బెజవాడ అంటే ఆటోనగరే కాదు... అది పుస్తకానికి మరో పేరు : అభిప్రాయం

ఫొటో సోర్స్, inbministry/fb
- రచయిత, జాన్సన్ చోరగుడి
- హోదా, బీబీసీ కోసం
ఒకప్పటి ఊళ్లు - పట్టణాలు నగరాలుగా మారాక, మళ్ళీ వాటిని ఇప్పుడు ఊళ్ళు అనడం అంతగా నప్పదేమో గాని, వాటి 'ఆత్మ'ల గురించి మాట్లాడుకునేప్పుడు, మళ్ళీ వెనక్కెళ్లి వాటిని 'ఊరు' అనడమే బాగుంటుంది; మరీ ముఖ్యంగా అది బెజవాడ విషయంలో!
తెలుగులో అయితే ఊరు - ఆత్మ అని రెండు పదాల్నిఒక చోట చేర్చి వాటిని కవలల్ని చేయాలి గాని, అదే ఆంగ్లంలో అయితే 'ఎథోస్' (Ethos) అని తేలిగ్గా ఒక్కటే పదముంది. పదమున్నంత మాత్రాన; 'ఎథోస్ ఆఫ్ ఎ సిటీ' అంటూ గతం చెప్పుకోబోవటం, మరీ తేలికైన పనేం కాదు.
ప్రతిదీ రూపు మారుతున్న2020 కేలెండర్ వాకిటి ముందు అటువంటి పని - పాడు బడుతున్న బావుల్లో పూడిక తీయడం వంటిది. అందుకు, ఒక తరం ఆపిన పనిని మరొక తరం అందిపుచ్చుకున్న వైనాన్ని వెతికి పట్టుకుని, అలా దానితో పాటుగా మనమూ జీళ్ళ పాకంలా సాగాలి. అందుకు ఎంతో కొంత మోతాదులో పిచ్చి కూడా వుండాలి. ఇలా ఒక ఊరి చరిత్ర గురించి ఎన్నెన్నో కథలు చెప్పిన - పి.టి. నాయర్ (86) అనే ఓ పెద్దాయన ఈ మధ్యనే జాతీయ స్థాయిలో 'వార్త' అయ్యారు. ఇంతకీ ఏమిటి ఊరు గురించి ఆయన చెప్పే కబుర్లు అంటే మళ్ళీ అదీ - పుస్తకమే!

ఇక్కడ మన బెజవాడ మాదిరిగానే కలకత్తాలో ఏటా జనవరి చివరి నుంచి జరగనున్న 'కలకత్తా బుక్ ఫెస్టివల్' లో ఈ ఏడాది నాయర్ తన 62 వ పుస్తకాన్ని విడుదల చేయడానికి సిద్దం చేసి; అక్కడ 60 ఏళ్ళ మజిలీ తర్వాత కలకత్తా నుంచి మళ్ళీ తిరిగి కేరళకు ఈ నవంబర్ చివరలో వెళ్ళిపోయారు. పాతికేళ్ళ వయస్సులో 1955 అక్టోబర్ 25న కలకత్తాలో పని వెతుక్కుంటూ, జేబులో పైసాగాని టిక్కెట్ గాని లేకుండా హౌరా స్టేషన్లో దిగినవాడు ఈ నాయర్. అప్పటి నుంచి కలకత్తా నేషనల్ లైబ్రరీ దగ్గరలో చిన్న ఇంటిలో ఉంటూ 63 ఏళ్ళలో 62 పుస్తకాలు రాశారు. ఇవన్నీ కలకత్తా నగర చరిత్ర గురించే!
ఇప్పుడు కూడా మనుమళ్ళు మనుమరాళ్ళ నుంచి 'తాతయ్యా ఇక చాలు మన ఊరికి మా దగ్గరకు రండి' అని ఒత్తిడి మొదలయింది. దాంతో, తన ఇన్నాళ్ళ నేస్తం నేషనల్ లైబ్రరీకి వెళ్లి దాన్ని చివరగా చూసుకుని వచ్చి; తన రాతల్ని టైప్ చేసుకున్న పాత 'రెమింగ్టన్' టైపింగ్ మెషీన్ తీసుకుని నాయర్ దంపతులు కేరళకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయన వెళ్ళిపోయాడు సరే, మరి ఆయన అక్కడ మిగిల్చిన చరిత్ర సంగతి? నాయర్ రాసిన చివరి పుస్తకం - 'గాంధీజీ ఇన్ కలకత్తా'.

