ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ఈ 10 కీలక స్థానాల్లో గెలిచేదెవరో...

ఫొటో సోర్స్, facebook/NaraLokesh
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలతో పాటు పలు నియోజకవర్గాల్లో జనసేన కూడా కీలకంగా మారింది.
ప్రధాన పార్టీల అధ్యక్షులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు మరికొన్నిటిపైనా ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
అక్కడ పోటీ చేస్తున్న నేతల కారణంగా కొన్ని.. స్థానిక రాజకీయాల కారణంగా మరికొన్ని నియోజకవర్గాలు ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
అలాంటి 10 నియోజకవర్గాలు ఇవి.

ఫొటో సోర్స్, facebook/TDP
కుప్పం: చంద్రబాబు వర్సెస్ చంద్రమౌళి
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి 1989 నుంచి నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక వైపు కర్నాటక, మరోవైపు తమిళనాడు రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్న ఈ నియోజకవర్గంలో 1985 నుంచి తెలుగుదేశం పార్టీయే గెలుస్తోంది.
ఆరుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించిన చంద్రబాబు ఏడోసారి ఇక్కడ అసెంబ్లీ బరిలో నిలిచారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి చంద్రమౌళి పోటీ చేస్తున్నారు. మాజీ ఐఏఎస్ అధికారైన కె.చంద్రమౌళి 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేతిలో 47,121 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ప్రస్తుత ఎన్నికల్లో జనసేన నుంచి మద్దినేని వెంకటరమణ, బీజేపీ నుంచి ఎన్.ఎస్.తులసీనాథ్, కాంగ్రెస్ నుంచి బీఆర్ సురేశ్ బాబు బరిలో ఉన్నారు.
ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేయడం.. ముప్ఫయ్యేళ్లుగా ఒకే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడంతో చంద్రబాబు కుప్పంను తనకు కంచుకోటగా మార్చుకోగలిగారు.
స్వయంగా ప్రచారం చేయని ప్రధాన అభ్యర్థులు
ప్రధాన పార్టీల అభ్యర్థులు చంద్రబాబు, చంద్రమౌళిలు ఇద్దరూ స్వయంగా ప్రచారం చేసే పరిస్థితిలో లేకపోవడంతో వారి తరఫున కుటుంబ సభ్యులు, పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు.
చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు కావడంతో పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్త ప్రచారం ఆయన భుజస్కంధాలపైనే ఉంది. ఆ కారణంగా ఆయన సొంత నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రమంతా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ కారణంగా ఆయన అందుబాటులో లేకపోవడంతో భార్య భువనేశ్వరి ఆయన తరఫున కుప్పంలో ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కూడా మంగళగిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఆయన కూడా కుప్పంలో ప్రచారానికి రాలేని పరిస్థితి దీంతో భువనేశ్వరే మొత్తం ప్రచారాన్ని చూసుకుంటున్నారు. అయితే, ఆమె కూడా ప్రచారంలో పాల్గొనడం లేదు. నియోజకవర్గానికి చెందిన నాయకులు, కీలక కార్యకర్తలతో నిత్యం టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. స్థానిక నాయకత్వం, సీబీఎన్ ఆర్మీ ఇక్కడ గ్రామగ్రామాన తిరుగుతూ చంద్రబాబు తరఫున ప్రచారం చేస్తోంది.
మరోవైపు వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి కూడా తాను స్వయంగా ప్రచారం చేయడం లేదు. అయితే, ఆయన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉండడంతో కుటుంబసభ్యులే ప్రచార బాధ్యతలు చేపట్టారు.
స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ చంద్రమౌళి తరఫున ప్రచారం చేస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందన్న అంచనాలతో వైసీపీ అభ్యర్థి తరఫున ఇక్కడ ప్రచారం తీవ్రంగా చేస్తున్నారు.

