ఏపీలో తండ్రీకొడుకుల ప్రభుత్వం పోవాలి: గుంటూరు సభలో నరేంద్ర మోదీ

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, BJPAndhraPradesh

ఫొటో క్యాప్షన్, గుంటూరు సభలో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఆదివారం నిరసనల మధ్య సాగింది. విజయవాడ విమానాశ్రయంలో దిగిన ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గుంటూరు చేరుకున్నారు.

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకొచ్చిన తరువాత మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఇదే మొదటిసారి. గుంటూరు నగర శివారులో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రజాచైతన్య సభలో ఆయన.. ‘అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో, అంశాల్లో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

తర్వాత ఆయన తన ప్రసంగాన్ని హిందీలో కొనసాగించగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలుగులోకి అనువదించారు.

స్వాతంత్ర్య సమర యోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య, కవి గుర్రం జాషువా, డాక్టర్ నాయుడమ్మ వంటి స్ఫూర్తిప్రదాతలను అందించిన గడ్డ గుంటూరని మోదీ గుర్తుచేసుకున్నారు. గుంటూరును ఆంధ్రా ఆక్స్‌ఫర్డ్ అంటారని గుర్తుచేశారు.

ప్రధాని తన ప్రసంగంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏమేం చేసిందో చెబుతూ, అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విమర్శలు కురిపించారు. ఏపీలో తండ్రీకొడుకుల ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకొంటోందని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం పోవాలన్నారు.

మోదీ సభకు హాజరైనవారు

ఫొటో సోర్స్, Bjp

'ఏపీలో వేల కోట్లతో పథకాలు, ప్రాజెక్టులు ప్రారంభించాను'

ప్రత్యేక హోదాతో వచ్చే నిధుల కంటే ఎక్కువే ఏపీకి ఇచ్చామని, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పారు. అమరావతికి కేంద్ర పథకం ‘హృదయ్‌’లో చోటిచ్చి వారసత్వ నగరంగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నామని, వేల కోట్ల రూపాయల విలువైన పథకాలు, ప్రాజెక్టులు ప్రారంభించామని పేర్కొన్నారు.

''ఏపీలో రూ.వేల కోట్లతో పథకాలు, ప్రాజెక్టులను ప్రారంభించాను. ఈ ప్రాజెక్టుల వల్ల చమురు రంగంలో ఏపీకి దేశంలోనే అగ్ర ప్రాధాన్యం లభిస్తుంది. పెట్రోలియం నిల్వల్లో ఇబ్బందులు రాకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. గ్యాస్‌ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలను పెట్రోలియం హబ్‌గా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని ఆయన చెప్పారు.

దేశవ్యాప్తంగా పట్టణాల్లో జరిగే మార్పుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.

'సన్ రైజ్ స్టేట్అంటే లోకేశ్ అభివృద్ధి కోసం పనిచేయడమే'

చంద్రబాబు మహాకూటమి పేరుతో మహామోసానికి పాల్పడుతున్నారని మోదీ ఆరోపించారు. ఏపీలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని, అమరావతిని నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు పతనావస్థలోని తన పార్టీని పునర్నిర్మించుకునే పనిలో పడ్డారని విమర్శించారు. ఏపీని సన్ రైజ్ రాష్ట్రం చేస్తానని చెప్పారని, కానీ పుత్ర(సన్) వాత్సల్యంతో కుమారుడి అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు కేంద్ర పథకాలకు ఇక్కడ స్టిక్కర్ అంటించుకుని, అవన్నీ ఆయన కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ప్రధాని ఆరోపించారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నరేంద్ర మోదీ

‘మోదీ గో బ్యాక్’కు కొత్త అర్థం

‘మోదీ గో బ్యాక్’ అంటూ నినాదాలు, పోస్టర్లతో టీడీపీ తెలుపుతున్న నిరసనలపైనా మోదీ స్పందించారు. ‘గో బ్యాక్’ అంటే నన్ను మళ్లీ దిల్లీలో కూర్చోమని చెప్పడమేనంటూ తానే మళ్లీ ప్రధాని అన్న అర్థంలో మాట్లాడారు. కొత్త పని మొదలుపెట్టినా, శుభకార్యాలు చేపట్టినా దిష్టి తగలకుండా నల్ల చుక్క పెడతారని, తానొస్తుంటే చంద్రబాబు, ఆయన పార్టీ ఎగరేసిన నల్లజెండాలతో తనకు దిష్టిపోయిందని, తన శుభారంభానికి ఇదే నాంది అని వ్యాఖ్యానించారు.

