నరేంద్ర మోదీ ఏపీకి చేస్తానని చెప్పిందేంటి.. వాస్తవంగా చేసిందేంటి?

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook
- రచయిత, బళ్ళ సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరు వస్తున్నారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు కాబట్టి మోదీ రాకను వ్యతిరేకించాలని పలు సంఘాలు పిలుపునిచ్చాయి. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బ్లాక్ డేగా పిలుస్తోంది. మరి, ఈ సందర్భంలో అసలు నరేంద్ర మోదీ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తానని చెప్పిందేంటి? వాస్తవంగా చేసిందేంటి?
2014 ఫిబ్రవరి 20 - పార్లమెంటు, దిల్లీ:
రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారు. వెంటనే లేచిన వెంకయ్య నాయుడు, పరిశ్రమలు పెట్టడానికి ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలి అన్నారు. కానీ ఐదేళ్లు మాత్రమే అన్నారు అప్పటి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే.
2014 ఏప్రిల్ 30 - ఎన్నికల సభ, తిరుపతి - నరేంద్ర మోదీ ప్రసంగం:
‘‘మీ మనసులో బాధ ఉందని తెలుసు. హైదరాబాద్ లేదనీ, ఏం చేయగలమనీ ఆలోచన ఉండడం సహజం. భవిష్యత్తుపై బెంగ ఉంది. మీకు మాటివ్వడానికి భరోసా కల్పించడానికి వచ్చాను. తూర్పు దేశాలతో వాణిజ్య కేంద్రంగా కోస్తా తీరాన్ని తీర్చిదిద్దుతా. చంద్రబాబు కొత్త రాజధాని ఎలా కట్టాలంటే, దాని ముందు దిల్లీ కూడా చిన్నబోవాలి. కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రపంచంలోని గొప్ప నగరాలను అధ్యయనం చేసి వాటి కంటే మంచిది కట్టి భారతదేశానికి ఆదర్శంగా చూపండి. మీరు అసెంబ్లీ, పార్లమెంటులో మమ్మల్ని గెలిపించండి. ఆంధ్రకు ఇచ్చిన హామీలన్నీ తీర్చే బాధ్యత మాది.’’
2014 మే 1 - ఎన్నికల సభ, నెల్లూరు - నరేంద్ర మోదీ ప్రసంగం:
‘‘ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ప్యాకేజి వచ్చిందంటే రాజ్యసభలో పోరాడిన... మీ నెల్లూరులో పుట్టిన వెంకయ్య నాయుడు వల్లే. మాటిస్తున్నాను. మాపై నమ్మకం ఉంచి దిల్లీలో కూర్చోబెట్టండి. ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా, మరింత ఎక్కువగా మేలు చేసి చూపిస్తాం.’’
2015 అక్టోబర్ 22 - అమరావతి శంకుస్థాపన - నరేంద్ర మోదీ ప్రసంగం:
‘‘నేను మీకు నమ్మకంగా చెప్తున్నాను. పునర్విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చి తీరుతామని ఈ అమరావతి సాంస్కృతిక నగరి సాక్షిగా చెబుతున్నాను. ఈ మోదీ-బాబు జోడీ అభివృద్ధి చేస్తుంది. అభివృద్ధిలో అమరావతి దిల్లీతో కలసి నడుస్తుంది.’’
ఈ సభలోనే మోదీ దిల్లీ నుంచి తెచ్చిన మట్టి, నీరు చంద్రబాబుకు అందించారు.
విభజన చట్టంలో ఉన్న హామీలు:
- రెవెన్యూ లోటు భర్తీ
- రాజధాని నిర్మాణం
- ఐఐటి
- ఐఐఎం
- యన్ఐటి
- ఐఐఎస్ఇఆర్
- సెంట్రల్ యూనివర్సిటీ
- ట్రైబల్ యూనివర్సిటీ
- పెట్రోలియం యూనివర్సిటీ
- అగ్రికల్చర్ యూనివర్సిటీ
- ఎయిమ్స్
- డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ
- హైదరాబాద్ - అమరావతి మధ్య రాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీ
- విజయవాడ గుంటూరు తెనాలి మెట్రో రైల్
- విశాఖ మెట్రో రైల్
- విశాఖ, విజయవాడ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలు
- విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్
- కడప ఉక్కు కర్మాగారం
- దుర్గరాజపట్నం పోర్టు
- విభజన చట్టంలో లేకుండా రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీలుః
- పన్ను రాయితీలు
- ప్రత్యేక హోదా
- పోలవరం ప్రాజెక్టు
- వనరుల భర్తీ
- ఆస్తుల, అప్పుల పంపిణీ
హామీల ప్రస్తుత పరిస్థితి:
రెవెన్యూ లోటు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక మొదటి ఏడాది రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాల్సి ఉంటుంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆంధ్రకు 16078.76 కోట్లు రెవెన్యూ లోటు ఉందని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం చెప్పింది. కానీ, భారత ప్రభుత్వం మాత్రం 3,979.50 కోట్లను మాత్రమే, అది కూడా 3 విడతల్లో ఇచ్చింది.