వందేళ్ళకు పైబడి బెజవాడలో పుస్తకాలు అచ్చొత్తి అమ్ముకునే దుకాణదారులు, వారి తరువాత ఇప్పుడు మరో పని చూసుకోవడం తెలియని వాళ్ళ సంతానం, వారి పుస్తకాలతో పాటుగా తమ ఊరి ఉనికిని బయటి ప్రపంచానికి చెప్పడానికి, ఇక్కడ బుక్ ఎగ్జిబిషన్ మొదలెట్టారు సరే.
అప్పటి నుంచి 30 ఏళ్ళుగా ఇప్పటికీ అవే తేదీల్లో ఏటా పది రోజులపాటు అవి జరగడం అంటే - ఇదేదో తేడా ఊరు కాకపోతే ఏంటి? ఇది జరిగే బందరు రోడ్డు పక్కన స్వరాజ్య మైదానంలో ఎప్పుడూ ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూనే వుంటుంది. కానీ, మాది ఎగ్జిబిషన్ కాదు అంటూ, నిర్వాహకులు దీన్ని- 'ఫెస్టివల్' అంటున్నారు. అంటే, క్రిస్టమస్- న్యూ ఇయర్- సంక్రాంతి మధ్య పుస్తక ప్రియులకు మరో పండగ గత 30 ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్నది!

దేశం నలుమూలల నుంచి ఏటా కొత్త కొత్త పుస్తకాల పబ్లిషర్లు, విక్రేతలు, రచయితలు, కవులు పుస్తక అభిమానులు ఈ పది రోజులు ఇక్కడ కలుస్తూనే ఉన్నారు.
అయితే గత వందేళ్లుగా, ఇక్కడి "కలకత్తా నాయర్" వంటి వాళ్ళకు, తమ రచనలతో పాఠకుల్ని చేరడానికి ఈ బెజవాడ దిక్సూచి ఎలా అయింది? ఎక్కడో విజయనగరంలో వుండే చాగంటి సోమయాజులు గారు, చిత్తూరు జిల్లాలో మారుమూల వూళ్ళలో టీచర్‌గా పనిచేస్తూ కధలు రాసుకునే మధురాంతకం రాజారామ్ గారు, బెజవాడ వచ్చి ఏదో ఒక పబ్లిషర్‌కు తమ కథల చిత్తుప్రతులు ఇచ్చి వెళితేనేగా, వాళ్ళు తమ పుస్తకాల ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది.
'చాసో' అయితే అలా బెజవాడ వచ్చినప్పుడు, ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఓ కిటికీ వద్ద కూర్చుని చుట్ట వెలిగించి అలా ఒక కథ రాసి ఇచ్చి వెళ్ళేవారట!
ఒకప్పటి మాట, ఓ రచయిత తను రాస్తున్నంత సేపు రాసి, ఆ కాయితాలు అలా తల కింద పెట్టుకుని నిద్రపోయేవారట. అది చూసి బెజవాడలో వుండే ఆయన మిత్రుడు చదలవాడ మల్లికార్జునరావు ఆ రచయితను ఒప్పించి ఆ కాయితాల కట్టను తీసుకెళ్ళి ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చి, వీటిని ఒకసారి చూడండి అన్నారు. అయన వాటిని పక్కనున్న బీరువాలో పెట్టుకున్నారు. ఇక, ఈ చదలవాడ ఆయన్ని వదిలితేనా? ఆయన పోరు భరించలేక చివరికి ఒకరోజు పురాణం ఆ కట్ట బయటకు తీసి చదవడం మొదలెట్టి, అలా రాత్రంతా చదువుతూ... తెల్లవారుతూ వుండగా పూర్తి చేసి చదలవాడకు ఫోన్ చేశారు ఆ రచయితను తీసుకురమ్మని.
అంతే, చదలవాడ తిరుపతి వెళ్లి ఆయన్ని బెజవాడ ఆంధ్రజ్యోతి ఆఫీస్‌కు తీసుకొచ్చారు. వెంటనే వీక్లీ సీరియల్ అగ్రిమెంట్ మీద సంతకాలు అయ్యాయి.

