కాంగ్రెస్ పార్టీ: ఏపీలో తిరుగులేని ఆధిపత్యం నుంచి ఉనికి కోసం పరుగు తీసే దశకు

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Photo Division

    • రచయిత, అంజయ్య తవిటి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్న పేరు ఉండేది. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో దేశమంతా ఓటర్లు కాంగ్రెస్‌పై కన్నెర్ర చేస్తే, తెలుగు ప్రజలు మాత్రం ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అలా దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించి, ఎంతో ప్రజాదరణ పొందిన ఆ పార్టీ నేడు రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడమే కష్టంగా మారుతోంది.

ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన 1955 ఎన్నికల్లో కమ్యూనిస్టులకు భారీ మెజార్టీ వస్తుందని అంతా భావించారు. కానీ, ఆ అంచనాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అప్పుడు అసెంబ్లీలో మొత్తం 196 స్థానాలు ఉండగా, 142 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 119 సీట్లు సాధించింది. 169 స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ 15 సీట్లకే పరిమితమైంది.

ఆ తర్వాత రెండేళ్లకు (1957లో) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంత అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ప్రభంజనం సృష్టించింది. మొత్త 105 స్థానాలకు జరిగిన ఆ ఎన్నికల్లో 68 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

అలా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు దశాబ్దాల పాటు ఆ పార్టీ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, JAIPALREDDY

ఫొటో క్యాప్షన్, 1980 ఎన్నికల్లో మెదక్‌ నుంచి భారీ మెజార్టీతో ఇందిర గెలిచారు.

దేశమంతా ప్రతికూలం, ఆంధ్రప్రదేశ్‌లో అనుకూలం

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1975-77 మధ్య దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దానిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మాత్రం పూర్తి భిన్నమైన తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 42 పార్లమెంట్ స్థానాల్లో 41 సీట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది.

అంతేకాదు, 1978లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దేశమంతా ఇందిరను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ను ఓడిస్తే, తెలుగు ప్రజలు మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఆ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను, 290 చోట్ల కాంగ్రెస్ (ఇందిర కాంగ్రెస్) బరిలో నిలవగా 175 స్థానాలు గెలుచుకుంది.

అలాగే, 1980లో జరిగిన ఎన్నికల్లోనూ ఇందిరకు బహుమానం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలీతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ (ప్రస్తుతం తెలంగాణలో ఉంది) లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేశారు. రాయబరేలీలో ఆమెకు కేవలం ఏడు వేల ఓట్ల మెజార్టీ రాగా, మెదక్‌లో 2 లక్షలకు పైగా ఆధిక్యం వచ్చింది. ఇందిర రాయ్‌బరేలీని వదులుకుని మెదక్‌ నుంచే ప్రాతినిధ్యం వహించారు.

కాంగ్రెస్ ఎంపీల్లో ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీ సాధించింది కూడా తెలుగు వ్యక్తే. నంద్యాల లోక్‌సభ స్థానానికి 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు 5.8 లక్షల మెజార్టీతో అఖండ విజయం సాధించారు.

అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగు నేలపై ఎంతటి క్రేజ్ ఉండేదో చెప్పేందుకు ఆ ఫలితాలు చక్కని ఉదాహరణలు.

ఎన్టీఆర్

ఫొటో సోర్స్, fb/TDP.Official

ఫొటో క్యాప్షన్, ఎన్టీఆర్

ఎన్టీర్ రాకతో బ్రేక్

1983 సాధారణ ఎన్నికలు, 1985 మధ్యంతర ఎన్నికల్లో ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ ప్రభంజనానికి బ్రేక్ పడింది. అయితే, 1989లో మళ్లీ ఆ పార్టీ అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది.

ఆ తర్వాత రెండు పర్యాయాల టీడీపీ పాలన అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ పదేళ్ల పాటు పాలించింది.

2004 ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను, 234 చోట్ల మాత్రమే పోటీ చేసిన కాంగ్రెస్‌ ఏకంగా 185 సీట్లు కైవసం చేసుకుంది. 2009లో టీడీపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో ఏర్పడిన మహా కూటమిని సైతం ఢీ కొట్టి 156 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది.

వైఎస్. రాజశేఖర రెడ్డి

ఫొటో సోర్స్, fb/ysrcpofficial

విభజన తెచ్చిన కష్టాలు

రాష్ట్ర విభజన అంశం సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బ కొట్టింది.

మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఘోరమైన పరాభవాన్ని 2014 ఎన్నికల్లో ఆ పార్టీ చవిచూసింది.

నవ్యాంధ్ర రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా సాధించకపోగా, 150 పైగా అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది.

ఎన్టీఆర్ ప్రభంజనం సమయంలోనూ కాంగ్రెస్‌కు ఇంతటి గడ్డు పరిస్థితి ఏర్పడలేదు.