రాజధాని నిర్మాణం
కేంద్రం రాజధాని నిర్మాణానికి 2014-17 మధ్య రూ. 1500 కోట్లు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వ అంచనాల ప్రకారం అమరావతి నిర్మించడానికి లక్ష కోట్లు కావాలి. అంతా ఒకేసారి కాకపోవచ్చు, మొత్తం ఇవ్వకపోవచ్చు. గుజరాత్ లో ఒక విగ్రహం విలువ కూడా ఏపీ రాజధానికి లేదని వారు ఆరోపించారు.
"అర్థ కుంభమేళాకు 1200 కోట్లు, ధొలెరా నగరానికి 3 వేల కోట్లు ఇచ్చారు. ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలుకు 1లక్షా 10 వేల కోట్లు, ద్వారకలో కన్వెన్షన్ సెంటర్ కి 27 వేల కోట్లు ఇచ్చారు. కానీ అమరావతికి ఇప్పటి వరకూ కేవలం 1500 కోట్లు ఇచ్చారు. అంతకు మించి ఏమీ ఇవ్వలేదు. కానీ పటేల్, శివాజీల విగ్రహాలకు అంతకంటే ఎక్కువ ఇచ్చారు’’ అని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం 2018 డిసెంబరులో విడుదల చేసిన శ్వేత పత్రంలో ఆరోపించింది.
ప్రత్యేక హోదా
ఇది అత్యంత వివాదాస్పదమైన అంశం. వివిధ సభల్లో మోదీ పరోక్షంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రస్తావన తేలేదు. అప్పుడే ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావన తెచ్చారు. బిహార్ ఎన్నికల ముందు ఆ రాష్ట్రానికి 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు మోదీ. కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్యాకేజీ అన్నారు తప్ప, ఆ ప్యాకేజీ ఎంతో ఏమిటో ఇప్పటి వరకూ చెప్పలేదు. ఇక విభజన నాటి ప్రధాన మంత్రి రాజ్యసభలో ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రధాని మంత్రి నెరవేర్చకపోవడాన్ని కూడా తప్పు పడుతున్నారు నిపుణులు.

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook
విద్యా సంస్థలు
ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం, ఐఐఎస్ఇఆర్, ఐఐఐటిడిఎంలు 2015-16 నుంచి తాత్కాలిక క్యాంపసుల్లో పనిచేస్తున్నాయి.
ఐఐపిఇ, ఎన్ఐడిఎంలు 2016-17 నుంచి తాత్కాలిక క్యాంపసుల్లో పనిచేస్తున్నాయి.
కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ 2018-19 నుంచి తాత్కాలిక క్యాంపసులు, భవనాల్లో పనిచేస్తున్నాయి.
గిరిజన విశ్వవిద్యాలయం ఇంకా మొదలుకాలేదు.
కొత్త వ్యవసాయ విశ్వవిద్యాలయం బదులు పాత ఎన్జీ రంగా యూనివర్సిటీకి 135 కోట్లు ఇచ్చారు.
ఈ సంస్థలన్నిటికీ కలపి 12,746.38 కోట్లు కావాల్సి ఉండగా, కేంద్రం కేవలం 845.42 కోట్లు ఇచ్చింది.
