'మోదీ 2014 నాటి మాటలే మళ్లీ చెబుతున్నారు... గ్రామీణ భారత సమస్యలకు ఆయన వద్ద సమాధానమే లేదు'

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాధికా రామశేషన్
    • హోదా, బీబీసీ కోసం

ప్రధాని నరేంద్ర మోదీ 16వ లోక్‌సభలో తన చివరి ప్రసంగంలో కాంగ్రెస్ అవినీతిపై, గాంధీ-నెహ్రూ కుటుంబంపై పెద్దయెత్తున ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. భారతదేశ ఏకైక నైతిక సంరక్షకులుగా తనను, తాను ప్రాతినిధ్యం వహించే భారతీయ జనతా పార్టీని ప్రజలకు చూపించేందుకు ప్రయత్నించారు.

ఫ్రాన్స్‌తో రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలను ఆయన దూకుడుగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అవ్యవస్థీకృత రంగానికి, మధ్యతరగతికి కొత్త బడ్జెట్‌లో ప్రకటించిన చర్యలపై అనర్గళంగా మాట్లాడారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానన్న తన ఎన్నికల హామీపై ఆత్మరక్షణలో పడిపోయారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఇతర విపక్షాలకు ప్రధానాంశమైన వ్యవసాయం గురించి పొదుపుగా మాట్లాడారు.

గురువారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని సమాధానమిచ్చారు. మోదీ ప్రతీ సందర్భాన్ని ఎన్నికల శంఖారావం పూరించేందుకు బాగా ఉపయోగించుకుంటారు. లోక్‌సభలో ఆయన ప్రసంగం, ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న రీతిలో సాగింది.

ఉపాధి, రైతు కూలీ, కూలీ, వ్యవసాయం

ఫొటో సోర్స్, AFP

వ్యవసాయం సంక్షోభంలో ఉంది. నామమాత్రపు లాభాలు ఉండే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అలాంటి ఇతర ఆర్థిక వ్యవస్థలను పెద్ద నోట్ల రద్దు, వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) దెబ్బతీశాయి. ఈ అంశం, వ్యవసాయ సంక్షోభం గురించి మోదీ తన ప్రసంగంలో దాదాపు చివర్లో మాట్లాడారు. ఈ అంశాల్లో తనను తాను సమర్థించుకోలేని స్థితిలో ఆయన ఉన్నారని, వీటి గురించి వివరంగా మాట్లాడి అనవసరంగా ఇబ్బందుల్లో పడకూడదని ఆయన అనుకున్నారని ఇది సూచిస్తోంది.

గ్రామీణ, ఇతర ఆర్థిక వ్యవస్థలపై పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ చూపించిన ప్రభావమే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయానికి ప్రధాన కారణం. అయినప్పటికీ, ఈ రెండు నిర్ణయాలను మోదీ ప్రశంసిస్తారు. ఈ నిర్ణయాలు ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీశాయనే విషయాన్ని అంగీకరించలేదు.

కరెన్సీ
ఫొటో క్యాప్షన్, గ్రామీణ, ఇతర ఆర్థిక వ్యవస్థలపై పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ చూపించిన ప్రభావమే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయానికి ప్రధాన కారణం.

అదే సమయంలో ఆయన కాంగ్రెస్‌ను తప్పుబట్టారు. రైతు రుణాల మాఫీ లాంటి సాధ్యంకాని హామీలను కాంగ్రెస్ ఇస్తోందని విమర్శించారు. వ్యవసాయోత్పత్తులకు బీజేపీ ప్రభుత్వాల కన్నా కాంగ్రెస్ ప్రభుత్వాలు తక్కువ కనీస మద్దతుధరలు చెల్లిస్తున్నాయని చెప్పారు. రుణమాఫీలు దళారులు కుంభకోణాలకు పాల్పడేందుకు అవకాశమిస్తాయన్నారు.

రైతులకు కనీస ఆదాయం అందించేందుకు బడ్జెట్‌లో ప్రకటించిన పథకం రైతు సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుందని మోదీ చెప్పారు. ఈ పథకంలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదని, నగదు నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఛత్తీస్‌గఢ్‌లో, కొంత వరకు రాజస్థాన్‌లో ఆ పార్టీ విజయానికి తోడ్పడిందనే విషయాన్ని ప్రధాని మరిచిపోయినట్లున్నారు.

మోదీ తన ప్రసంగంలో 'నవ భారత్‌'పై దృష్టి కేంద్రీకరించారు. నమ్మకం, ఆశ, పట్టుదలే ఆలంబనగా ఉండే నవ భారతం అన్ని సవాళ్లను అధిగమిస్తుందని, అవినీతిని పారదోలుతుందని చెప్పారు. అవినీతి చెదల వంటిదని, దీనిని సత్వరం నిర్మూలించకపోతే వ్యవస్థలను లోపలి నుంచి నాశనం చేస్తుందని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు కూడా మోదీ ప్రసంగాల్లో ఇదే అంశం ప్రధానంగా ఉండేది. కాంగ్రెస్‌పై, గాంధీ-నెహ్రూ కుటుంబ అనువంశిక పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. వారసత్వ రాజకీయాల నుంచి అవినీతిని వేరు చేయలేమనేది ఆయన ఆలోచన.

modi

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్‌ను విమర్శించే క్రమంలో సమకాలీన భారత చరిత్రను రెండు దశలుగా విభజించి, కేలండర్‌లో వ్యవహరించే 'బీసీ(క్రీస్తుపూర్వం)', 'ఏడీ(క్రీస్తుశకం)' అనే మాటలకు మోదీ వ్యంగ్యంతో కూడిన భాష్యం చెప్పారు.

