సింగర్ బేబీ: రెహమాన్ మెచ్చిన ఈ కోయిల పాట ఇలా మొదలైంది

ఫేస్‌బుక్‌లో రెహమాన్ పోస్టు

ఫొటో సోర్స్, facebook/A.R. RAHAMAN

    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఏఆర్ రెహమాన్.. ఓ పాటను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 'ఈమె ఎవరో తెలీదు.. కానీ ఈమెది అద్భుతమైన గాత్రం!' అని కామెంట్ పెట్టారు.

అప్పటికే వైరల్ అయిన ఈ గ్రామీణ గాయని వీడియోకి రెహమాన్ పోస్ట్ వల్ల సోషల్లో మరింత ఊపు వచ్చింది. లక్షల సంఖ్యలో వ్యూస్, వేల లైక్‌లు వచ్చాయి.

అలా.. సోషల్ మీడియా స్టార్‌గా మారిన గాయనిని ఓసారి పలకరించండి.

రెహమాన్ మెచ్చిన ఈ గాయని పేరు బేబి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు గ్రామవాసి. టీవి చానళ్ళు, పత్రికలు.. బేబి గురించిన ప్రత్యేక కథనాలు, లైవ్‌ షోలను అందించడానికి పోటీ పడుతున్నాయి.

'ఓ చెలియా.. నా ప్రియ సఖియా' అన్న పాటకి చాలామంది అభిమానులున్నారు. రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాట మరోసారి వైరల్ అయ్యింది. అందుకు కారణం.. ఆ పాట బేబి గాత్రంతో తడవడమే.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఎవరీ బేబి?

నాలుగు పదుల వయసు దాటిన ఈ గ్రామీణ గాయని ఓ సాధారణ మహిళ. ఆమె భర్త డ్రైవర్‌గా పని చేస్తున్నారు.

'ప్రేమికుడు' సినిమాలోని 'ఓ చెలియా.. నా ప్రియ సఖియా' అనే సెమీక్లాసికల్‌ శైలిలో ఉండే పాటను అలవోకగా పైస్థాయి రాగాలను సైతం హాయిగా, శ్రవణానంద భరితంగా, మాధుర్యంగా పాడేయడం.. నెటిజన్లకు ఓ అద్భుతంలా అనిపించింది.

కట్టు, బొట్టు, భాష, యాస చూస్తుంటే.. కోనసీమకు చెందిన మహిళలా ఉందే అనుకున్నారంతా. అదే నిజమైంది. అవును. ఆ పాట గోదారిగట్టున, అచ్చమైన పంట చేలల్లో వీచిన పాటే! కానీ ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తమైంది.

బేబి

పాటకు వారధి కట్టిన రాణి

వడిశలేరులో బేబీ ఇంటి సమీపంలో రాణి అనే యువతి అద్దెకు ఉంటున్నారు. రాణికి పాటలు పాడటం హాబీ. ఈ నెల 6వ తేదీన 'ప్రేమికుడు' సినిమాలోని 'ఓ చెలియా నా ప్రియ సఖియా' పాట పాడుతున్నారు.

అయితే, రాణీ పాడుతున్న పాటలో రాగం తప్పుగా పాడటాన్ని బేబీ గమనించారు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి అలా కాదు, ఇలా పాడాలని 'ఓ చెలియా..' పాటను బేబి పాడారు.

రాణి ఆసక్తిగా విని బేబి పాటను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. బేబి అనుమతితో తన స్నేహితులకు వాట్సప్‌లో, ఫేస్‌బుక్‌లో ఆ వీడియో పోస్ట్‌ చేశారు.

అలా తన స్నేహితులు కూడా బేబి వీడియోను లైకులు, షేర్లు చేయడంతో ఒక్కసారిగా ఆ పాట.. రాష్ట్ర హద్దులు దాటి వైరల్‌ అయ్యింది.

కేవలం రెండు మూడు రోజుల్లోనే బేబి వీడియోకి 13 లక్షల లైక్‌లు వచ్చాయి. మీడియా మొత్తం బేబి ఎక్కడ? ఆమెది ఏ ఊరు..? అంటూ వెతికింది. అలా మీడియా ఇంటర్వ్యూలతో సెలబ్రిటీగా మారిపోయారు బేబి.

బేబితో బీబీసీ ఫేస్‌బుక్ లైవ్:

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

సేవా వెంకన్న, దయాకరుణ దంపతులకు పసల బేబి తొలి సంతానం. బేబికి ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు.

పదమూడో ఏటనే వివాహం అయ్యింది. బేబీతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరులు, చెల్లెళ్లు ఎవరూ చదువుకోలేదు. అయితే బేబి చిన్నవయసు నుంచే పాటపై మక్కువ పెంచుకున్నారు. పట్టుదలతో సాధన చేశారు.

గ్రామంలో కూలి పనులకు వెళుతూ తన పాటలతో కూలీల శ్రమను మరచేలా చేసేవారు.

