1984 సిక్కుల ఊచకోత: కళ్లెదుటే తండ్రిని తగలబెట్టేశారు.. 34 ఏళ్ల తరువాత న్యాయం దొరికింది

- రచయిత, సరబ్జిత్ ధలివాల్
- హోదా, బీబీసీ పంజాబీ
ముప్పై నాలుగేళ్ల కిందటి సిక్కుల ఊచకోత కేసులో దిల్లీ హైకోర్టు కాంగ్రెస్ సీనియర్ నేతను జైలుకు పంపించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఇదే అత్యంత కీలక పరిణామం. 1984 సిక్కుల ఊచకోత సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్ మూకలను రెచ్చగొట్టారంటూ ఆయన్ను దోషిగా తేల్చింది.
ఇంతకుముందు సెషన్స్ కోర్టు ఈ కేసులోని మరో నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ సజ్జన్ కుమార్‌ను మాత్రం నిర్దోషిగా ప్రకటించింది. ఇప్పుడు దిల్లీ హైకోర్టు సజ్జన్‌ను దోషిగా తేల్చుతూ మిగతా నలుగురి విషయంలో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
సజ్జన్ కుమార్ ఇంతకాలం రాజకీయ అండదండలతో విచారణను తప్పించుకుంటున్నారని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
ఇందిరాగాంధీ హత్య తరువాత చోటుచేసుకున్న ఈ ఊచకోతలో 3 వేల మందికిపైగా సిక్కులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ కేసులో కీలక సాక్షి అయిన నిర్ప్రీత్ కౌర్‌తో బీబీసీ పంజాబీ గత ఏడాది నవంబరులో, మళ్లీ ఇప్పుడు తాజా తీర్పు తరువాత కూడా మాట్లాడింది.

ఫొటో సోర్స్, Getty Images
మొహలీలో నివసిస్తున్న ఆమె ''1984 అల్లర్లలో నా తండ్రి చనిపోకపోయి ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది. నేను ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ అయ్యుండేదాన్ని. కానీ, నా తండ్రి మరణంతో అంతా తలకిందులైంది'' అంటూ ఆవేదన చెందారు.
అప్పటి అల్లర్లలో సజీవ దహనమైన తన తండ్రి ఫొటోలను ఆమె బీబీసీకి చూపించారు.
నీళ్లు నిండిన కళ్లతో, విచార వదనంలో ముప్ఫయి నాలుగేళ్ల కిందటి ఆ భయంకర విషాదాన్ని ఆమె మరోసారి గుర్తు చేసుకున్నారు.
''ఆపరేషన్ బ్లూస్టార్ లేకుంటే ఇందిరాగాంధీ హత్య జరిగి ఉండేది కాదు. అప్పుడు సిక్కులపై ఇంతటి అమానుష ఊచకోతా ఉండేది కాదు'' అంటూ చెప్పుకొచ్చారు. న్యాయం పొందడమే తన జీవిత లక్ష్యమనీ ఆమె అన్నారు.
సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు పడడంతో సుదీర్ఘ న్యాయపోరాటంలో 34 ఏళ్ల తరువాత ఆమెకు న్యాయం దక్కినట్లయింది.

తాజా తీర్పు తరువాత ఆమె బీబీసీ పంజాబీ ప్రతినిధి సరబ్జిత్ ధలివాల్‌తో మాట్లాడారు.
''ఈ కేసుకు తార్కిక ముగింపునిచ్చిన న్యాయమూర్తికి, విచారణలో పాలుపంచుకున్న అందరికీ ధన్యావాదాలు. ఈ తీర్పు ముందే వచ్చుంటే నా బాధ కొంతయినా తగ్గేది. ఈ న్యాయం పోరాటంలో ఎంతో కోల్పోయాను. ముందే ఇలాంటి తీర్పు వచ్చుంటే నాకు ఇంతగా నష్టం జరిగేది కాదు'' అన్నారామె.
నిర్ప్రీత్ కౌర్ కుటుంబం 1947లో సియాల్‌కోట్(ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) నుంచి భారత్‌లోని పంజాబ్‌కు వలస వచ్చింది.
ఆమె తండ్రి సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందాక దిల్లీలో రవాణా రంగ వ్యాపారం ప్రారంభించారు.
టాక్సీల వ్యాపారంతో ఆ కుటుంబం హాయిగా బతుకుతూ వారు నివసించే పాలెం కాలనీలో అందరి నుంచీ గౌరవం పొందుతుండేది.
ఇవన్నీ చెబుతూ ఆమె... ''నాన్న నన్ను బేబీ అంటూ పిలిచేవారు'' అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
అల్లర్లలో తండ్రిని కోల్పోయాక వ్యాపారమూ ఆగిపోయింది. ఆ కుటుంబ భవిష్యత్తు అంతా తలకిందులైపోయింది.