బీసీ అంటే బిఫోర్ కాంగ్రెస్ (కాంగ్రెస్‌కు ముందు) అని, ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ (కాంగ్రెస్ కుటుంబ వారసత్వం తర్వాత) అని ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్‌ను రద్దుచేయాలని మహాత్మా గాంధీ చెప్పారని, 'కాంగ్రెస్ ముక్త్ భారత్' కావాలని మహాత్ముడు కూడా కోరుకొన్నారని పేర్కొన్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఇచ్చిన 'అచ్చే దిన్(మంచి రోజులు)' నినాదానికి కొత్త ఓటర్లు బాగా స్పందించారు. ఆయనకు పెద్దయెత్తున ఓట్లు వేశారు. రానున్న ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ కొత్త ఓటర్ల మనసు గెలుచుకోవడంపై మోదీ దృష్టి సారించారు.

మోదీ

ఫొటో సోర్స్, lok sabha

గత నాలుగున్నరేళ్లకు పైగా కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ పరిస్థితులను చూసింది. ప్రైవేటు రంగంలో ప్రభుత్వం నేరుగా, తరచుగా జోక్యం చేసుకొంటోంది. 'చిన్న ప్రభుత్వం, అధిక పాలన' అనే బీజేపీ ప్రకటనలకు ఇది విరుద్ధమైనది.

పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీతో చిన్న, మధ్యతరహా తయారీ రంగం, అవ్యవస్థీకృత రంగం దెబ్బతిన్నాయి. పర్యవసానంగా ఉపాధి సంక్షోభం తలెత్తింది.

కాంగ్రెస్ పాలనకు, తన పాలనకు మధ్య పోలిక పెడుతూ, తాను చెప్పదలచుకొన్నదంతా చెప్పేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ అధికారాన్ని ఆస్వాదిస్తూ రాజకీయాలు చేసిందని, తాను, తన ప్రభుత్వం సేవాభావంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ కేవలం ఫోన్ కాల్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పెద్దయెత్తున డబ్బును పార్టీ సన్నిహితులకు ఇప్పించిందని మోదీ ఆరోపించారు. ఒక కుటుంబ సభ్యుడు (కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రానుద్దేశించి) లెక్కాపత్రంలేని సంపదను అన్ని చోట్లా పోగేశారని విమర్శించారు. రఫేల్ ఒప్పందాన్ని కాంగ్రెస్ మధ్యవర్తులు, (సోనియా) కుటుంబ సంబంధీకులు సన్నిహితులకు కట్టబెట్టాలనుకున్నారని ఆరోపించారు.

మమత

ఫొటో సోర్స్, facebook/AllIndiaTrinamoolCongress

ఫొటో క్యాప్షన్, ప్రతిపక్షాలతో కూడిన 'మహా కూటమి'ని 'మహా కల్తీ కూటమి'గా ప్రధాని మోదీ అభివర్ణించారు. (చిత్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ)

ప్రతిపక్షాలతో కూడిన 'మహా కూటమి'ని 'మహా కల్తీ కూటమి'గా ప్రధాని అభివర్ణించారు. కాంగ్రెస్ మాదిరే ఇందులోని పార్టీలు కూడా స్వీయ ప్రయోజనాల కోసమే జట్టు కట్టాయనే అర్థంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీల తీరే అంతని చెప్పారు.

2019 ఎన్నికల్లో మోదీ ప్రచారం ప్రధానంగా ఏ అంశం చుట్టూ తిరగనుందో గురువారం నాటి ప్రసంగంతో స్పష్టమైపోయింది. ఆయన తనను నిజాయతీపరుడిగా, భారత్‌ను అవినీతిరహితంగా ఉంచగలిగిన, అభివృద్ధి చేయగలిగిన ఏకైక నాయకుడిగా ప్రజలకు చూపించుకొనే ప్రయత్నం చేయనున్నారు.

దర్యాప్తు సంస్థలు దాదాపు అందరు ప్రతిపక్ష నాయకులపైనా, వారి కుటుంబ సభ్యులపైనా దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఎన్నికలను అవినీతికీ, నిజాయతీకి మధ్య సమరంగా చూపిస్తే పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల పట్టణ ప్రాంతాల్లో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితులను అధిగమించగలమని బీజేపీ ఆశిస్తోంది. మరి గ్రామాల సంగతి? గ్రామీణ భారత సమస్యలకు మోదీ ప్రసంగంలో సరైన సమాధానమే లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)