ఇండియన్‌గా ఉండటంపై BBCతో తన అభిప్రాయం పంచుకున్నందుకు కౌసల్య విధుల నుంచి తొలగింపు

దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడులో కులదురహంకార హత్యలపై పోరాడుతున్న కౌసల్యను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించారు.
కులదురహంకార హత్య బాధితురాలైన కౌసల్య ఇటీవల బీబీసీతో మాట్లాడారు. అప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ‘‘దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే ఆమెపై చర్యలు చేపట్టాం’’ అని వెల్లింగ్టన్ మిలిటరీ కంటోన్మెంట్ ప్రధాన అధికారి హరీశ్ వర్మ వెల్లడించారు.
'బీయింగ్ ఇండియన్' అనే బీబీసీ క్యాంపైన్‌లో భాగంగా ఆమె బీబీసీతో మాట్లాడారు.
ఇండియన్‌గా ఉండటం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్న అంశంపై బీబీసీ దేశ వ్యాప్తంగా పలువురితో మాట్లాడుతోంది.
వారి వ్యాఖ్యలను వీడియోల రూపంలో సోషల్ మీడియా వేదికలపై పబ్లిష్ చేస్తోంది.
ఇందులో భాగంగా గతవారం.. కౌసల్య బీబీసీతో మాట్లాడారు.
అప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు భారత సౌర్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతూ తేది పేర్కొనకుండా.. ఆమెను విధుల నుంచి తొలగించామని హరీశ్ వర్మ చెప్పారు.

ఫొటో సోర్స్, NATHAN G
కౌసల్య ఎవరు?
తమిళనాడుకు చెందిన కౌసల్య ప్రేమ వివాహం చేసుకున్నారు.
అయితే, ఆమె భర్త శంకర్‌ను తక్కువ కులానికి చెందినవారని పేర్కొంటూ.. 2016లో కౌసల్య కుటుంబీకులు, బంధువులు కలిసి చంపేశారు.
దాంతో ఆమె న్యాయపోరాటం చేసి తన తండ్రికి మరణశిక్ష పడేలా చేశారు. ఆ తర్వాతి నుంచి కౌలస్య కులదురహంకార హత్యలకు వ్యతిరేకంగా తన వాణి వినిపిస్తున్నారు.
ప్రస్తుతం రక్షణ శాఖకు చెందిన కంటోన్మెంట్ కార్యాలయంలో పని చేస్తున్నారు.

ఆమె ఏం మాట్లాడారు?
'అంబేడ్కర్ భారత్‌ను యూనియన్ అనుకున్నారు. రాజ్యాంగం కూడా భారత్‌ను యూనియన్ అనే పేర్కొంటోంది. అయితే, సాంస్కృతికంగా ప్రజలు వేర్వేరుగా ఉన్నారు. అందువల్ల భారత్ దేశం కాదు. తమిళనాడును భారత్ ఓ బానిస రాష్ర్టంగా చూసింది. స్టెర్లైట్, మీథేన్ తవ్వకం, న్యూట్రినో అబ్జర్వేటరీ వద్దని ఇక్కడి ప్రజలు పోరాటం చేస్తున్నారు. కానీ, దేశం వాటిని ఇక్కడ బలవంతంగా రుద్దుతోంది. రైతులు దిల్లీకి వెళ్లి పోరాటం చేసినా కేంద్రం పట్టించుకోలేదు. అలాగే జాతీయ భాష కూడా ఏమీ లేదు'' అని కౌసల్య వ్యాఖ్యానించారు.
ఆమె అలా చేసి ఉండకూడదు : మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి చంద్రు
''ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని చేయాలి. దేశ ఐక్యతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకూడదు. ఇలాంటి విషయానికి సంబంధించి 1983లో సుప్రీం కోర్టు ఓ తీర్పు ఇచ్చింది.
దాని ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరక ముందు ఏమైనా మాట్లాడి ఉండొచ్చు. కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో చేరాక.. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయకూడదనేది ఆ తీర్పు సారాంశం.
ప్రభుత్వ ఉద్యోగుల మొదటి ప్రధాన విధి A government servent will have absulute integrety, devotion to duty, loyalty to service అనేదే. Loyalty to service అనేదాన్ని దేశంపట్ల విశ్వాసం కలిగి ఉండాలని అర్థం చేసుకోవాలి. అందువల్ల ప్రసార మాధ్యమాలతో మాట్లాడాలనుకుంటే.. ముందస్తు అనుమతి తీసుకోవాలి.
అయినా, ఉద్యోగానికి సంబంధించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. చివరకు వ్యాసాలు రాయాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి'' అని మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి చంద్రు వ్యాఖ్యనించారు.
కైసల్యను ఉద్యోగం నుంచి తొలగించడంపై మానవ హక్కుల సంఘం కార్యకర్త ఏ.మార్స్ బీబీసీతో మాట్లాడుతూ ప్రతిఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయని, వాటిని వెల్లడించకుండా అడ్డుకోవడం సరికాదని అన్నారు. గతంలో పశ్చిమ బంగాల్‌లో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల్లో సభ్యులుగా ఉండేందుకు అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