ఫొటో సోర్స్, YSRcongress
పులివెందుల: జగన్ వర్సెస్ సతీశ్ రెడ్డి
రాష్ట్రంలోని అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కడప జిల్లా పులివెందుల కూడా ఒకటి.
1978 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2014లో ఎన్నికై తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహనరెడ్డి ఈ ఎన్నికల్లోనూ అదే నియోకజవర్గం నుంచి బరిలో దిగారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనతో పోటీ పడిన సతీశ్ రెడ్డే ఈసారీ బరిలో ఉన్నారు.
పులివెందులలో 1978 నుంచి 1985 ఎన్నికల వరకు వరుసగా మూడు సార్లు వైఎస్ రాజశేఖరరెడ్డి, 1989లో వైఎస్ వివేకానందరెడ్డి, 1991 ఉప ఎన్నికల్లో వైఎస్‌పీ రెడ్డి, 1994లో మళ్లీ వివేకానందరెడ్డి గెలవగా... 1999 నుంచి 2009 వరకు రాజశేఖరరెడ్డి వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచారు.
2011 ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఇక్కడి నుంచి విజయం సాధించారు.
2014లో విజయమ్మ విశాఖపట్నం నుంచి లోక్‌సభ స్థానానికి పోటీపడడంతో ఆ ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్ బరిలో దిగి 75,243 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
ప్రస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వేలూరు శ్రీనివాసరెడ్డి, బీజేపీ నుంచి పెడవల్లి సుష్మ బరిలో ఉన్నారు. జనసేన అభ్యర్థి నామినేషన్ ఇక్కడ ఆమోదం పొందకపోవడంతో ఆ పార్టీ పోటీలో లేదు.

ఫొటో సోర్స్, janasena
భీమవరం: పవన్ కల్యాణ్‌కు కలిసొచ్చేనా?
వసతులు, వాణిజ్యం, వ్యాపారం అన్నింటిపరంగా ముందు వరుసలో ఉండే భీమవరం రాజకీయంగానూ పశ్చిమగోదావరి జిల్లాలో కీలకం.
ఈ నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య చేతులు మారుతోంది. భీమవరంలో ఇప్పటివరకు కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 5 సార్లు గెలిచాయి.
2014లో పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని స్థానాలను తెలుగుదేశం గెలుచుకోవడంతో భీమవరం కూడా ఆ పార్టీ ఖాతాలోనే ఉంది. అయితే, ఈసారి జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో ఒక్కసారిగా అంచనాలు మారాయి.
టీడీపీ పట్టు నిలుపుకొంటుందా? లేదంటే, పవన్ కల్యాణ్‌కు యువతలో ఉన్న క్రేజ్ ఫలిస్తుందా అన్నది చర్చనీయంగా మారింది.
టీడీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు బరిలో ఉండగా.. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో రామాంజనేయులు చేతిలో ఓటమి పాలైన గ్రంథి శ్రీనివాస్ మరోసారి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దొరబాబు, బీజేపీ నుంచి కాగిత సురేంద్ర పోటీలో ఉన్నారు.
2009లో పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు భీమవరంలో ఆ పార్టీ అభ్యర్థి వేగేశ్న సూర్యనారాయణ రాజు 26.42 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులే కాంగ్రెస్ నుంచి గెలిచారు.
వేర్వేరు పార్టీల నుంచయినప్పటికీ గత రెండు పర్యాయాలుగా ఇక్కడ గెలుస్తున్న రామాంజనేయులు మరోసారి ఇక్కడ విజయానికి ప్రయత్నిస్తుండగా.. 2004 కాంగ్రెస్ నుంచి గెలిచినా 2009లో కాంగ్రెస్ టికెట్ దక్కించుకోలేకపోయి.. 2014లో వైసీపీ నుంచి బరిలో దిగినా విజయం అందుకోలేకపోయినా గ్రంథి శ్రీనివాస్ కూడా గెలుపు కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కాపు సామాజికవర్గ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న భీమవరం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.

ఫొటో సోర్స్, janasena
గాజువాక
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడంతో విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంలో రాజకీయ అంచనాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.
టీడీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన తిప్పల నాగిరెడ్డి ఇక్కడ పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గొల్లకోట వెంకటసుబ్బారావుకు టికెట్ ఇవ్వగా, బీజేపీ విశాఖ మాజీ మేయర్ పులుసు జనార్దన్‌ను బరిలో దించింది.
పవన్ సోదరుడు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం 2009లో ఇక్కడ విజయం సాధించింది. ఆ పార్టీ నుంచి గాజువాకలో గెలిచిన చింతలపూడి వెంకట్రామయ్య ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. ఆయన గాజువాక అభ్యర్థిత్వాన్ని ఆశించినప్పటికీ పవన్ ఈ స్థానాన్ని ఎంచుకోవడంతో ఆయన్ను పెందుర్తి నుంచి పోటీ చేయిస్తున్నారు.
జనసేనకు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదైన నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి కావడం.. గతంలో ప్రజారాజ్యం పార్టీ గెలవడం.. అప్పుడు గెలిచిన నేత ఇప్పుడు జనసేనలో ఉండడం.. కాపు సామాజికవర్గ ఓట్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండడంతో పవన్ ఈ నియోజకవర్గంపై ఆశతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, సిటింగ్ ఎమ్మెల్యేతో పాటు వైసీపీ కూడా బలమైన అభ్యర్థిని నిలపడం.. బీజేపీ అభ్యర్థి పులుసు జనార్దన్‌కూ ఇక్కడ పట్టుండడంతో బహుముఖ పోటీ ఏర్పడింది.