ప్రతి రోజూ కొత్త కొత్త తిట్లతో చంద్రబాబు తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని మోదీ అన్నారు. ''నిఘంటువుల్లో ఉన్న తిట్లన్నీ నాకోసమే ఉపయోగిస్తున్నారు, ఈ పద్ధతి మంచిదేనా. మీ తండ్రీకొడుకుల రాజకీయంలో భాగంగా ఎంతోకాలంగా నన్ను తిడుతున్నా మౌనంగానే ఉన్నాను. మీ ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదు'' అని చెప్పారు.

‘అన్నిట్లో మీరే సీనియర్’

చంద్రబాబు ఎప్పుడూ మోదీ కంటే సీనియర్‌నని చెప్పుకొంటుంటారని ప్రస్తావిస్తూ- ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ''పార్టీ ఫిరాయింపులు, కొత్తకొత్త కూటములతో జత కట్టడంలో మీరే సీనియర్. మామగారికి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ముందుకెళ్లి పోవడంలో కూడా మీరు సీనియర్. యూటర్న్ తీసుకోవడంలో మీరే సీనియర్.. ఈ విషయాల్లో నేను మీతో పోటీపడలేను. ఈ రోజు ఎవర్ని తిడతారో రేపు వారి ఒడిలో కూర్చోవడంలో కూడా మీరే సీనియర్. ఆంధ్రప్రదేశ్ కలలను నీరుగార్చడంలో కూడా మీరే సీనియర్'' అని చంద్రబాబును విమర్శించారు.

చంద్రబాబుకు సీనియర్ నేతగా తాము ఎప్పుడూ గౌరవం ఇచ్చామని, కానీ ఎవరైనా ఇచ్చిన మాట తప్పితే తాను సమర్థించలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారా, లేదా అని ప్రశ్నించారు. ''మీరే అందరికంటే సీనియర్ అని మీరు చెప్పుకొన్నారు. మరి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన కుటుంబం, పార్టీ వైపు మీరు ఎందుకు వెళ్లారు? ఏ ఒత్తిడితో ఇలా చేశారు'' అని ప్రశ్నించారు.

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ దుష్ట కాంగ్రెస్ అన్నారని, ఇప్పుడు అదే పార్టీతో చంద్రబాబు కలిసి నడుస్తున్నారని, ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని మోదీ చెప్పారు.

తనకు సంపద సృష్టించడం తెలియదని చంద్రబాబు అంటున్నారని, ఆయనలా ధనార్జన తనకు తెలియదని ప్రధాని విమర్శించారు. అమరావతి నుంచి పోలవరం వరకు ఏం జరుగుతోందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

modi

ఫొటో సోర్స్, Getty Images

'చంద్రబాబుకు ఓటమి భయం'

‘‘కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పాలంటే చంద్రబాబుకు భయం.. ఎన్నికల్లో ఓడిపోతామనీ భయం.. కుమారుడు లోకేశ్‌ను రాజకీయంగా నిలదొక్కుకునేలా చేయగలనో లేదో అన్న భయం.. సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడమెలా అనే భయం.. నిజాయితీపరుడైన మోదీ అనే సేవకుడిని చూసి కూడా చంద్రబాబుకు భయం’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

సమాధానం చెప్పాల్సింది చంద్రబాబుకు కాదు.. ప్రజలకు: విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ

ప్రజా చైతన్య సభలో మోదీ ప్రసంగంపై రాజకీయ విశ్లేషకుడు తుంగ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రధానమైన అంశాల్లో కేంద్ర ప్రభుత్వ బాధ్యతను విస్మరించి ఆయన మాట్లాడారని అభిప్రాయపడ్డారు. ప్రధానిగా కంటే రాజకీయ నాయకుడిగానే మోదీ మాట్లాడారని, ఆయన ప్రసంగం ఎన్నికల ప్రసంగంలా సాగిందని ఆయన బీబీసీ తెలుగుతో చెప్పారు.

ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సింది చంద్రబాబుకు కాదని, ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకని, ప్రత్యేక హోదా వారి హక్కు అని ఆయన తెలిపారు.