అప్పటికి నిర్ప్రీత్ స్కూలు చదువు పూర్తిచేసి వెంకటేశ్వర కాలేజీలో చేరారు. ఆ రోజు తండ్రిని సజీవంగా తగలబెట్టడాన్ని కళ్లారా చూసి భయకంపితురాలయ్యారు నిర్ప్రీత్.
ఆ క్రూరమైన మూకలోని మనుషుల ముఖాలు ఇప్పటికీ తనకు జ్ఞాపకమేనంటారామె.
ఆ దారుణం తరువాత దిల్లీ ఇక ఎంతమాత్రమూ సురక్షితం కాదని భావించిన కుటుంబ సభ్యులు ఆమెను జలంధర్ పంపించారు.
కానీ, ఆమె తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనకున్నారు. తీవ్రవాదుల్లో చేరి సాటి తీవ్రవాది ఒకరిని పెళ్లి చేసుకున్నారు.
అయితే, పెళ్లయిన 12 రోజులకే ఆమె భర్త పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. అది నకిలీ ఎన్‌కౌంటర్ అని చెబుతారు నిర్ప్రీత్. ఆ తరువాత ఒక మగబిడ్డకు జన్మనిచ్చిందామె.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరిస్థితుల్లో తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆమె ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ తరువాత 1988లో స్వర్ణదేవాలయ ప్రాంగణంలో ఉన్న తీవ్రవాదులను బయటకు పంపించేందుకు చేపట్టిన 'ఆపరేషన్ బ్లాక్ థండర్'లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముక్కుపచ్చలారని కొడుకు సహా ఆమెను జైల్లో పెట్టారు. ఇక అక్కడి నుంచి ఆమె జీవితం పంజాబ్‌లోని జైళ్లు, దిల్లీలోని తీహార్ జైలులో సాగింది.
దీంతో తన పంథా మార్చుకుని న్యాయపోరాటం చేయాలని తలపోశారామె. అనంతరం 1990లో బెయిలుపై బయటకొచ్చారు. 1996లో కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది.
అప్పటికే ఆదాయ వనరులన్నీ హరించుకుపోవడంతో బతుకును మళ్లీ పట్టాలెక్కించేందుకు నానా తంటాలు పడ్డారు నిర్ప్రీత్.
2017 నవంబరులో బీబీసీ పంజాబీ ఆమెను కలిసేటప్పటికి ఆమె సజ్జన్ కుమార్, మరో నలుగురిపై తన న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. ''న్యాయపోరాటం మరింత కాలం సాగొచ్చు. కానీ, అంతిమంగా నాకు న్యాయం మాత్రం దొరుకుతుంది'' అని ఆమె అప్పుడే చెప్పారు. ఇప్పుడు తాజా తీర్పు తరువాత ఆమె ''సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు వేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఒకవేళ ఆయనకు మరణశిక్ష వేసి ఉంటే ఆయన చనిపోయేవాడు అంతే. కానీ, ఇప్పుడు జీవితాంతం బాధపడతాడు. అయితే, ఇది ముందే జరిగి ఉంటే ఇంకా బాగుండేది, నేను ఇంతగా నష్టపోయేదాన్ని కాను'' అన్నారు.
ఈ కేసులో సీబీఐ, పంజాబ్ పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు కూడా కృతజ్ఞతలు చెప్పినప్పటికీ ఒక దశలో నిందితులను కాపాడేందుకు అకాలీలు కూడా ప్రయత్నించారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- 1984 సిక్కుల ఊచకోత, 2002 గుజరాత్ మారణకాండ: న్యాయం కోసం ఎదురుచూపులు
- రాహుల్ గాంధీ యువతను ఎందుకు సీఎం చేయలేదు
- ఉత్తర కొరియా: 'వాళ్లు మమ్మల్ని సెక్స్ టాయ్స్‌లా భావించారు'
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- తెలంగాణ ఎన్నికలు: ప్రపంచ ఓటర్ల వేలిపై తెలంగాణ సిరా చుక్క
- తెలంగాణ ఎన్నికలు: “ప్రత్యేక రాష్ట్రం వస్తే పాతబస్తీ వెలిగిపోతుందన్నారు. కానీ హామీలే మిగిలాయి”
- ‘24 గంటల కరెంట్ మాకొద్దు’
- లువిస్ హామిల్టన్: ‘‘పూర్ ఇండియా’ వ్యాఖ్యలు భారత్ పట్ల సానుభూతితోనే..’
- ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