ఫొటో సోర్స్, Balakrishna/facebook
హిందూపురం
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వరుసగా 9 సార్లు టీడీపీ అభ్యర్థులనే గెలిపించిన నియోజకవర్గం హిందూపురం. 1985, 89, 94లో ఎన్టీఆర్ ఇక్కడి నుంచి విజయం సాధించగా.. 1996లో ఆయన తనయుడు హరికృష్ణ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆ తరువాత 1999, 2004, 2009లలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ ఇక్కడ పోటీ చేయలేదు. అయినా, టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు.
మళ్లీ 2014లో ఎన్టీఆర్ కుమారుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి గెలిచారు.
సిటింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నవీన్ నిశ్చల్‌కు ఈసారి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. వైసీపీ నుంచి ఇక్బాల్ అహ్మద్ ఖాన్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బాలాజీ మనోహర్, జనసేన నుంచి ఆకుల ఉమేశ్, బీజేపీ నుంచి పీడీ పార్థసారథి పోటీ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, fabook
పెద్దాపురం:
ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సిటింగ్ స్థానం ఇది. ప్రస్తుతం టీడీపీ నుంచి ఆయనే మరోసారి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి తోట వాణి బరిలో దిగారు. గత లోక్‌సభలో తెలుగుదేశం పక్ష నేతగా వ్యవహరించిన తోట నరసింహం భార్యే వాణి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొద్దిరోజులకే తోట నరసింహం దంపతులు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు.
కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న పెద్దాపురంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు అదే సామాజికవర్గం నుంచి ఉండడంతో ఇక్కడ పోటీ కీలకంగా మారింది. జనసేన నుంచి తుమ్మల రామస్వామి, కాంగ్రెస్ నుంచి తుమ్మల దొరబాబు, బీజేపీ నుంచి యార్లగడ్డ రామ్ కుమార్ బరిలో ఉన్నారు.
టీడీపీ ప్రభుత్వంలో చినరాజప్ప ఉపముఖ్యమంత్రిగా పనిచేయడం, తోట వాణి భర్త నరసింహం వైసీపీలో చేరడానికి ముందు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేయడంతో ఈ నియోజకవర్గంలో పోటీ ఆసక్తిదాయకంగా మారింది.

ఫొటో సోర్స్, facebook/naralokesh
మంగళగిరి
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు.
ఇక్కడ వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డినే మరోసారి బరిలో దించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్కే సలీం, జనసేనతో పొత్తుల్లో భాగంగా సీపీఐ నుంచి ముప్పాళ్ల నాగేశ్వరరావు, బీజేపీ నుంచి జగ్గారపు రామ్మోహనరావు పోటీలో ఉన్నారు.
2014లో ఇక్కడ వైసీపీ కేవలం 12 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచింది. టీడీపీ నుంచి పోటీ చేసిన గంజి చిరంజీవులు గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు.
అయితే.. మంగళగిరి నియోజకవర్గ చరిత్ర చూస్తే 1983, 85లో తప్ప టీడీపీ మళ్లీ గెలవలేదు.
ఏపీ రాజధాని ప్రాంతం కావడంతో అభివృద్ధి పేరిట టీడీపీ.. మరోవైపు అభివృద్ధి పేరుతో అన్యాయం చేశారంటూ వైసీపీ ప్రచారం చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, YSRCP
గుడివాడ
కోస్తాంధ్రలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఇక్కడ టీడీపీ నుంచి దేవినేని అవినాశ్, వైసీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని బరిలో ఉన్నారు.
కొడాలి నాని వైసీపీలో చేరడానికి ముందు ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగానే చెప్పాలి. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన అంతకుముందు 2009, 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తరువాత 1989, 2014 మినహా అన్నిసార్లూ ఆ పార్టీయే గెలిచింది.
1983, 85ల్లో ఎన్టీఆర్ ఇక్కడ నుంచి విజయం సాధించారు.
ఈసారి విజయవాడకు చెందిన దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్ ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీలో ఉండడంతో ఇక్కడ పోటీ తీవ్రమైంది.
కాంగ్రెస్ నుంచి ఎస్. దత్తాత్రేయులు, బీజేపీ నుంచి గుత్తికొండ రాజాబాబు పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థి నామినేషన్ ఇక్కడ తిరస్కరణకు గురైంది.