ఇతర హామీలు
- విజయవాడ, విశాఖ మెట్రోలకు నిధులు ఏమీ ఇవ్వలేదు
- దుర్గరాజపట్నం పోర్టుకు నిధులు ఏమీ ఇవ్వలేదు
- విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లకూ నిధులు లేవు (దిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్ కి 17,500 కోట్లు ఇచ్చారు)
- కడప ఉక్కు కర్మాగారం, గ్రేహౌండ్స్ ట్రౌనింగ్ సెంటర్ గురించీ లేదు
- హోదా బదులు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ గురించి కూడా ఏమీ లేదు
- రైల్వే జోన్ గురించి కానీ, విశాఖ రైల్వే డివిజన్ విభజన గురించి కానీ ప్రస్తావన లేదు
- కోటిపల్లి - నర్సాపురం లైనుకు 400 కోట్లు ఇచ్చారు - ప్రస్తుతం ఈ పనులు జరగుతున్నాయి
- 2019-20 ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ ప్రసంగాల్లో కూడా ఆంధ్ర ప్రదేశ్ గురించి నిధులు కానీ, కేటాయింపులు కానీ లేవు
రాయలసీమ, ఉత్తరాంధ్ర నిధులు వెనక్కి
రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అని మన్మోహన్ హామీ ఇచ్చారు. దీని కింద రాష్ట్రం 24,350 కోట్లు అడిగితే కేంద్రం ఏడాదికి 350 కోట్లు అప్రూవ్ చేసింది. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు, రాయలసీమలోని 4 జిల్లాలను వెనకబడిన జిల్లాలుగా గుర్తించి వాటికి ప్రత్యేక నిధులు ఇస్తామంది కేంద్రం. ఆ క్రమంలో 2015-16 లోనూ, 2016-17లోనూ తలో 50 కోట్లూ ఇచ్చారు. 2018-19 బడ్జెట్లో ప్రస్తావన లేదు. అంతేకాదు, వీటికి గతంలో ఇచ్చిన నిధులను కూడా కేంద్రం వెనక్కు తీసుకుంటున్నట్టు స్వయంగా గవర్నర్ తన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగంలో ఆరోపించారు.
"చుట్టుపక్కల రాష్ట్రాలతో సమాన స్థితికి చేరుకునేంత వరకూ (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) సహకరించాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు అభ్యర్థించాం. రాష్ట్ర విభజనే కష్టం అనుకుంటే, తరువాత కేంద్రం ప్రవర్తన అంతకంటే దారుణంగా ఉంది. ఆఖరికి రాయలసీమ ఉత్తరాంధ్రల్లో వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధి కోసం 2017-18లో ఇచ్చిన 350 కోట్లను కూడా వెనక్కు తీసేసుకుంది కేంద్రం. దీనివల్ల జరుగుతున్న పనులు కూడా ఆగిపోతాయి. కేంద్రం విశ్వసనీయత దెబ్బతింటుంది" అని ఆయన అన్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో పరిశ్రమలు పెడితే ఇచ్చే పన్ను రాయితీలు కూడా ఆంధ్రకు ప్రత్యేకంగా ఇచ్చింది కాదు. తెలంగాణలో 9, బెంగాల్లో 11, బిహార్లో 17 జిల్లాలకు ఈ రాయితీలు ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వ వాదన
మోదీ రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని మరోసారి స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. "మేం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఎన్నో లేఖలు రాశాం. నివేదికలిచ్చాం. వారిని నిధులు విడుదల చేయమని అడుగుతున్నాం. కానీ ఆయన ఏమీ చేయడం లేదు" ఆరోపించారు ఏపీ ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు కుటుంబ రావు. ఇక ఆంధ్రకు కేంద్రం ఐదున్నర లక్షల కోట్లు ఇచ్చిందన్న బీజేపీ నాయకులు సునీల్ దియోధర్ ట్వీట్ పై స్పందించిన ఆయన, ఆ లెక్కలను తప్పు పట్టారు. "కేంద్రం 14వ ఆర్థిక సంఘం చెప్పిన దాని కంటే ఎవరికీ ఎక్కువ ఇవ్వలేదు. సాధారణంగా వేసే హైవేలకు పెట్టిన ఖర్చును కూడా కలిపి చెప్పేస్తే ఎలా? అసలు కేంద్ర బడ్జెట్ ఎంతని" అంటూ ప్రశ్నించారు కుటుంబ రావు.
బీజేపీ వాదన
అటు బీజేపీ వాదన మరోలా ఉంది. చంద్రబాబు కేంద్రం ఇస్తామన్న నిధులను తీసుకోలేదనీ, ప్రతీదాన్నీ రాజకీయం చేయాలనుకుంటున్నారనీ ఆ పార్టీ నాయకులు విమర్శించారు.
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు మాట్లాడుతూ...