''2014 ఎన్నికల్లో మోదీ ఏపీ విభజనపై స్పందిస్తూ- తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకొనేందుకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. దిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామన్నారు. నేటి ప్రసంగంలో వీటిపై స్పందించలేదు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని 'యూటర్న్' తీసుకున్నది మోదీనే. దీనికి సీఎం చంద్రబాబు అంగీకరించడాన్ని ప్రజలు అప్పట్లోనే నిరసించారు. ప్యాకేజీకి అంగీకరించి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మోదీ అంటున్నారు. చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారా, వై టర్న్ తీసుకున్నారా అన్నది ముఖ్యం కాదు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన మోదీ ప్రభుత్వం ఏ టర్న్ తీసుకుందన్నది ముఖ్యం'' అని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

రాజధాని అమరావతికి ఎన్ని నిధులు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారో కూడా చెప్పుకోలేని స్థితిలో మోదీ ఉన్నారని, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుపైనా సరిగా స్పందించలేదని ఆయన ఆక్షేపించారు.

''2013 భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ భారం పెరిగింది. దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దీనిని ఆమోదించేదీ, లేనిదీ మోదీ చెప్పలేదు'' అని లక్ష్మీనారాయణ తప్పుబట్టారు.

చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్‌పై వ్యాఖ్యలతో మోదీ వారసత్వ రాజకీయాలను పరోక్షంగా ప్రస్తావించారని, అయితే ఈ రాజకీయాలు బీజేపీలోనూ ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గవర్నరు నరసింహన్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు

ఫొటో సోర్స్, DooraDarshan

ఫొటో క్యాప్షన్, ప్రజా చైతన్య సభకు ముందు అధికారిక కార్యక్రమంలో గవర్నరు నరసింహన్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు

వైసీపీ రాసిచ్చిందే మోదీ మాట్లాడారు: కంభంపాటి రామ్మోహన్ రావు

రాష్ట్రంలోని ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిందే ప్రధాని మోదీ మాట్లాడారని దిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు ఆరోపించారు.

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్న మోదీ వ్యాఖ్యపై ఆయన స్పందిస్తూ- అలాంటి భయమేదీ టీడీపీకి లేదని, తాము ప్రజలతో ఉన్నామని, తప్పక గెలుస్తామని, మోదీకే ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. ఇటీవల మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటమి తప్పదని విమర్శించారు.

తన ప్రసంగంలో బురదజల్లడంపైనే మోదీ దృష్టి పెట్టారని రామ్మోహన్ విమర్శించారు. నిధులన్నింటికీ ఎప్పటికప్పుడు ప్రజలకు లెక్కలు చెబుతూ వస్తున్నామని తెలిపారు. ఇటీవల శ్వేతపత్రాలు కూడా విడుదల చేశామన్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయని, ఏపీకి నిధులను మిగతా 28 రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఇచ్చారని, ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదని చెప్పారు.

మోదీ ఏపీ విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడే సాహసం చేయలేకపోయారని ఆయన బీబీసీ తెలుగుతో చెప్పారు. దిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని మోదీ 2014లో చెప్పారని ప్రస్తావించారు. కానీ రాజధాని నిర్మాణానికి కేవలం రూ.1,500 కోట్లు ఇచ్చారని, ఇంత తక్కువ నిధులతో దిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

మోదీ దురహంకారంతో వ్యవహరిస్తున్నారని రామ్మోహన్ విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఇలాగే వ్యవహరించిందని, వాళ్లకు ఎదురైన ఫలితమే బీజేపీకి ఎదురవుతుందని చెప్పారు.

ప్రాజెక్టులు జాతికి అంకితం చేసిన ప్రధాని

ప్రజాచైతన్య సభకు ముందు, ప్రధాని అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓఎన్‌జీసీ, పెట్రోలియం శాఖ అనుబంధ సంస్థ రూ.7,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రెండు ప్రాజెక్టులను రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆయన జాతికి అంకితం చేశారు. మరో రూ.2,280 కోట్లతో బీపీసీఎల్‌ సంస్థ కృష్ణపట్నం పోర్టులో చేపడుతున్న కోస్టల్‌ టర్మినల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

వీడియో క్యాప్షన్, అమరావతిలో నరేంద్ర మోదీ ప్రసంగం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)