మమతా బెనర్జీ దీక్ష: దీదీ ‘సత్యాగ్రహం’ వెనుక కారణాలేమిటి.. రేపు సుప్రీం కోర్టులో విచారణ

ఫొటో సోర్స్, facebook/AllIndiaTrinamoolCongress
శారద పొంజి స్కీం కుంభకోణంపై విచారణ కేంద్రం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మధ్య ఘర్షణను పెంచింది. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ధర్నా చేస్తున్నారు.
శారద కుంభకోణం విచారణలో భాగంగా కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు సీబీఐ అధికారులు వెళ్లడం, వారిని పశ్చిమబెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం, రాత్రికి రాత్రే కేంద్రానికి వ్యతిరేకంగా మమత ధర్నాకు దిగడం తెలిసిందే.
భోజనం చేయకుండా, రాత్రంతా నిద్రపోకుండా దీక్ష కొనసాగించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు దీక్షాస్థలికి చేరుకున్నాయి.
సోమవారం ఉదయం నుంచి తృణమూ కార్యకర్తల రాక మరింత పెరగడంతో కోల్‌కతా ఉద్రిక్తంగా మారింది. మమతకు మద్దతుగా వారంతా నినాదాలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దీక్ష చేస్తున్న మమతా బెనర్జీకి దేశంలోని పలు ఇతర పార్టీలు మద్దతు పలికాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తదితరులు మమతకు మద్దతు ప్రకటించారు.
దేశాన్ని, దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేంతవరకు తాను చేపట్టిన సత్యాగ్రహ దీక్ష కొనసాగుతుందని మమత సోమవారం ప్రకటించారు.
కాగా, సీబీఐ కూడా తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తోంది. తమ అధికారులను అడ్డుకోవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మొత్తంగా, ఈ వ్యవహారం కేంద్రం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మధ్య ఘర్షణను తీవ్రం చేసింది. పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మమత ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంలో ఏమైంది?
శారద కుంభకోణంలో విచారణకు సహకరించాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను ఆదేశించాలని కోరుతూ సీబీఐ సోమవారం సుప్రీంను ఆశ్రయించింది.
సీబీఐకి రాజీవ్ కుమార్ సహకరించేలా, అన్ని ఆధారాలను సమర్పించేలా ఆదేశాలను జారీ చేయాలని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు.
సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేయడం, అక్రమంగా అదుపులో ఉంచడానికి సంబంధించిన ఆధారాలనూ ఆయన కోర్టుకు సమర్పించారు. దీనిపై సత్వరం విచారణ జరపాలని కోరారు.
సీబీఐ అభ్యర్థనలను విన్న అనంతరం సీజేఐ రంజన్ గొగోయి మంగళవారం విచారణకు స్వీకరిస్తామని తెలిపారు.
వివరాలు తెలుసుకున్న రాజ్‌నాథ్ సింగ్
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ చర్యలు, మమత ధర్నా నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠీ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించారు. ఆదివారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన పరిస్థితులను రాజ్‌నాథ్‌కు నివేదించారు.
ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు సోమవారం రాజ్‌భవన్‌కు వచ్చి తనను కలవాలంటూ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోం సెక్రటరీలను గవర్నర్ త్రిపాఠీ ఆదేశించినట్లు స్థానిక మీడియా చెబుతోంది.
కాగా, ''రాజీవ్ కుమార్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలున్నాయి. ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలూ చేశారు'' అని సీబీఐ ఇంటెరిమ్ డైరెక్టర్ నాగేశ్వరరావు 'ఏఎన్‌ఐ' వార్తాసంస్థకు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆదివారం మధ్యాహ్నం అసలేం జరిగింది?
ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటి వద్దకు సుమారు 40 మంది సీబీఐ అధికారులు వెళ్లారు. దీంతో కోల్‌కతా పోలీసులు కూడా అక్కడకు హుటాహుటిన అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నారు.
కొందరు సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు షేక్‌స్పియర్ సరానీ పోలీస్ ఠాణాకు తీసుకెళ్లారు. ఇంతలో సీబీఐకి చెందిన మరింత మంది అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకోవడం, వారిలోనూ మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకెళ్లడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
కోల్‌కతా పోలీసులు అక్కడితో ఆగకుండా ఆ నగరంలోనే సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న సీబీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకుని సోదాలు చేశారు.
తనను అదుపులోకి తీసుకోవడంతో పాటు తన ఇంటి చుట్టూ కోల్‌కతా పోలీసులు మోహరించారని సీబీఐ జేడీ పంకజ్ శ్రీవాత్సవ వార్తాసంస్థలకు తెలిపారు.
అయితే, సీబీఐ అధికారులను ప్రశ్నించి వదిలేశామని కోల్‌కతా పోలీస్ జాయింట్ కమిషనర్ ప్రవీణ్ త్రిపాఠీ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- Fact Check: రాహుల్ గాంధీని 14 ఏళ్ల అమ్మాయి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిందా?
- బ్రిటన్ రాణి కంటే సోనియా సంపన్నురాలా...
- సంక్రాంతి ముగ్గుల చరిత్ర: మొదటి ముగ్గు ఎవరు వేశారు? రంగవల్లి ఎలా పుట్టింది?
- రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా...
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
- బీబీసీ రియాలిటీ చెక్: అది భార్యాబిడ్డల అమ్మకం కాదు.. ‘ కులాచారం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









