పద్మలక్ష్మి: పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు.. ఆ బాధను 32 ఏళ్లుగా భరిస్తూనే ఉన్నాను

పద్మలక్ష్మి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పద్మలక్ష్మి

భారత సంతతి మోడల్, అమెరికాలో టెలివిజన్ ప్రయోక్త అయిన పద్మలక్ష్మి సంచలన విషయాన్ని వెల్లడించారు. పదహారేళ్ల వయసులోనే తనపై అత్యాచారం జరిగిందని చెప్పారు.

ఇంతకాలం ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టి ఉంచాల్సిందో కూడా ఈ 48 ఏళ్ల మోడల్ వివరించారు.

న్యూయార్క్ టైమ్స్ పత్రికకు రాసిన వ్యాసంలో ఆమె.. తనకు పదహారేళ్ల వయసున్నప్పుడు నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో బాయ్‌ఫ్రెండే తనపై అత్యాచారం చేశాడని చెప్పారు.

తన పొరపాటు వల్లే లైంగికదాడికి గురైనట్లు భావించేదానినని.. మహిళలు తమపై జరిగే లైంగిక దాడుల గురించి బయట ప్రపంచానికి ఎందుకు చెప్పరో కూడా తనకు ఆ తరువాతే అర్థమైందని ఆమె పేర్కొన్నారు.

పద్మలక్ష్మి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పద్మలక్ష్మి

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టుకు నామినేట్ చేసిన జడ్జి బ్రెట్ కేవెనాపై ఇద్దరు మహిళలు అత్యాచార ఆరోపణలు చేయడం సంచలనంగా మారిన నేపథ్యంలోనే న్యూయార్క్ టైమ్స్‌లో పద్మలక్ష్మి వ్యాసం ప్రచురితమైంది.

కాగా 1980ల్లో జరిగినట్లుగా చెబుతున్న ఈ ఆరోపణలను జడ్జి కేవెనా తోసిపుచ్చుతున్నారు. ఆయనపై తొలుత ఆరోపణలు చేసిన బ్లేసీ ఫోర్డ్ ఈ వారంలో కోర్టు ముందు సాక్షం చెప్పాల్సి ఉంది.

కాగా పద్మలక్ష్మి తన వ్యాసంలో ట్రంప్ ఈ వ్యవహారంపై ట్విటర్ వేదికగా చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.

''ఏళ్ల కిందటే అత్యాచారం జరిగితే ఫోర్డ్ ఇప్పటివరకు ఆ విషయం ఎందుకు చెప్పలేదని ట్రంప్ అంటున్నారు.. కానీ, ఆరోపణలు చేస్తున్న ఇద్దరు మహిళలూ ఇంతకాలం ఆ విషయం ఎందుకు చెప్పలేదో నేను అర్థం చేసుకోగలను. 32 ఏళ్లుగా నేనూ అలాగే మౌనంగా ఉన్నాను కదా..'' అని తన వ్యాసంలో రాశారు.

పద్మలక్ష్మి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పద్మలక్ష్మి

ఇంతకీ పద్మలక్ష్మికి ఏం జరిగింది?

పదహారేళ్ల వయసులో తనపై అత్యాచారం జరిగిందని చెప్పిన లక్ష్మి ఆ నాటి ఘటనను తన వ్యాసంలో వివరించారు.

''అప్పుడు నేను స్కూల్ ముగిశాక లాస్ ఏంజెలెస్‌లోని ఒక మాల్‌లో పనిచేసేదాన్ని. అక్కడే పరిచయమైన కుర్రాడితో డేటింగ్ మొదలైంది. అతను కాలేజిలో చదువుకుంటూనే ఓ మెన్స్‌వేర్ దుకాణంలో పనిచేసేవాడు. అతడికి 23.. నాకు 16.

అలా పరిచయం కొనసాగుతున్న సమయంలోనే కొత్త సంవత్సరం వేడుకల రోజున ఇద్దరం కలిసి పార్టీకి వెళ్లాం. అక్కడి నుంచి అతని అపార్ట్‌మెంట్‌కి వెళ్లాను.

