పాకిస్తాన్ చెరలో మగ్గిపోతున్న 54 మంది యుద్ధ ఖైదీలు... 48 ఏళ్లుగా నిరీక్షణ :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
''పాకిస్తాన్ బందీగా పట్టుకున్న భారత వైమానిక దళ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఎట్టకేలకు విడుదలయ్యారు. అయితే, పాక్ చెరలో నేటికీ భారతదేశానికి చెందిన 54 మంది యుద్ధ ఖైదీలు మగ్గిపోతున్నారు'' అని ఈనాడు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. వీరిని భారత సైన్యం మరచిపోలేదు. (1971 యుద్ధంలో పాక్ ఈ 54 మంది భారత సైనికులను బందీలుగా పట్టుకుందని భావిస్తున్నారు. కానీ, పాకిస్తాన్ మాత్రం వారెవరూ తమ చెరలో లేరని చెప్తోంది.)
పుణె సమీపంలోని ఖడక్‌వాస్లాలో ఉన్న త్రివిధ దళాల అధికారులకు ప్రారంభ శిక్షణను ఇచ్చే 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ' (ఎన్‌డీఏ)లో వీరికోసం 48 ఏళ్లుగా ఒక ఆత్మీయ నిరీక్షణ ఏర్పాటు చేసింది.
ఇక్కడి సువిశాల భోజనశాల ప్రవేశ ద్వారం వద్ద ఒక చిన్న టేబుల్, కుర్చీని ఉంచారు. ఆ కుర్చీ ముందుకు ఒరిగి ఉంటుంది. టేబుల్ మీద ఎర్రటి రోజా పువ్వు కలిగిన కుండీ, ఎర్రటి రిబ్బన్ ఉంటాయి. ఒక పెద్ద ప్లేటు, పక్కనే ఒక చిన్న ప్లేటు ఉంచారు. ఒక ప్లేటులో కొంచెం ఉప్పు, ఒక నిమ్మ చెక్క ఉంటాయి. కప్పు, బోర్లించిన గ్లాసు, వెలిగించని ఒక కొవ్వొత్తి ఉంటాయి. ఈ టేబుల్‌ను శత్రువు చెరలో చిత్రవధ అనుభవిస్తున్న యుద్ధఖైదీల కోసం 'రిజర్వు' చేశారు. టేబుల్ మీద వస్తువులను ఎందుకు ఉంచిందీ వివరించే ఒక ప్లకార్డు కూడా ఉంటుంది.
ఆ ప్లకార్డులో ఇలా రాసి ఉంటుంది..

ఫొటో సోర్స్, NAtional Defence Academy
''ఈ టేబుల్ సెట్ చాలా చిన్నగా ఉంటుంది. బందీగా చిక్కి శత్రువు ముందు అసహాయంగా మిగిలిన మన సైనికుడి దుర్బలత్వానికి ఇది ప్రతీక.
చిన్న పూల కుండీలో ఉంచిన ఒకే ఒక్క ఎర్రగులాబీ... బందీగా చిక్కిన సైనికుడి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, సహచరుల ఆశావహ నిరీక్షణకు అద్దం.
పూల కుండీకి చుట్టి ఉన్న ఎర్రటి రిబ్బన్ అదృశ్యమైన వారి ఆచూకీ కోసం ఆరాటపడుతూ మొక్కవోని ఉక్కు సంకల్పంతో నిరీక్షించే వేల మంది తమ దుస్తులపై చిహ్నంగా పెట్టుకునే ఎర్రటి రిబ్బన్‌కు ఓ జ్ఞాపకం.
వెలిగించని కొవ్వొత్తి... ఆ యుద్ధఖైదీల్లో చెక్కుచెదరని స్ఫూర్తికి తార్కాణం.
ప్లేటులో ఉంచిన నిమ్మచెక్క వారి విషాద స్థితిని కళ్లకు కట్టే దర్పణం.
ఆ ప్లేటులో ఉంచిన ఉప్పు.. వారి కుటుంబ సభ్యుల వెచ్చని కన్నీటికి గుర్తు.
ఆ గ్లాసు బోర్లించి ఉండటానికి కారణం... వారు ఈ రాత్రికి మనతో కలసి 'టోస్ట్' చెప్పలేరు.
ఈ కుర్చీ ఖాళీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వారు మనతో లేరు.
ఆ వీరుల శక్తి సామర్థ్యాలపై ఆధారపడిన మీలో ప్రతి ఒక్కరూ, వారిని ఆత్మీయులుగా సంబోంధించిన మీరందరూ వారిని ఏ నాటికీ మరవరు.
వారు ఇంటికి తిరిగొచ్చేదాకా మరవొద్దు.''