అలా... వడ్డెర చండీదాస్ తొలి నవల 'హిమజ్వాల' తెలుగు పాఠకుల మీద చలిపిడుగులా పడింది! ఆ వరసలో రెండవది 'అనుక్షణికం' ఒక సంచలనం!
పాతికేళ్ళ తర్వాత జనవరి 2005లో చండీదాస్ కన్నుమూశారు. అప్పటికి కొంచెం ముందుగా పుట్టి అప్పుడే క్రమక్రమంగా ఎదుగుతున్నబెజవాడ 'అలకనంద' పబ్లిషింగ్ హౌస్ దాన్నిమళ్ళీ కొత్త తరం పాఠకుల కోసం తెచ్చింది. ఏమిటిది? నిజమే ఇది ఎక్కడా రాయబడని చరిత్ర.
'పరంపర' అనే పదానికి మన వద్ద వాడకం తక్కువ. కొంతకాలం తర్వాత ఈ ఊరును సందర్శించే చదువరులు, ఏలూరు రోడ్డులో వెళుతూ ఒకప్పుడు ఇక్కడ నవోదయ బుక్ షాప్ వుండేది, అని చెప్పుకోవడం సహజమే. అయితే, వెనకటికి అక్కడ నడయాడిన కవులు రచయితల అడుగుజాడల్నిమరో తరం కోసం బెజవాడ పబ్లిషర్లు భద్రంగానే జాగ్రత్త చేస్తున్నారు.
బెజవాడ అనగానే 'అటోనగర్' అంటారు. అంత మాత్రాన ఇది - ఎక్కడెక్కడో తయారైన మోటార్ మెషీన్లు తెచ్చి, ఇక్కడ మనకు తగ్గట్టు అసెంబుల్ చేసి, బళ్ళు రోడ్డుకు ఎక్కించే ఊరు ఒక్కటే కాదు. పరభాషా సాహిత్యాన్ని తెచ్చి ఇక్కడ వాటిని తెనిగించి, అచ్చొత్తి మరీ తెలుగునాట వూళ్ళ మీద వదిలిన ఊరు కూడా!

గోర్కీ 'అమ్మ' ఒక్కటేనా... తెలంగాణ ఆయుధ పోరాటం కాలంలో (1946-1951) ఉద్యమ కరపత్రాలు ఇక్కడ అచ్చు కావడం ఒక చరిత్ర.
ఆ తర్వాత కాలంలో బెజవాడలో బొమ్మకట్టిన - 'గిరిపురం', 'సున్నపు బట్టీలు సెంటర్' వంటివి; అవి ఇప్పుడు ఎరుపా నలుపా అనే చర్చ అటుంచితే, కాలం మిగిల్చిన చరిత్ర చారికలవి. వెరసి - 'పుస్తకం' నుంచి ఈ 'ఊరు'ను వేరుచేసి చూడ్డం కుదిరే పని కాదు.
ఏలూరు రోడ్డులో అచ్చయ్యే బెంగాలీ అనువాద నవల పుస్తకాలు, ఆ తర్వాత కాలంలో మహిళా రచయిత్రుల నవలలు ఆ పక్కనున్న గాంధీ నగర్ సినిమా కంపెనీ ఆఫీసుల్లో జరిగే కథ సిట్టింగుల నుంచే వెండితెర మీద హిట్ సినిమాలు అయ్యేవి.
అప్పట్లో దేశీ ప్రచురణల అనువాద నవలల వల్లే, అక్కినేని 'దేవదాసు', 'బాటసారి' వంటి తెలుగు సినిమాలు మనం చూసింది.
తరం మారి రాంగోపాల్ వర్మ ఇప్పుడు అక్కినేని మనవడితో ఆటోనగర్ నేపథ్యంతో 'బెజవాడ' అంటూ గ్యాంగ్‌స్టర్ సినిమా నిర్మిస్తే, ఇదంతా ఒకనాటి పాత పుస్తకాల తరానికి ఇక్కడి కొత్త రూపమే! అంతమాత్రాన ఈ ఊరు ఇటువంటి కొత్త 'మిషన్ల' రాపిడిని తగ్గించడానికి వాడే 'లూబ్రికెంట్' ల తయారీని ఇప్పటికీ ఆపలేదు.
అందుకే ముప్పై ఏళ్ళుగా ఇక్కడ పుస్తక మహోత్సవాలు.
(విజయవాడలో జనవరి 1 నుండి 30 వ పుస్తక మహోత్సవం సందర్భంగా)
ఇవి కూడా చదవండి:
- ‘కేజీ టమోటా పాకిస్తాన్లో రూ.300, భారత్‌లో రూ.20’
- చైనా - తైవాన్: ఎందుకు విడిపోయాయి.. వివాదం ఎప్పుడు మొదలైంది?
- రోడ్డు మీద వదిలేసిన పాపకు అర్ధరాత్రి వెళ్లి పాలిచ్చిన కానిస్టేబుల్
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- మూడు బ్యాంకుల విలీనంతో సామాన్యుడికి లాభమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