‘‘ముఖ్యమంత్రిగా కూడా అబద్ధాలు ఆడవచ్చు. కానీ నిజం ఏంటంటే కేంద్రం పటేల్ విగ్రహానికి 299 కోట్లు మాత్రమే ఇచ్చింది. దానిపై కేంద్ర మంత్రి పార్లమెంటులో సమాధానం చెప్పారు. కానీ మీడియా కూడా ఈ విషయాన్ని చెప్పడం లేదు. విజయవాడ, గుంటూరులకు 500 కోట్లు ఇచ్చారు. హైకోర్టుకు 500 కోట్లు ఇచ్చారు. అమరావతికి 1000 కోట్లు ఇచ్చారు. ఇదే సమయంలో కేసీఆర్ కొత్త హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, క్వార్టర్స్ కలిపి 280 కోట్లలో కడతాం అంటున్నారు. కానీ మేం ఆంధ్రకు మాత్రం ఒక్క హైకోర్టుకే 500 కోట్లు ఇచ్చాం.
రాష్ట్రం కష్టాల్లో ఉంది. కొత్తగా లక్షా 50 వేల కోట్లు అప్పు చేశారు. ప్రపంచంలోనే డిఫరెంట్ అసెంబ్లీ, హైకోర్టు అంటున్నారు. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ముందు తాత్కాలిక ఇల్లు కట్టుకుంటారా? అద్దెకుంటారు. ఈయన మాత్రం తాత్కాలికం పేరుతో చదరపు అడుగుకి 11,500 రూపాయలు ఖర్చు చేశాడు. పర్మినెంటుకు అసలు డిజైనే ఖరారు కాలేదు. ఎక్కడకి వెళితే అక్కడ ఇలానే అమరావతి కడతానని చెప్తున్నారు. 1500 కోట్లు, 500 కోట్లు మీకు ఆఫ్ట్రాలా? కేసీఆర్ 280 కోట్లలో అన్నీ కడుతుంటే, మీకు ఒక్క హైకోర్టుకే 500 కోట్లు ఇస్తే అది ఆఫ్ట్రాలా? అవసరం లేని దుబారా దీక్షలకు రైళ్లకు రెండు కోట్ల ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టారు. ఈయన 2 కోట్ల రూపాయల ఖరీదైన గవర్నమెంటు సొమ్ముతో కొన్న బస్సులో ఉంటాడు.
ఇక హోదా విషయంలో గతంలో ముఖ్యమంత్రి ఒక ప్రశ్న వేశారు. 15 ఏళ్లుగా ప్రత్యేక హోదా ఉండి, బాగుపడ్డ రాష్ట్రం పేరు చెప్పమని బాబు అడిగారు. ఇప్పుడు మేం ఆయన్ను అదే ప్రశ్న వేస్తున్నాం. కేంద్రం చాలా స్పష్టంగా హోదా వల్ల ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు ప్యాకేజీ రూపంలో ఇస్తాం. దానికోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమని అడిగింది. కానీ చంద్రబాబు దాన్ని ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఈ అంశాన్ని ఎన్నికల్లో వాడుకుందాం అని. రాష్ట్రానికి రావల్సిన 16 వేల కోట్లను బాబు అడ్డుకున్నారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు ఆయన తాకట్టు పెడుతున్నారు. ఇప్పుడు కట్నం నిషేధించాక అదే డబ్బును పసుపు కుంకుమ పేరుతో ఇస్తున్నారు. హోదా బదులు ప్యాకేజీ కూడా అదే. పేరు ఏదైతేనేం, డబ్బు కావాలి కానీ. కానీ బాబు జనానికి సమాచారం ఇవ్వకుండా తప్పుదారి పట్టిస్తున్నారు’’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘నాడు సమైక్యాంధ్ర ఉద్యమం తప్పు.. నేడు ప్రత్యేక హోదా ఉద్యమం కూడా అంతే!!’
- నేను ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా: చంద్రబాబు నాయుడు
- క్షమించండి.. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే నా పెద్ద తప్పు: పవన్ కల్యాణ్
- మహాకూటమి చంద్రబాబు వల్ల నష్టపోయిందా?
- అభిప్రాయం: చంద్రబాబు అంటేనే కూటమి రాజకీయాలు
- చంద్రబాబు సాధిస్తారా? జగన్ అస్త్రంగా మలుచుకుంటారా?
- అభిప్రాయం: ‘యాంటీ కాంగ్రెస్’ చంద్రబాబుకు ఇప్పుడు రాహుల్ గాంధీతో స్నేహం ఎందుకు?
- ఆపరేషన్ గరుడ: ఏమిటీ వివాదం?
- Fact Check : దేశాన్ని కాంగ్రెస్ పాలించింది ఎన్నేళ్లు?
- 'మోదీ మళ్లీ గత ఎన్నికల ముందు చెప్పిన మాటలే చెబుతున్నారు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










