తెలుగు బైబిల్‌కి 200 ఏళ్లు

ఫొటో సోర్స్, Getty Images
తెలుగులో తొలి బైబిల్ ప్రచురించి ఈ ఏడాదికి సరిగ్గా రెండు వందల ఏళ్ళు పూర్తయింది. అవును 1818లో బైబిల్ కొత్త నిబంధన తెలుగు అనువాదం రెండు భాగాలుగా ప్రచురితమయింది.
17 - 18 శతాబ్దాల్లో క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో క్రియాశీలంగా ఉన్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్ పాలన ప్రత్యక్షంగా ఉన్న ప్రాంతాల్లో వారి కార్యక్రమాలు చురుకుగా సాగాయి.
అందులో భాగంగా భారతీయ భాషల్లో బైబిల్ అనువాదాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సీరాంపూర్‌లో ఈ అనువాదాలు జరిగాయి.
ఒక డానిష్ లూథరన్ మిషనరీకి చెందిన బెంజిమన్ షుల్జ్ అనే వ్యక్తి మొదటిసారి 18వ శతాబ్దపు తొలినాళ్లలో బైబిల్ తెలుగులోకి అనువాదం చేశారు.
ఆ చేతిరాత ప్రతులను ప్రచురించడం కోసం అప్పట్లో జర్మనీ పంపారు. కానీ ఏ కారణం చేతనో అవి ముద్రణ కాలేదు. ఆయన రాసిన చేతిరాత ప్రతులు కూడా దొరకలేదు.
ఇది జరిగిన చాన్నాళ్ల తరువాత రెండు వేర్వేరు సంస్థలు, వేర్వేరు ప్రాంతాల్లో బైబిల్ తెలుగు అనువాదం ప్రారంభించాయి.
విలియం కేరీ ఆధ్వర్యంలో బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ సంస్థ ప్రస్తుత పశ్చిమ బెంగాల్లోని సీరాంపుర్ దగ్గర బైబిల్ అనువాద ప్రక్రియ ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Vijjeswarpu Edward Paul
అదే సమయంలో లండన్ మిషనరీ సొసైటీ సంస్థ నుంచి అగస్టస్ దె గ్రాంజెస్. జార్జ్ క్రాన్ అనే వ్యక్తులు ఆనందరాయర్ అనే స్థానికుడి సహకారంతో విశాఖపట్నంలో ఈ అనువాద ప్రక్రియ ప్రారంభించారు.
కానీ విశాఖలో ఈ అనువాదం ప్రారంభించిన అగస్టస్ 1809లో, జార్జి 1810లో చనిపోయారు. దీంతో ఆ అనువాద ప్రక్రియను జాన్ గార్డన్, ఎడ్వర్డ్ ప్రిచెట్‌లు కొనసాగించారు.
వారు మరణించడానికి ముందే మాథ్యూ (Mathew - ముత్తయి), మార్క్ (Mark - మార్కు), ల్యూక్ (Luke - లూకా) అధ్యాయాలను పూర్తి చేశారు లేదా చేయించారు. ఈ మూడు అధ్యాయాలు 1812లో విలియం కేరీ ఆధ్వర్యంలోని మిషనరీ ప్రెస్‌లో ముద్రించారు.
బైబిల్‌కి సంబంధించిన ఒక భాగం తెలుగులో ముద్రించడం ఇదే మొదలు.
నిజానికి అదే సమయంలో సీరాంపూర్‌లో విలియం కేరీ ఆధ్వర్యంలో మరో అనువాదం కొనసాగుతున్నప్పటికీ, తాము చేస్తున్న అనువాదం కంటే విశాఖ నుంచి వచ్చిన అనువాదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముద్రించారు కేరీ.
అదే సందర్భంలో బైబిల్‌ను అన్ని భాషల వారికీ తక్కువ ధరకు చేరవేయాలనే ఉద్దేశంతో ‘‘బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ’’ అనే సంస్థ 1804లో లండన్‌లో ఏర్పడింది. బైబిల్ అనువాదాలు, పంపిణీ చేసే ఇతర సొసైటీలకు ఈ సంస్థ ఆర్థిక సహకారం అందించింది.
ఈ బ్రిటిష్ సంస్థకు అనుబంధంగా భారత్ లో 1811లో కలకత్తా ఆగ్జిలరీ బైబిల్ సొసైటీ ఏర్పడింది.

ఫొటో సోర్స్, Kevin Eng
మరోవైపు సీరాంపూర్ లోనూ, విశాఖపట్నంలోనూ బైబిల్ తెలుగు అనువాదాలు కొనసాగుతూ వచ్చాయి. రెండు అనువాదాలూ 1818 నాటికి పూర్తయ్యాయి. ముందుగా సీరాంపూర్‌లో సిద్ధమయిన అనువాదం ముద్రణకు వెళ్లింది.
అదే సమయంలో విశాఖలో జరిగిన అనువాదం కలకత్తా ఆగ్జిలరీ సొసైటీ ఆమోదం కోసం పంపారు. ఆ ప్రతిని పరిశీలించడం కోసం మద్రాస్‌లో ఉండే థాంప్సన్‌కి పంపించింది కలకత్తా సొసైటీ.
