంద్రగిరిలో పలువురికి గాయాలు
రామచంద్రపురం మండలం కొత్త కండ్రిగలో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
సింగనమల, ఆళ్లగడ్డలో ఘర్షణలు
అనంతపురం జిల్లా సింగనమల, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య పోలింగ్ సందర్భంగా ఘర్షణలు జరిగాయి. సింగనమలలో రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో వైసీపీకి చెందిన గంగుల వర్గం, టీడీపీకి చెందిన భూమా వర్గం మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు చెల్లాచెదురు చేశారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు గాయపడ్డారు. టీడీపీ ఆళ్లగడ్డ అభ్యర్థి భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.

పూతలపట్టు నియోజకవర్గం బందార్లపల్లెలో ఘర్షణ పడుతున్న వైసీపీ, టీడీపీ వర్గాలను పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2
రాప్తాడులో వాగ్వాదం
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం మరూరలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది.
టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై వైసీపీ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. కొంత సేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సర్ది చెప్పడంతో పరిటాల శ్రీరామ్ అక్కడి నుంచి వెళ్లి పోయారు.
అనంతపురం: ఈవీఎంను పగులగొట్టిన జనసేన అభ్యర్థి
అనంతపురం జిల్లా గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగులగొట్టారు.

ఫొటో సోర్స్, UGC
గుత్తి బాలికోన్నత పాఠశాల 183వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన మధుసూదన్ గుప్తా.. "ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు ఎక్కడ ఓటు వేయాలన్నది ఎందుకు స్పష్టం చేయలేదు" అంటూ ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. ఆ సందర్భంగా ఈవీఎంను ఆయన నేలపై విసిరికొట్టడంతో అది ధ్వంసమైంది. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(ఈవీఎం ధ్వంసం వీడియో: దుర్గాప్రసాద్)
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 3
ఈ ఘటనపై మధుసూదన్ గుప్తా బీబీసీతో మాట్లాడుతూ- ఈవీఎం తన చేయి తగిలి కింద పడి పగిలిపోయిందని చెప్పారు.
"నేను ఓటు వేయడానికని ఉదయం 8 గంటలకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాను. అక్కడ ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు ఎక్కడ ఓటు వేయాలనే సూచన లేదు. గుంతకల్‌లో అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన నుంచి నేనున్నాను. జనసేన తరపున పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎవరూ లేరు. ఇలాంటి సూచన లేకపోవడం వల్ల నేను నష్టపోతాను. నేను దీనిపై ప్రశ్నించాను. అధికారులు ఏమీ చెప్పలేదు. ఈ సమయంలో ఈవీఎం కిందపడి పగిలింది" అని ఆయన పేర్కొన్నారు.
గుత్తి ఘటనపై వెంటనే స్పందించి, జిల్లా అధికారులకు అదేశాలిచ్చామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది బీబీసీతో చెప్పారు.
"అక్కడ ప్రత్యామ్నాయ ఈవీఎంతో పోలింగ్ సజావుగా సాగుతోంది. ఎలాంటి అపోహలూ అవసరం లేదు. మాక్ పోలింగ్ ద్వారా అనుమానాలు తీర్చిన తర్వాతే పోలింగ్ ప్రారంభించాం. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా సాగుతోంది. ఈవీఎం సమస్యలు పరిష్కారం అవుతున్నాయి" అని ఆయన తెలిపారు.
కడప జిల్లాలో 43.92 శాతం
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఏపీ దక్షిణ భాగంలోని రాయలసీమలో ఎనిమిది లోక్‌సభ స్థానాలు, 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 14 చొప్పున అసెంబ్లీ స్థానాలు, కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అన్ని చోట్లా పోలింగ్ కొనసాగుతోంది.
మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి అధికారిక సమాచారం ప్రకారం కడప జిల్లాలో 43.92 శాతం, చిత్తూరు జిల్లాలో 42.6 శాతం, కర్నూలు జిల్లాలో 40 శాతం, అనంతపురం జిల్లాలో 38.8 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 40.53 శాతం ఓట్లు పోలయ్యాయి.

మొరాయించిన ఈవీఎంలు
పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలం శెట్టిపల్లి, బందార్లపల్లి, కుప్పం మండలంలోని పరమ సముద్రం, శాంతిపురం మండలంలోని ఎంకే పురం పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. పీలేరు పరిధిలోని 265వ పోలింగ్ కేంద్రంలోనూ ఈవీఎం మొరాయించింది. పుంగనూరులో 36, 43,46, 55,56 పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవీఎంలు పనిచేయలేదు.

ఫొటో సోర్స్, Hari Morsu
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం నార్లాపురం(ఎన్.వెంకటాపురం) గ్రామంలో పోలింగ్ ప్రారంభంలో ఈవీఎం మొరాయించింది. పదుల సంఖ్యలో ఓటర్లు ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఎన్నికల సిబ్బంది సన్నద్ధత సరిగా లేదంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. కొంత సమయం తర్వాత ఈవీఎం పనిచేయడం మొదలుపెట్టింది. ఓటింగ్ కొనసాగుతోంది.
నిన్న రాత్రి నుంచి ఆహారం అందలేదంటూ అనంతపురం ఆరో రోడ్డులోని ఆదర్శ పాఠశాలలో పోలింగ్ సిబ్బంది అరగంటపాటు విధులకు దూరంగా ఉన్నారు. ఈవీఎంలు కూడా మొరాయించడంతో అలస్యంగా తొమ్మిది గంటలకు పోలింగ్ మొదలైంది.
రాయలసీమ: పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల జాబితా
రాయలసీమ: అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితా
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








