ఏడీఆర్ సర్వే: కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన రేటింగ్ ఎంత? ఓటర్ల టాప్ 3 ప్రాధాన్యాలేంటి?

తెలంగాణ సీఎం

ఫొటో సోర్స్, FACEBOOK/TRS

తెలంగాణలో గవర్నెన్స్ అంశాలపై ఓటర్ల ప్రాధాన్యత, ప్రభుత్వ పనితీరుపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తమ సర్వే నివేదికను విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా మొత్తం 534 లోక్‌సభ నియోజకవర్గాలలో 2018 అక్టోబర్, డిసెంబర్ మధ్య సర్వే నిర్వహించిన ఏడీఆర్ అందులో 2,73,487 మంది ఓటర్లు పాల్గొన్నారని తెలిపింది.

తెలంగాణలో నిర్వహించిన సర్వే ద్వారా రాష్ట్రంలో అతి ముఖ్యమైన 10 పాలనా సమస్యలను ఏడీఆర్ విశ్లేషించింది.

రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటరీ నియోజకవర్గాలలో జరిగిన ఏడీఆర్ సర్వేలో సుమారు 8,500 మంది ఓటర్లు పాల్గొన్నట్లు సంస్థ తమ నివేదికలో పేర్కొంది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో , అన్ని వర్గాలు, విభాగాల 18 ఏళ్లు నిండిన వారిని సర్వే కోసం ఎంపిక చేశారు. 95 శాతం కచ్చితత్వంతో సర్వేను నిర్వహించామని ఏడీఆర్ తమ నివేదికలో తెలిపింది.

ఏడీఆర్ సర్వేలో తెలంగాణలో వెల్లడైన ముఖ్యమైన అంశాలు

ఏడీఆర్ సర్వే

ఫొటో సోర్స్, ADR SURVEY

ఫొటో క్యాప్షన్, ఏడీఆర్ రిపోర్ట్- తెలంగాణ ఓటరు టాప్ 3 ప్రాధాన్యతలు, ప్రభుత్వ పనితీరు

తెలంగాణ సర్వే 2018 ప్రకారం మెరుగైన ఉపాధి అవకాశాలు (65.99%), మెరుగైన ఆస్పత్రులు/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (33.23%), మెరుగైన ప్రజా రవాణా (25.89%) ఓటరు ప్రాధాన్యాలలో టాప్-3 అంశాలుగా నిలిచాయి..

అయితే, ఈ మూడు అంశాల్లో ప్రభుత్వ పనితీరు మెరుగైన ఉపాధి అవకాశాలు(1.95 on a scale of 5), మెరుగైన ఆస్పత్రులు/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (1.89), ప్రజా రవాణా(2.51)కు సగటు కంటే తక్కువగా రేటింగ్ ఇచ్చారు.

ఏడీఆర్ సర్వే

ఫొటో సోర్స్, ADR SURVEY

ఫొటో క్యాప్షన్, ఏడీఆర్ రిపోర్ట్- ఓటరు ప్రాధాన్యతలు, ప్రభుత్వ పనితీరు(గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా)

గ్రామీణ తెలంగాణలో ఓటర్ల అగ్ర ప్రాధాన్యాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు(63%), వ్యవసాయ ఉత్పత్తులు మెరుగైన రాబడి(45%), విత్తనాలు/ఎరువులు కోసం వ్యవసాయ సబ్సిడీ(44%) శాతం ఉన్నాయి.

ఏడీఆర్ సర్వే

ఫొటో సోర్స్, ADR SURVEY

ఫొటో క్యాప్షన్, ఏడీఆర్ రిపోర్ట్-గ్రామీణ తెలంగాణ-ఓటరు ప్రాధాన్యతలు

గ్రామాల్లో మెరుగైన ఆస్పత్రులు/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(1.9), వ్యవసాయానికి నీటి లభ్యత(2.12) అంశాలకు ప్రభుత్వానికి సగటు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చారు.

ఏడీఆర్ సర్వే

ఫొటో సోర్స్, AD SURVEY

ఫొటో క్యాప్షన్, ఏడీఆర్ రిపోర్ట్-పట్టణ ఓటర్లు(తెలంగాణ) ప్రాధాన్యతలు

తెలంగాణ పట్టణ ఓటర్లు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న మొదటి మూడు అంశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు(71%), ధ్వని కాలుష్యం(50%), నీరు/వాయు కాలుష్యం (40%) ఉన్నాయి.

