లోక్‌సభ ఎన్నికలు 2019: ముస్లిం మహిళలు రాజకీయ పార్టీల నుంచి ఏం కోరుకుంటున్నారు

ఖుర్షీదా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో నివసిస్తారు. తన భర్త ఆవు పాలు అమ్మేవారని ఆమె చెబుతున్నారు. "కానీ 2017లో గోరక్షకులు నా భర్తను కాల్చిచంపారు" అని ఆమె తెలిపారు. ఆమెకు ఎనిమిది మంది పిల్లలు. వారిని పోషించడం ఖుర్షీదాకు భారంగా మారింది.
"ఓరోజు ఉమర్ గహన్ కర్ గ్రామం నుంచి ఆవులను తీసుకొని వస్తున్నారు. రైల్వే గేట్ల సమీపంలో ఆయనపై కాల్పులు జరిపి, అక్కడే వదిలి వెళ్లిపోయారు" అని ఖుర్షీదా తెలిపారు.

గోరక్షణ పేరుతో జరుగుతున్న హత్యలను నిషేధించాలంటూ ఇటీవల ఖుర్షీదా దిల్లీ వచ్చి డిమాండ్ చేశారు.
దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి కూడా ముస్లిం మహిళలు ఆమెకు మద్దతుగా వచ్చారు.
వీరంతా కలసి ఓ మేనిఫెస్టో రూపొందించారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

"ముస్లింలు నివసించే ప్రాంతాల్లో పరిశుభ్రత కావాలి. విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపడాలి. సరైన రోడ్లు కావాలి. రోడ్లు ఇంత దారుణ పరిస్థితుల్లో ఎందుకుంటున్నాయి?" అని సైరా ఆరమ్ అనే మరో మహిళ ప్రశ్నిస్తున్నారు.

"మూక దాడులను, వదంతులతో జరిగే హత్యల నిరోధానికి ఓ చట్టం తీసుకురావాలి. నా డిమాండ్లలో ఇదొకటి. ఇంకో డిమాండ్ ఏంటంటే, ట్రిపుల్ తలాక్‌ను నేరంగా గుర్తించి శిక్షించడాన్ని రద్దు చేయాలి" అని షబీనా ముంతాజ్ కోరుతున్నారు.

"మహిళా రిజర్వేషన్ బిల్లును అన్ని పార్టీలు ఆమోదించాలి. అప్పుడే మహిళలు రాజకీయాల్లోకి ప్రవేశించడానికి అవకాశాలు పెరుగుతాయి. ఇంటిని, కుటుంబాన్ని, సమాజాన్ని మహిళలు చక్కబెట్టగలిగినప్పుడు, రాజకీయాల్లో కూడా వారు రాణించగలరు" అని అఖ్తరీ బేగమ్ అభిప్రాయపడ్డారు.

"మేం కూడా ఈ దేశంలో పౌరులమే. మాకూ సమాన హక్కులుంటాయి. మేం ముస్లింలమనే కారణంగా మాపై వివక్ష చూపిస్తే మేం సహించం" అని హసీనా ఖాన్ తెలిపారు.
మహిళలను కేవలం ఓటుబ్యాంకులా చూడొద్దని ఆమె కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి.
- ఇందిరా గాంధీ అంత్యక్రియలు ముస్లిం ఆచారాల ప్రకారం చేశారా? : Fact Check
- చైనాలో వీగర్ ముస్లింలు ఏమైపోతున్నారు?
- భారతదేశంలో ముస్లింల సమస్యల గురించి మనకు అవగాహన ఉందా?
- మసూద్ అజర్‌ను జమ్మూ జైలు నుంచి కాందహార్‌కు ఎలా తీసుకువచ్చారు...
- జలియాన్‌వాలా బాగ్ నరమేధం: ‘వందేళ్ల ఆ గాయాలు క్షమాపణలతో మానవు’
- 'ఎమ్మెల్యే గారూ, ముగ్గురు పిల్లల తల్లులపై కూడా అత్యాచారాలు జరుగుతాయ్!'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









