తెలంగాణ: ముగిసిన లోక్‌సభ ఎన్నికలు... 60.57 శాతం పోలింగ్

ఫొటో సోర్స్, ugc
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు ముగిశాయి. పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్రంలో 60.57 శాతం ఓటింగ్ నమోదైంది. మెదక్ పార్లమెంట్ పరధిలో అత్యధికంగా 68.25 శాతం పోలింగ్ నమోదవగా, సికింద్రాబాద్‌లో అత్యల్పంగా 39.20 శాతం పోలింగ్ నమోదైంది.
17 పార్లమెంట్ స్థానాలకు మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడగా, మెదక్ పార్లమెంట్ స్థానానికి అత్యల్వంగా 10 మంది బరిలోకి దిగారు.
ఈసారి ఎన్నికల్లో 25 మంది మహిళలు పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మొత్తం 17 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపగా, ఎంఐఎం ఒక్క హైదరాబాద్ నుంచే పోటీకి దిగింది.
బీఎస్పీ 5, సీపీఐ 2, సీపీఎం 2 చోట్ల తన అభ్యర్థులను బరిలోకి దింపింది. స్వతంత్ర అభ్యర్థులు 299 మంది ఈ సారి ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.

ఫొటో సోర్స్, kavitha/fb
ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఉదయం సిద్ధిపేట నియోజకవర్గం చింతమడక చేరుకున్నారు. అక్కడే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. బంజారాహిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి, నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన కవిత పొతంగల్‌లో ఓటు వేశారు. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా ఉంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సినీనటుడు చిరంజీవి సకుటుంబంగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్, కోడలు ఉపాసన, కూతురు శ్రీజ కూడా ఈ ఉదయమే తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు అల్లు ఆర్జున్ కూడా అక్కడికి చేరుకుని వోటు వేశారు.
ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ కూడా పోలింగ్ మొదలైన కాసేపటికే తన వోటు హక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బోయినపల్లి సెంట్ పీటర్స్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మంలో ఓటు వేశారు.
పాల్వంచలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. పోలింగ్ బూత్ ల వద్ద వచ్చిన ఓటర్లు ఓటు వేయకుండానే వెనుతిరుగుతున్నారు.

ఫొటో సోర్స్, ugc
ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్..
పోలింగ్ ముగిసే సయమానికి తెలంగాణలో మొత్తంగా 60.57 శాతం పోలింగ్ నమోదంది.

పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ రెండు చోట్ల నుంచి విజయం సాధించింది. బీజేపీ, టీడీపీ, ఎంఐఎం, వైసీపీ ఒక్కో స్థానంలో గెలుపొందాయి.

ఫొటో సోర్స్, fb/Chief Electoral Officer Telangana
నిజామాబాద్‌పై ప్రత్యేక దృష్టి
ఈసారి ఎన్నికల్లో దేశంలోనే అత్యధికంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుంటంతో ఎన్నికల సంఘం అక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ తొలిసారిగా ఎం3 ఈవీఎంలను వినియోగించారు. పోలింగ్ కేంద్రంలో L ఆకారంలో 12 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్‌ను అమర్చారు.
అంకెల్లో ఎన్నికల వివరాలు

దేశవ్యాప్తంగా 91 లోక్ సభ స్థానాలకు
మొత్తం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో పోలింగ్ జరుగుతుంది.
తొలి విడతలోనే అంటే ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు మొత్తం 20 రాష్ట్రాల్లో 91 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది.
రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 18, మూడో విడత ఏప్రిల్ 23, నాలుగో విడత ఏప్రిల్ 29, అయిదో విడత మే 6, ఆరో విడత మే 12, ఏడో విడత పోలింగ్ మే 19న జరుగుతుంది.
మే 23న దేశవ్యాప్తంగా ఒకేరోజు ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