టీడీపీలో చేరిన పనబాక లక్ష్మి

ఫొటో సోర్స్, fb/panabakalakshmi.offical

ఫొటో క్యాప్షన్, ఇటీవలే టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఈ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

విధేయులూ హ్యాండిచ్చారు

అనేక మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు 2014 ఎన్నికలకు ముందే టీడీపీ, బీజేపీ, వైసీపీలలో చేరిపోయారు. వెళ్లిన నేతలను తిరిగి వెనక్కి రప్పించేందుకు అధినాయకత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఒకరిద్దరు మాత్రమే వచ్చారు.

2019 ఎన్నికల్లోగా పార్టీ తిరిగి పుంజుకుంటుందన్న ఆశాభావం కొందరు సీనియర్ నాయకుల్లో ఉండేది. కానీ, ఇటీవలి పరిణామాలు చూస్తే వారిలోనూ నమ్మకం సన్నగిల్లినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పేరున్న కిశోర్ చంద్రదేవ్, కోట్ల సుర్యప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి, నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్ నేతలు కూడా ఇటీవల పార్టీని వీడటమే అందుకు నిదర్శనం.

తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి పేరుకు పార్టీలోనే ఉన్నా, చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

దాంతో, ఈ ఎన్నికల్లో చాలాచోట్ల ద్వితీయ శ్రేణి నాయకులకు టికెట్లు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పార్టీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల జాబితా చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

రఘువీరా రెడ్డి, జేడీ శీలం, పల్లం రాజు, కనుమూరి బాపిరాజు లాంటి కొద్దిమంది సీనియర్ నాయకులు తప్పించి, ఒకప్పుడు పార్టీ అధిష్టానానికి దగ్గరగా మెలిగిన నాయకుల పేర్లేవీ ఆ జాబితాల్లో కనిపించడం లేదు.

రఘువీరా రెడ్డి

ఫొటో సోర్స్, fb/drnraghuveerareddy

ఫొటో క్యాప్షన్, రఘువీరా రెడ్డి

ఈసారి ఖాతా తెరిచేనా?

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయాలన్న దిశగా సమాలోచనలు జరిపారు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయానికి టీడీపీతో పొత్తు కూడా ఒక కారణమన్న వాదనలు వినిపించడంతో అధిష్టానం వెనక్కి తగ్గింది. దాంతో, జాతీయ స్థాయిలో పొత్తు ఉంటుంది కానీ, రాష్ట్రంలో రెండు పార్టీలూ వేర్వేరుగానే ఎన్నికల్లోకి వెళ్తున్నారు.

రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదు.

ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలో పేర్కొన్న ఇతర హామీలనూ అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ చెబుతోంది. ఇటీవల 'ప్రత్యేక హోదా భరోసా యాత్ర' కూడా చేపట్టింది. తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలోనూ పేర్కొంది.

ఇదే విషయాన్ని రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థులు తమ ప్రచారంలో నొక్కి చెబుతున్నారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, TWITTER/@RAHULGANDHI

ఇప్పుడు ఆశలు లేవు, కానీ...

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశలేదు. కానీ, మరో అయిదు పదేళ్లలో మళ్లీ బలమైన పార్టీగా మారే అవకాశాలు చాలా ఉన్నాయని సీనియర్ జర్నలిస్టు అప్పరసు కృష్ణారావు అన్నారు.

"ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉంది. అయితే, అవి రెండూ ప్రాంతీయ పార్టీలే కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయ పార్టీల అవసరం ఉంటుంది. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తుంది. తద్వారా కాంగ్రెస్‌కు రాష్ట్రంలో బలపడే అవకాశం ఉంటుంది. వైసీపీ గెలిచినా, టీడీపీ బలహీనపడిపోతుంది కాబట్టి కాంగ్రెస్‌కు అవకాశం ఉంటుంది.

ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా, ఒక బలమైన ప్రతిపక్షంగా మాత్రం నిలబడే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో క్రమంగా బలోపేతం అయ్యేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుంది.

మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓడిన పార్టీ (టీడీపీ లేదా వైసీపీ) పూర్తిగా బలహీనపడిపోతుంది. అది కాంగ్రెస్‌కు అవకాశంగా మారి 2024 ఎన్నికల్లోగా పుంజుకునే వీలుంటుంది.

ఎప్పటికైనా ఏపీలో ఆ పార్టీ బలపడుతుంది. అందుకు అయిదేళ్లు లేదా పదేళ్లు పట్టొచ్చు.

తెలంగాణలో టీడీపీతో కలిసి పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు ఏపీలో వేర్వేరుగా పోటీ చేస్తున్నారు. కానీ, కేంద్రంలో ఆ రెండు పార్టీలు కలుస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే" అని కృష్ణా రావు వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)