స్వైన్ ఫ్లూ బాధితులు ఉన్నారని కృష్ణా జిల్లాలోని చింతకోళ్ళ గ్రామాన్ని వెలివేశారు

స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రబలిందంటూ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కోడూరు మండలం చింతకోళ్ల గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వెలివేశారు. ఈ ఊరికి తాగునీరు, పాలు కూడా అందకుండా చేయడం కలకలం రేపుతోంది.
మందపాకల గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఈ కుగ్రామంలో జనాభా సుమారు 300 దాకా ఉంటుంది. గడచిన నాలుగు రోజుల్లో ఈ ఊరిలో ఇద్దరు చనిపోయారు. వారిలో ఒకరు పేరె మరియమ్మ(32), మరొకరు పేరె నాంచారయ్య(46). దాంతో ఈ ఊరి వాళ్లని బస్సు కూడా ఎక్కకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకోవడం విస్మయం కలిగిస్తోంది.
పేరె నాంచారయ్య మరణానికి హెచ్1ఎన్1 వైరస్ కారణమని కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి నివేదిక చెబుతోంది. మరియమ్మ(45) అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ అసలు కారణాలు మాత్రం వైద్యులు ఇంకా నిర్ధారించలేదు.
ఈ నేపథ్యంలో గ్రామంలో మరో పది మంది జ్వరంతో బాధపడుతుండటంతో అలజడి రేగింది. చింతకోళ్ల గ్రామంలో స్వైన్ ఫ్లూ ప్రబలిన కారణంగా ఇక్కడి వాళ్లతో మాట్లాడకూడదని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నిర్ణయించుకున్నారు.
పిల్లల స్కూల్ బస్‌ను రెండు రోజులుగా ఈ ఊరికి పంపించడం లేదు. చివరకు పాలు, నీళ్లు కూడా తమకు అందడం లేదని చింతకోళ్ల గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి వాపోయారు. ఎవరో ఇద్దరు చనిపోతే ఊరినంతా వెలివేస్తారా? అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సమీప గ్రామాల ప్రజలు స్వైన్ ఫ్లూ భయంతో చింతకోళ్ల గ్రామస్థులను కలిసేందుకు అంగీకరించడం లేదనే విషయాన్ని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టీవీఎస్ఎన్ శాస్త్రి ధ్రువీకరించారు.

రంగంలోకి వైద్య బృందాలు
సమాచారం అందిన వెంటనే వైద్య, ఆరోగ్య శాఖ బృందాలను చింతకోళ్ల పంపినట్లు ఆయన తెలిపారు. తక్షణమే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని, ఈ గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని చెప్పారు.
అపోహల కారణంగా సమీప గ్రామ ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నట్టు తెలిపారు. కృష్ణా జిల్లాలో పరిస్థితి అంతా సాధారణంగానే ఉందన్నారు.
గత మూడు నెలల్లో 10 స్వైన్ ఫ్లూ కేసులు మాత్రమే నమోదయినట్టు వెల్లడించారు. అక్టోబర్‌లో ఒకరు స్వైన్ ఫ్లూతో చనిపోగా, ఇటీవల నాంచారయ్య మరణం నమోదయ్యిందన్నారు.
ప్రస్తుతం చింతకోళ్ల చుట్టుపక్కల ప్రజల్లో ఆందోళన ఉన్నట్టు గుర్తించామని, వారికి అవగాహన కల్పిస్తామని డాక్టర్ టీవీఎస్ఎన్ శాస్త్రి చెప్పారు.
స్వైన్ ఫ్లూ లక్షణాలతో మరణించిన నాంచారయ్య అవనిగడ్డ, రేపల్లెతో పాటు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కూడా చికిత్ప పొందినట్టు అధికారులు చెబుతున్నారు.
వైద్యం పూర్తిగా చేయించుకోకుండా మధ్యలోనే ఇంటికి వచ్చేయడంతో ఆమె ఆరోగ్యం క్షీణించిందని జిల్లా వైద్యాధికారి చెబుతున్నారు.
ప్రస్తుతం చింతకోళ్లలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ బయటి ప్రపంచానికి తెలియడంతో అధికార యంత్రాంగం ఆ గ్రామానికి క్యూ కట్టారు.

అనారోగ్యంతో ఉన్న వారికి చికిత్స అందిస్తున్నారు. సుమారు 14 మంది సిబ్బందితో వైద్య శాఖ అధికారులు శిబిరం నిర్వహిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కూడా రంగంలో దిగింది.
ప్రస్తుతం గ్రామంలో అనారోగ్యంతో ఉన్నవారికి సాధారణ జ్వరమే ఉందని అధికారులు చెబుతున్నారు. చుట్టు పక్కల గ్రామస్తులతో కూడా మాట్లాడుతున్నారు. అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
చింతకోళ్ల గ్రామాన్ని వెలివేసిన ఘటనపై కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం కూడా స్పందించారు. ఆ ఊరిని వెలివేశారనే ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాల్లో పిల్లలు రాకుండా ఆంక్షలు పెట్టడంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆ గ్రామానికి చెందిన నాంచారయ్య మృతికి స్వైన్ ఫ్లూ పూర్తి కారణం కాదని, కార్డియాక్ అరెస్ట్‌తోనే ఆయన మరణించారని కలెక్టర్ తెలిపారు.
నిత్యావసర సరుకుల సరఫరాలో ఎటువంటి ఆటకం లేదని, గ్రామస్తులకు అన్ని సదుపాయాలు అందుతున్నాయని, జిల్లా స్థాయి యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తోందన్నారు.

స్వైన్ ఫ్లూతో మరణించిన ఇద్దరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సాయం అందించే ప్రయత్నం చేస్తామని కలెక్టర్ లక్ష్మీకాంతం హామీ ఇచ్చారు.
స్వైన్ ఫ్లూ కారణంగా ఓ గ్రామం మొత్తాన్ని వెలి వేసిన వ్యవహారం అందరినీ విస్మయానికి గురిచేస్తోందని చల్లపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు ప్రసాద్ తెలిపారు.
స్వైన్ ఫ్లూ ప్రమాదకరం కాదని, ముందస్తు చర్యలతో నివారణ సాధ్యమేననే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు ప్రజల్లో అపోహలు తొలగించే చర్యలపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్: పదేళ్లలో రెట్టింపైన సిజేరియన్ జననాల శాతం
- భారతీయ మహారాజు కానుకగా ఇచ్చిన ఆవులు, ఎద్దులు బ్రెజిల్ దశ మార్చాయి. ఇలా..
- క్యాన్సర్‌ను ‘తినేసే’లా మానవ కణాలను బలోపేతం చేయనున్న కొత్త మందు
- ఆయుష్షు పెరుగుతోంది. చూపు తగ్గుతోంది
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
- రొమ్ము క్యాన్సర్: ‘ప్రాథమిక పరీక్షలు చేయించుకుంటే కీమోథెరపీ అవసరం ఉండదు’
- 96 ఏళ్ల వయసులో మూడో తరగతి పాసైన కేరళ బామ్మ
- జ్వరం లేకుండానే డెంగీ రావచ్చు... ఇది మరీ ప్రమాదకరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