ఆమె పొలం పనులు అలా పాటల ఊయల మీద సాగేవి. అవి ఎంతగా అంటే,

'బేబి.. నువ్వు పాటలు పాడు.. వాళ్లు పనిచేస్తారు' అంటూ ప్రోత్సహించిన రైతులూ ఉన్నారు. ఆమె పాటే కూలి డబ్బులు తెచ్చిపెట్టిన సందర్భాలూ ఉన్నాయి. బేబికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం గ్రామస్థులతోపాటు రైతుల్లోనూ ఆనందాన్ని నింపింది.

బేబి

పని.. పాటై.. తోడై!

బేబి తల్లిదండ్రులకు తమ కుటుంబ పోషణ భారంగా ఉండటంతో పిల్లలెవరినీ చదివించలేదు. బేబికి తన 13వ ఏట పసల వజ్రరావుతో పెళ్ళయ్యింది.

బేబికి ఇద్దరు కవలలు. వీరి పేర్లు హిమబిందు, ప్రియాబిందు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి.

సొంత వ్యవసాయ భూమి లేకపోయినా భూమినే నమ్ముకుని బేబి కుటుంబం జీవిస్తోంది. ఆరోగ్యం సహకరించక పోవడంతో ఆమె కొంతకాలంగా పొలం పనులు మానేసి, గ్రామంలో ఉన్న జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.

చిన్ననాటి నుంచి సినీ, క్రైస్తవ, జానపద గీతాలు ఆలపించడం ఆమెకు అలవాటు కనుక గ్రామ ప్రజల ప్రోత్సాహంతో ఎక్కడో ఒకచోట, ఏదో ఒక సందర్భంలో.. పాడుతూనే ఉన్నారు.

గ్రామంలో తోలుబొమ్మలాట, ఇతర కళారూపాల ప్రదర్శన సందర్భంలోనూ ఆమె పాటలు పాడేవారు. ఇటీవల 'ఎవరున్నారు ప్రభో - నీవు తప్ప నాకు' అనే పేరుతో విడుదలైన క్రైస్తవ భక్తి గీతాల క్యాసెట్‌లో

'నా హృదయం నీ కొరకే..' అనే పాట పాడారు. 'నా ప్రియుడు మహా ఘనుడు' అనే పాటను రత్నబాబుతో కలిసి పాడారు. వడిశలేరు గ్రామంలోని బేబిని చర్చి పాస్టర్‌ రత్నబాబు గుర్తించి, క్యాసెట్‌లో రెండు పాటలను పాడించడంతో ఆమె గొంతు అనేక ఇళ్లకు చేరింది.

బేబి

ప్రశంసల జల్లు

వడిశలేరు గ్రామం వార్తల్లోకి ఎక్కడంతో ఆ ఊరి జనం పొంగిపోతున్నారు. బేబి వల్ల తమ గ్రామానికి మంచిపేరు వచ్చిందని ఆమెను అభినందిస్తున్నారు. బేబి ఇంటికి వచ్చి అనేకమంది రైతులు ఊరికి మంచిపేరు తెచ్చావంటూ పొగుడుతున్నారు. అంతేకాదు, బేబి పాటకు వెండితెర సైతం అభినందనలతో ముంచెత్తుతోంది.

సీనియర్‌ గాయకులు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం, గాయని కౌసల్య, శ్రీలేఖ, మాళవిక, మధుప్రియ, సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్‌ వంటి సంగీతకారులు బేబికి ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు.

అలాగే సినీదర్శకుడు వంశీ వడిశలేరు గ్రామం వెళ్లి బేబిని స్వయంగా అభినందించి, తన సినిమాలో పాటలు పాడే అవకాశం ఇస్తానని ఆమెకు చెప్పడం మరో విశేషం.

సీనియర్‌ సంగీత దర్శకుడు కోటి ఫోన్‌చేసి 'బోల్‌బేబీ బోల్‌' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానించారు. ఇలా బేబి పాట.. సాధారణ జనాన్ని, సంగీత జ్ఞానుల్ని ఒకేలా ఆకట్టుకుంది. 'ఎవరీ పల్లెటూరి కోకిలమ్మ!' అనేలా చేశారు.

బేబి

అవకాశం వస్తే..

''మా అమ్మమ్మ బాగా పాటలు పాడేది. ఆమె గొంతు నాకు వచ్చింది. నా గొంతు నా పిల్లలకు రాలేదు. నా మనవళ్లకు వస్తుందోమో చూడాలి. మా అమ్మమ్మ శాంతమ్మ.. నల్లమరాజు, బాలనాగమ్మ కథల్లోని పాటలు బాగా పాడేది. ఆమె వారసత్వమే నాకూ వచ్చిందేమో! నా పాటకు ఇంత గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా పాటను ఫేస్‌బుక్‌లో పెట్టిన రాణి చేసిన మేలే ఇది. ఆమె ఫేస్‌బుక్‌లో పెట్టకుంటే ఈ గుర్తింపు వచ్చేది కాదు. పాస్టర్‌ రత్నబాబు, రైతులు, ఊరి ప్రజలు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. సినిమాల్లో అవకాశాలు వస్తే తప్పకుండా పాడుతాను!'' అని బేబి అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)