ఫొటో సోర్స్, TWITTER@INCIndia
మోదీ అయిదు నిమిషాలైనా రాజకీయాలు ఆపలేరు: రాహుల్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశమంతా ఒక్కతాటిపై నిలబడాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ, తాను మాత్రం ఆ పని చేయలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డట్లు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం... శుక్రవారం మహారాష్ట్రలోని ధూలెలో జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘పుల్వామా దాడి తర్వాత ప్రభుత్వాన్ని ఏ ఒక్కరూ విమర్శించొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమం తా ఉమ్మడిగా పోరాడాలని హితవు చెప్పా’’ అని తెలిపారు.
‘‘పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత్ ఐక్యంగా ఉందని మోదీ చెబుతారు. ఆ వెంటనే (ఢిల్లీలో) జాతీయ యుద్ధ స్మారకం ప్రారంభంలో మమ్మల్ని విమర్శిస్తారు. ఈ దేశ ప్రధాని కేవలం అయిదు నిమిషాలైనా రాజకీయం చేయకుండా ఆపలేరు. ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య గల తేడా ఇదే’’ అని పేర్కొన్నారు.
మిలిటరీ యుద్ధ విమానాలను తయా రు చేసే సామర్థ్యం గల హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)ను కాదని కాగితపు విమానాలను కూడా తయారు చేయని అనిల్ అంబానీ సారథ్యంలోని సంస్థకు రాఫెల్ యుద్ధ విమాన కాంట్రాక్ట్‌ను కట్టబెట్టారని మోదీపై రాహుల్ మండిపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
పాక్‌లోనే మసూద్ అజార్: అంగీకరించిన పాక్ మంత్రి
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాక్‌లోనే ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషి అంగీకరించారని, అజార్ ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేనంతగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆయన చెప్పారని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం... అజార్‌కు సంబంధించి పాకిస్తాన్ కోర్టుల్లో గట్టి సాక్ష్యాలను భారత్ సమర్పిస్తే అతనిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఖురేషి చెప్పారు. చట్టపరమైన ప్రక్రియ చేపట్టడానికి తగిన ఆధారాలు ఉండాలన్నారు.
పైలట్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించడం శాంతి ప్రక్రియలో భాగమని ఖురేషి పేర్కొన్నారు.
పుల్వామా ఉగ్రదాడి, భారత్ సర్జికల్ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో మసూద్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ప్రకటించడం గమనార్హం.
ఇప్పటికే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రతిపాదించిన విషయం తెల్సిందే.

ఫొటో సోర్స్, PIB
ప్రధాని రేసులో లేను.. మళ్ళీ మోదీనే ప్రధాని అవుతారు: గడ్కరీ
ప్రధానమంత్రి రేసులో తాను లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని.. నరేంద్ర మోదీయే మళ్లీ ప్రధానమంత్రి అవుతారని గడ్కరీ జోస్యం చెప్పారు.
ఒకవేళ బీజేపీకి అత్తెసరు మెజారిటీ వస్తే మిమ్మల్ని ప్రధాని అభ్యర్థిగా తెరమీదకు తెస్తారా? అని గడ్కరీని ప్రశ్నించగా అవన్నీ పసలేని విశ్లేషణలుగా కొట్టిపారేశారు.
''పార్టీ నేతలుగా మేమంతా వెనుకే ఉన్నాం. అలాంటప్పుడు నేను ప్రధాని అవుతాననే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది? నేను అవకాశవాద నేతను కాను.. బీజేపీకి చెందిన ఓ కార్యకర్తను. దేశం కోసం పనిచేస్తాను'' అని వ్యాఖ్యానించారు.
మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే లక్ష్యంగా కమలనాథులు ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతున్న తరుణంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
- అభినందన్: విమానం నుంచి పడగానే ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షి కథనం - BBC EXCLUSIVE
- కశ్మీర్ : ‘టార్చి లైటు వేస్తే సైనికుల తుపాకులకు బలికావాల్సి ఉంటుంది’
- అభినందన్‌ను పాకిస్తాన్ ఎందుకు విడుదల చేస్తోంది? ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం వెనుక కారణాలేంటి?
- అభినందన్ భార్య ఈమేనా?
- అభినందన్‌ను భారత్‌లోకి ఎలా తీసుకొస్తారు? విధి, విధానాలు ఏమిటి?
- అక్కడ ఎదురుచూపులు.. ఇక్కడ ఎదురుకాల్పులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








