బెంగళూరులోని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యాలయంపై ఈడీ దాడులు

ఫొటో సోర్స్, facebook/AmnestyInternational
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
బెంగళూరులోని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యాలయంపై గురువారం మధ్యాహ్నం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు చేశారు.
''మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి అధ్యయనకర్తలు, ఇతర సిబ్బంది ఫోన్లను తీసుకున్నారు'' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో పనిచేసే ఓ ఉద్యోగి 'బీబీసీ హిందీ'తో చెప్పారు.
''ఫారిన్ ఎక్స్చేంజి మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) పరిధిలోకి వచ్చే నిధులేవీ మాకు అందవు.. అలాంటప్పుడు మాపై ఎందుకు దాడులు చేస్తున్నారో అర్థం కావడం లేదు'' అని మరో ఉద్యోగి అన్నారు.
ప్రజల హక్కులకు సంబంధించిన పలు అంశాలపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటనలు జారీ చేస్తోంది. కాగా... ఈ దాడులపై ఈడీ వర్గాలను బీబీసీ సంప్రదించినప్పటికీ వారు దీనిపై స్పందించలేదు.

ఫొటో సోర్స్, facebook/GreenpeaceIndia
గ్రీన్‌పీస్‌పైనా ఇదే తరహాలో..
కొద్దివారాల కిందట మరో సంస్థ గ్రీన్‌పీస్ సంస్థపైనా ఈడీ దాడులు జరిపింది. అప్పటి దాడులపై గ్రీన్‌పీస్‌కు చెందిన ఓ ఉద్యోగి బీబీసీ హిందీతో మాట్లాడుతూ.. ''ఆ రోజు మధ్యాహ్నం 11.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సోదాలు చేశారు. వారు వారెంట్‌తో రాలేదు సరికదా.. కనీసం ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించిన కాపీ కూడా మాకివ్వలేదు. మాకొచ్చే నిధులన్నీ దేశంలోంచే వస్తాయి. ఫెమా పరిధిలో ఉండం. కానీ దాడులు చేశారు. మేం మా నిధుల సమీకరణ పనిని అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చాం. కానీ, ఈడీ మాకు చెప్పకుండానే మా బ్యాంకు ఖాతాలను నిలిపివేసింది. ఈ సంగతి బ్యాంకులు చెప్పేవరకు మాకు తెలియలేదు'' అన్నారు.
ఈ దాడులపై గ్రీన్‌పీస్ సంస్థ కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సోమవారం విచారకు రానుంది.
భారత్‌లో స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి వచ్చే నిధులపై వివాదాలున్నాయి. 2015 ఏప్రిల్‌లో కేంద్రం విదేశీ నిధులు పొందుతున్న 9,000 స్వచ్ఛంద సంస్థల రిజిష్ట్రేషన్లను రద్దు చేసింది. దేశంలోని చట్టాల ప్రకారం అవి నడుచుకోవడం లేదన్న కారణంతో ఈ చర్యలు తీసుకున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో కర్నాటక కాంగ్రెస్ అధికార ప్రతినిధి రిజ్వాన్ అర్సాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.
అందులో.. ''ప్రభుత్వంలోని పెద్దలకు వ్యతిరేకంగా గళం విప్పినా, ప్రజాస్వామ్య సంస్థల విషయంలో ప్రశ్నించినా అలాంటి స్వచ్ఛంద సంస్థలపై దాడులు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడడం, ప్రభుత్వంలోని అవినీతి పరులను కాపాడడం తప్ప ఈడీ, సీబీఐ, ఇంటిలిజెన్స్ బ్యూరోకు వేరే పనిలేనట్లుగా ఉంది. ప్రధాని మోదీ అవినీతిపరులను రక్షిస్తున్నారు. ప్రజాస్వామ్య భారతాన్ని కొనసాగించాలనుకుంటున్నారా.. లేదంటే నియంతృత్వం తేవాలనుకుంటున్నారా.. దీనికి మోదీ సమాధానం చెప్పాలి'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎంజే అక్బర్ రాజీనామా: ఇది #మీటూ విజయం - ఎన్ రామ్
- రామ్‌లీల: ‘సంపూర్ణ రామాయణాన్ని’ తొలిసారి ప్రదర్శించింది ఇక్కడే
- సౌదీ అరేబియా: అమెరికా ఆంక్షలు విధిస్తే ప్రపంచానికి ఏమవుతుంది?
- భారతదేశ 'తొలి' కమ్యూనిటీ రేడియో దశాబ్ది వేడుక... ఇది తెలంగాణ దళిత మహిళల విజయ గీతిక
- కెనెడా: ఇకపై పెరట్లో నాలుగు గంజాయి మొక్కలు పెంచుకోవచ్చు
- పాకిస్తాన్: ఆరేళ్ల జైనబ్‌ను రేప్ చేసి చంపిన నేరస్థుడికి ఉరి శిక్ష అమలు
- పాకిస్తాన్ దేశ చరిత్రలోనే కటిక చీకటి రాత్రి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








