శబరిమల: కనకదుర్గ ఇంటికి రాగానే కర్రతో దాడి చేసిన అత్త

కనకదుర్గ
ఫొటో క్యాప్షన్, కనకదుర్గ
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

సుప్రీంకోర్టు తీర్పు తరువాత శబరిమల ఆలయంలో ప్రవేశించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గపై దాడి జరిగింది. స్వయాన ఆమె అత్తే ఆమెపై దాడి చేశారు.

ఈ నెల ప్రారంభంలో కేరళ ప్రభుత్వ సహాయంతో అయ్యప్ప ఆలయంలోకి వెళ్లగలిగిన ఆమె అనంతరం తొలిసారి తన ఇంటికి వెళ్లారు.

''ఇంటికి వెళ్లగానే కనకదుర్గ తలపై ఆమె అత్త గట్టిగా కొట్టారు'' అని ఆమెతో పాటు శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న బిందు అమ్మిణ్ని 'బీబీసీ హిందీ'కి తెలిపారు.

శబరిమల ఆలయంలో ప్రవేశించిన కనకదుర్గ, బిందు
ఫొటో క్యాప్షన్, జనవరి 2న శబరిమల ఆలయంలోకి కనకదుర్గ, బిందు ప్రవేశించారు

కనకదుర్గ, బిందులు జనవరి 2న అయ్యప్ప ఆలయంలో ప్రవేశించారు.

పది నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు శబరిమల ఆలయ దర్శనం నిరాకరించరాదని 2018 సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరువాత వీరు పోలీస్ భద్రత మధ్య దర్శనం చేసుకున్నారు.

కోర్టు తీర్పు తరువాత సుమారు 10 మంది మహిళలు ప్రయత్నించినా ఎవరూ సఫలం కాలేదు.

ఆ తరువాత వీరిద్దరికీ నిరసనలు ఎదురయ్యాయి. భద్రతా సమస్య ఏర్పడడంతో గత రెండు వారాలుగా వివిధ చోట్ల రహస్యంగా గడిపారు.

మంగళవారం(జనవరి 15, 2019) ఉదయం 7.30 గంటలకు కనకదుర్గ తిరిగి ఇంటికి చేరుకున్నారు.

ఇంటికి రాగానే అత్త ఆమెను కర్రతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను మలాప్పురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని ఆమె సన్నిహితులు తెలిపారు.

బిందు
ఫొటో క్యాప్షన్, బిందు

''ఇది కుటుంబ వ్యవహారం. నిజానికి కనకదుర్గ శబరిమల ఆలయానికి వెళ్లడం ఆమె భర్తకు కూడా ఇష్టం లేదు.

కానీ, ఇప్పుడాయన ఆమెకు మద్దతుగానే ఉన్నారు'' అని బిందు చెప్పారు.

మరోవైపు న్యాయకళాశాల అధ్యాపకురాలైన బిందు తిరిగి తన విధుల్లో చేరారు.

''ఇక్కడ నా విద్యార్థులు, సహోద్యోగులు అంతా ఎప్పటిలాగే నాకు సహకరిస్తున్నారు. వారి నుంచి ఎలాంటి ఇబ్బందీ లేదు'' అని బిందు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)