అప్పటికే మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు పండితుడిగా పేరు గాంచి క్యాంప్ బెల్, ఫోర్ట్ సెయింట్ జార్జ్ కాలేజీలో పనిచేసే మరో స్థానిక తెలుగు పండితుడు ఈ ప్రతిని పరిశీలించారు. వారిద్దరూ కలిసి ఈ అనువాదమే బాగుందని తీర్మానించారు.
‘‘సరళంగా, సులువుగా అర్థమయ్యేలా, సమగ్రంగా ఉందనీ, ప్రజలకు సరిపోతుందనీ, సాధారణ ఉపయోగానికి పనికొస్తుందని’’ వారు తెలిపారు. ఈ వ్యాఖ్యలు చూసిన కలకత్తా ఆగ్జిలరీ సొసైటీ, విశాఖలో తయారయిన ఈ ప్రతినే ముద్రించాలని తీర్మానించింది.
దీంతో ఈ ప్రతిని ఎడ్వర్డ్ ప్రిచెట్ ఆధ్వర్యంలో మద్రాసులో ముద్రించారు. అప్పటికే సీరాంపూర్ లో అనువాదమయిన ప్రతిని కూడా ముద్రించినా, విశాఖలో తయారయిన ప్రతినే తెలుగులో ప్రామాణింకంగా తీసుకుని, దాన్నే సరఫరా చేశారు. ఆ తరువాత ముద్రితమైన బైబిల్ అనువాదాలు కూడా దీని ఆధారంగానే వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
బైబిల్‌ని తెలుగులో అనువదించే ఘనత దక్కించుకున్న లండన్ మిషనరీ సొసైటీ.. మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఉత్తర సర్కారులో (ప్రస్తుత కోస్తాంధ్రలోని ఉత్తర భాగాలు - విజయవాడ నుంచి పైన) ప్రారంభమైన తొలి ప్రొటెస్టెంట్ మిషనరీ.
1805లో వారు విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ తరువాత విశాఖలో వచ్చిన మిషనరీలు కూడా తెలుగు అనువాదాలు కొనసాగించాయి.
అనంతరం బైబిల్ అనువాదాలను రివిజన్ చేసే కార్యక్రమం జరిగింది. మద్రాస్ ఆగ్జిలరీ బైబిల్ సొసైటీ ఒక బైబిల్ రివిజన్ కమిటీ వేసింది. అప్పుడు బైబిల్ తెలుగును రివిజన్ చేసిన వారిలో జాన్ హే, రెవరెండ్ పులిపాక జగన్నాథంల పేర్లు ప్రముఖంగా వినిపించాయి.
- 1818లో కేవలం బైబిల్ కొత్త నిబంధన మాత్రమే అనువాదం అయింది
- అప్పటికి పాత నిబంధన అనువాదం ప్రారంభం కాలేదు
- అప్పట్లో కొత్త నిబంధనను కూడా రెండు సంపుటాలుగా ముద్రించారు
- బైబిల్ అనువాదానికి సంబంధించిన ఈ సమాచారం అంతా మిషనరీల రికార్డుల్లో నమోదయ్యాయి
- తొలి ప్రతి 2వ వాల్యూమ్ ప్రస్తుతం బెంగళూరులోని యునైటెడ్ థియోలాజికల్ కాలేజీలో ఉంది
- తొలి ప్రతి మరికొన్ని కాపీలు బెంగళూరులోని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి
- తొలి ప్రతి మొదటి వాల్యూమ్ మాత్రం లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో ఉంది
- తొలి ప్రతి 2వ వాల్యూమ్ కాపీ 2005లో విశాఖలో లండన్ మిషనరీస్ సంస్థ ద్విశతాబ్ది (200) వార్షికోత్సవం సందర్భంగా తెప్పించారు
- అప్పటి బిషప్ ఆదేశాల మేరకు దాన్ని బెంగళూరు పంపించారు
- కొత్త నిబంధన అనువాదానికి దాదాపు పదేళ్లు పట్టింది
- బైబిల్ పాత నిబంధన హిబ్రూ భాషలో, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాసి ఉంది
- కొత్త నిబంధనను గ్రీకు నుంచి లాటిన్ భాషకు అనువదించిన సెప్టెంబరు 30వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అనువాదాల దినోత్సవంగా నిర్వహిస్తోంది
(విశాఖకు చెందిన ఇంటాక్ సంస్థ ప్రతినిధి విజ్జేశ్వరపు ఎడ్వర్డ్ పాల్ ఇచ్చిన వివరాల ఆధారంగా)
ఇవికూడా చదవండి
- BBC Special- కోల్లూరు... కోహినూర్ పుట్టిల్లు
- హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?
- బిగ్ బాస్-2: ’’ఈక్వల్ గేమ్ ఎలా అవుతుంది‘‘- బాబు గోగినేని
- బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’: కళ్లకు కడుతున్న ఫొటోలు
- #HisChoice: ‘నేను మగ సెక్స్ వర్కర్‌ను... శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే...’
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు... 32 ఏళ్లుగా బాధను భరిస్తూనే ఉన్నాను
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