ఫొటో సోర్స్, Amanchikrishnamohan
చీరాల
2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నియోజవర్గం కూడా కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా మారింది. టీడీపీ నుంచి కరణం బలరాం, వైసీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రధాన అభ్యర్థులు. కాంగ్రెస్ నుంచి దేవరపల్లి రంగారావు, జనసేన నుంచి కట్టరాజ్ వినయ్ కుమార్, బీజేపీ నుంచి మువ్వల వెంకటరమణ పోటీ చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో టీడీపీ సీనియర్ నేతయిన ఎమ్మెల్సీ కరణం బలరాం తన అద్దంకి నియోజకవర్గం నుంచి ఈసారి చీరాలకు మారారు. నిజానికి 2009 ఎన్నికల్లో అద్దంకిలో ఓటమి తరువాత 2014లో తన కుమారుడు వెంకటేశ్‌ను పోటీకి నిలిపారు. కానీ, ఆయనకూ పరాజయం తప్పలేదు. ఈసారి అద్దంకి నుంచి వైసీపీ ఫిరాయింపు నేత గొట్టిపాటి రవికుమార్‌కు టీడీపీ టికెట్ ఇవ్వడంతో బలరాంను చీరాల నుంచి బరిలో నిలిపారు.
ఇక్కడ వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ బరిలో ఉన్నారు. 2009లో చీరాలలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన 2014లో ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ తరువాత టీడీపీలో చేరారు. కానీ, కొద్ది రోజుల కిందటే వైసీపీలోకి వచ్చి టికెట్ సాధించుకున్నారు.
ఆమంచికి ఈ నియోజకవర్గంలో గట్టి పట్టుండగా కరణం బలరాం కూడా ఇక్కడ ప్రజలకు పరిచితుడే.
ఇప్పటివరకు చీరాలలో ఎవరూ వరుసగా మూడుసార్లు గెలిచిన సందర్భం లేకపోవడంతో ఈసారి ఏమవుతుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

ఫొటో సోర్స్, facebook/DrPonguruNarayana
నెల్లూరు సిటీ
చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి అందుకుని ఆ తరువాత ఎమ్మెల్సీ అయిన విద్యాసంస్థల అధిపతి పి.నారాయణ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా ఆయన ఇక్కడ బరిలో నిలవగా వైసీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోసారి రంగంలోకి దిగారు.
2014లో మంచి మెజారిటీతో విజయం సాధించిన అనిల్ కుమార్ యాదవ్‌కు ఇక్కడ యువతలో పట్టుంది. నారాయణ కూడా తొలి ఎన్నికలు కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
అయితే, నెల్లూరు సిటీ(2009కి ముందు నెల్లూరు) నియోజకవర్గంలో టీడీపీ కేవలం రెండు సార్లే విజయం సాధించింది. 1983, 1994లో తప్ప టీడీపీకి ఇక్కడ విజయం దక్కలేదు.
ఈసారైనా గెలవాలని టీడీపీ, సిటింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇక్కడ కాంగ్రెస్ నుంచి షేక్ ఫయాజ్, జనసేన నుంచి కేతంరెడ్డి వినోద్ రెడ్డి, బీజేపీ నుంచి జగన్మోహనరావులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- సిత్రాలు సూడరో: డీకే అరుణ, జయ సుధల.. కండువా మారింది, స్వరం మారింది
- నీరవ్ మోదీ: భారత్‌కు ఎలా రప్పిస్తారు? రూ.11,360 కోట్ల సంగతేంటి?
- 1996లో నల్లగొండ లోక్‌సభకు 480 మంది పోటీ
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా ఇదే
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