అలసిపోవడంతో మాట్లాడుతూ మాట్లాడుతూ అలా నిద్రపోయాను. అంతలోనే రెండు కాళ్ల మధ్యా కత్తితో కోస్తున్నంతగా నొప్పి... ఆ నొప్పికి మెలకువ వచ్చేసింది, కళ్లు తెరిచి చూసేసరికి అతడు నాపై ఉన్నాడు.

'ఏం చేస్తున్నావ'ని అడిగాను.

'కొద్దిసేపే ఈ నొప్పి ఉంటుంది' అన్నాడు.

'ప్లీజ్ ఆ పని మాత్రం చేయొద్దు' అంటూ గట్టిగా అరిచాను.

అయినా వినకపోవడంతో భయంతో ఏడ్చాను. 'నిద్రపోయుంటే ఇంత ఉండేది కాదు కదా' అంటూ నాపైనుంచి లేచాడు.

ఆ తరువాత నన్ను ఇంటి దగ్గర దించేశాడు'' అని పద్మలక్ష్మి తన వ్యాసంలో ఆ నాటి ఘటనను రాసుకొచ్చారు.

పద్మలక్ష్మి

ఫొటో సోర్స్, Getty Images

ఎవరికీ చెప్పుకోలేకపోయాను

బాయ్‌ఫ్రెండ్ అత్యాచారం చేశాడని తన తల్లికి కానీ, స్నేహితులకు కానీ చెప్పలేదని.. పోలీసులకు అసలే చెప్పలేదని ఆమె తెలిపారు.

తొలుత చాలాసేపు షాక్‌లో ఉండిపోయానని.. ఆ తరువాత అదంతా తన పొరపాటు వల్లే జరిగిందని భావిస్తుండేదాన్నని.. 'ఈ అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి పాడు పనులేంటి.. అసలు నీకంటే పెద్దోడైన కుర్రాడితో నీకు స్నేహమేంటి?' అంటూ పెద్దోళ్లు ఎక్కడ ప్రశ్నిస్తారో అని నాకు నేనే ఊహించుకునేదాన్నని పద్మ తన వ్యాసంలో రాశారు.

నేను దీన్ని అత్యాచారమో, సెక్సో చెప్పలేకపోయేదాన్ని.. కానీ, నా కన్యత్వం కోల్పోవడం పెద్ద విషయంగా భావించేదాన్ని. ఎప్పుడైనా సెక్స్ చేస్తే అది నా ప్రేమను అందివ్వడానికో.. ఆనందం పంచుకోవడానికో.. పిల్లలను కనడానికో అయి ఉండాలని అనుకునేదాన్ని కానీ, నాపై జరిగిన అత్యాచారంలో ఇందులో ఏ ఒక్క కారణమూ లేదు.

ఈ ఘటన తరువాత నా జీవితంలోకి మరికొందరు బాయ్‌ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్లకి నేను కన్యననే చెప్పేదాన్ని కానీ, అత్యాచారం సంగతి చెప్పలేదు.

నిజానికి నాపై రేప్ జరగడానికి ముందే కొన్ని చేదు అనుభవాలున్నాయి. ఏడేళ్ల వయసులోనే నా సవతి తండ్రి స్నేహితుడొకాయన లైంగికంగా వేధించాడు. ఆ సంగతి ఇంట్లో చెబితే నన్ను కొన్నాళ్ల పాటు భారత్‌లోని తాతగారింటికి పంపించేశారు.

లైంగిక దోపిడీ గురించి చెబితే మనల్నే బయటకు పంపిస్తారని ఆ ఘటనతో నాకు అర్థమైందని ఆమె పేర్కొన్నారు.

''ఇన్నాళ్ల తరువాత నేనీ విషయం బయటపెట్టడం వల్ల నాకేమీ రాదు'' అని స్పష్టం చేసిన పద్మ.. వెంటనే బయటపెట్టకుండా ఏళ్ల తరువాత చేసే అత్యాచార ఆరోపణల్లో నిజాలు తక్కువని అన్న ట్రంప్‌ని ఆమె తప్పు పట్టారు. లైంగిక దాడులపై నిజాలు బయటపెట్టడానికి కాలపరిమితి విధిస్తే అందరం చాలా కోల్పోవాల్సి వస్తుందని ఆమె అన్నారు.

మరోవైపు పద్మ అభిప్రాయాలకు సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది మద్దతు లభిస్తోంది.

మరిన్ని కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)