ఏడీఆర్ సర్వే

ఫొటో సోర్స్, ADR SURVEY

ఫొటో క్యాప్షన్, ఏడీఆర్ రిపోర్ట్-పట్టణ ఓటర్లు(తెలంగాణ)-ప్రభుత్వ పనితీరు

పట్టణ ఓటర్ల ప్రాధాన్యాలలో మెరుగైన ఉపాధి అవకాశాలు(1.81), ధ్వని కాలుష్యం(2.03), నీరు/వాయు కాలుష్యం(2.12) అంశాలకు ప్రభుత్వానికి సగటు కంటే తక్కువ రేటింగ్ లభించింది.

వాటితోపాటు పట్టణ ప్రాంతాల్లో మెరుగైన ఆస్పత్రులు/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(1.87), మైనింగ్/క్వారీ అరికట్టడం(2.06) అంశాల్లో కూడా ప్రభుత్వానికి తక్కువ రేటింగ్ వచ్చింది.

ఓటరు వైఖరి, అంశాల ప్రభావం

ఓటింగ్ ప్రవర్తనకు సంబంధించి మూడు అంశాలను విశ్లేషించడానికి సర్వే ద్వారా ప్రయత్నించినట్లు ఏడీఆర్ సంస్థ తెలిపింది.

1.ఓటింగ్ ప్రవర్తనను ప్రభావితం చేసే అంశాలు,

2.క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులపై ప్రజల అభిప్రాయం,

3.నేరాలు, డబ్బు పాత్ర గురించి ఓటరుకు ఉన్న అవగాహన

ఏడీఆర్ సర్వేలో ఓటర్లు ఈ మూడు అంశాలపై ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని నాగార్జున మోడల్ హై‌స్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన మహిళలు

తెలంగాణలో ఓటింగ్ తీరుపై ఏడీఆర్ సర్వే ఫలితాలు

  • తెలంగాణ సర్వే 2018 ప్రకారం, ఎక్కువ శాతం ఓటర్లు సీఎం అభ్యర్థి ఎవరన్నదాన్ని బట్టే ఓటు వేస్తామని చెప్పినట్టు ఏడీఆర్ తెలిపింది. తర్వాత అభ్యర్థి పోటీచేసే పార్టీని, చివరగా అభ్యర్థి ఎవరనేది చూసి ఓట్లు వేస్తామని ఓటర్లు చెప్పినట్లు పేర్కొంది.
  • ఒక అభ్యర్థికి ఓటు వేయాలంటే డబ్బు, మద్యం, బహుమతులు చాలా ముఖ్యం అని 25 శాతం మంది ఓటర్లు భావిస్తే, అలా తీసుకోవడం చట్టవిరుద్ధం అని తెలుసని 65 శాతం మంది ఏడీఆర్ సర్వేలో చెప్పారు. 63 శాతం మంది ఓటర్లు ఏ అభ్యర్థికి ఓటు వేయాలనేదానిపై సొంతంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
  • ఇక 96 శాతం ఓటర్లు నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు చట్టసభలకు వెళ్లకూడదని అభిప్రాయపడ్డారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. కానీ అభ్యర్థుల నేర సమాచారాన్ని క్రిమినల్ రికార్డుల ద్వారా పొందవచ్చనే విషయం 40 శాతం మందికే తెలుసని ఈ సర్వే ద్వారా వెల్లడించింది.
  • నేర చరితులైనా వారు చేసిన మంచి పనులు చూసి వారికి ఓటు వేస్తామని 35 శాతం మంది తెలంగాణ ఓటర్లు ఈ సర్వేలో చెప్పారు. నేరచరిత్ర ఉన్న అభ్యర్థి బాగా డబ్బు ఖర్చు పెట్టడం వల్లే అతడికి ఓటు వేస్తామని 32 శాతం మంది అంటే, అభ్యర్థులు చేసిన నేరాల సమాచారం తెలీక అతడికి వేస్తామని 31 శాతం, కులమతపరమైన అంశాలు మరో ముఖ్యమైన కారణం అని 21 శాతం ఓటర్లు చెప్పారు
  • 18 శాతం మంది ఓటర్లు అభ్యర్థుల మీద ఉన్న కేసులు తీవ్రమైనవి కాకపోవడం వల్ల వారికి ఓటు వేస్తామంటే, నేరచరిత్ర ఉన్న అభ్యర్థి చాలా బలమైన వ్యక్తి కావడం అతడికి ఓటు వేయడానికి కారణం అని 15 శాతం మంది ఓటర్లు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)