నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పిల్లలు ఎందుకు పుడతారు?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, మీనా కొత్వాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక చిన్నారి నాలుగు కాళ్లు, రెండు పురుషాంగాలతో పుట్టాడు. కానీ పుట్టిన రెండు రోజులకే చనిపోయాడు.
గోరఖ్‌పూర్ సమీపంలోని సహజ్‌నవా గ్రామంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సెప్టెంబర్ 15వ తేదీన ఈ చిన్నారి జన్మించాడు.
పుట్టిన రెండు రోజుల తర్వాత ఆ చిన్నారి మరణించాడని.. అతడి కుటుంబం పొరుగింటి మహిళ ఒకరు బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.
‘‘ఆ బాలుడికి నాలుగు కాళ్లు, రెండు పురుషాంగాలు ఉన్నాయి. దానివల్ల అతడికి మూత్ర విసర్జన వీలుకాలేదు. అదీగాక.. శరీరం నుంచి మలవిసర్జన దారి కూడా లేదు’’ అని ఆమె తెలిపారు.
సోనోగ్రఫీ రిపోర్టులన్నీ సాధారణంగానే ఉన్నట్లు చెప్పారని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, NIKHILESH PRATAP
ఇది రుగ్మతా? విచిత్రమా?
ఇలా పుట్టే పిల్లలను భారతదేశంలో విభిన్న దృక్కోణాల నుంచి చూస్తారు. కొందరు వీరిని శుభప్రదంగా భావిస్తారు. కొందరు అశుభంగా పరిగణిస్తారు. ఇంకొందరు అదో చిత్రం అనుకుంటారు. కానీ.. ఇలాంటి పిల్లలు పుట్టటం విచిత్రమా? లేదంటే అదొక వ్యాధా?
ఇటువంటి పిల్లలు పుట్టటం విచిత్రం కాదని డాక్టర్ కపిల్ విద్యార్థి అంటారు. ఆయన మాక్సి హాస్పిటల్‌లో పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నారు.
నిజానికి.. ఇదంతా కవలలకు సంబంధించిన విషయం. తల్లి గర్భంలో అండం రూపొందిన తర్వాత అనేక సమస్యలు తలెత్తవచ్చు.. దానివల్ల గర్భంలో కవలలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేకపోవచ్చు.
‘‘ఇటువంటి ఉదంతాల్లో.. అనుసంధానితమైన అండంలోని భాగం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందదు. మిగతా శరీర భాగాలు అభివృద్ధి చెంది శరీరంలోని భాగంగా మారతాయి. అంటే.. ఒక అండం రెండు భాగాలుగా పూర్తిగా విడిపోకపోతే.. పుట్టిన బిడ్డ శరీరం అతుక్కుపోవచ్చు’’ అని ఈ డాక్టర్ విద్యార్థి వివరిస్తున్నారు.
‘‘గర్భంలో అండం పూర్తిగా రెండు భాగాలుగా విడిపోయినట్లయితే.. పిల్లలు కవలలుగా పుడతారు. ఒకవేళ ఆ అండాలు పూర్తిగా విడిపోకపోయినట్లయితే.. రెండు రకాల కవలలు పుట్టవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండు రకాల కవలలు
గోరఖ్‌పూర్‌లో పుట్టిన చిన్నారి.. ‘పారాసైటిక్ ట్విన్’ (అంటే పరాన్న కవల)కు ఉదాహరణ అని మాక్స్ హాస్పిటల్ పీడియాట్రిషియన్ డాక్టర్ పి.ధర్మేంద్ర చెప్పారు.
‘‘వాళ్లు కవలలుగా పుట్టాల్సింది. కానీ ఏ కారణం వల్లనో వారు పూర్తిగా అభివృద్ధి చెందలేదు. వారి శరీరంలో ఒక చిన్న భాగం మాత్రమే అభివృద్ధి చెందింది. అది శరీరంలో అదనపు భాగంగా మారింది’’ అని ఆయన వివరించారు.
‘కాన్‌జాయిన్డ్ ట్విన్స్’ (అవిభక్త కవలలు) కూడా అటువంటి ఉదంతమే. అభివృద్ధి చెందినప్పటికీ.. వారి శరీరాల్లోని కొన్ని భాగాలు కలిసిపోయిన కవలలు వీరు.
ఈ రెండు తరహాల పిల్లలనూ.. సర్జరీ ద్వారా విడదీయవచ్చు.
చిన్నారి శరీరంలోని దిగువ భాగం కలిసిపోయి ఉన్నట్లయితే.. దానిని సర్జరీ ద్వారా వేరు చేయవచ్చునని డాక్టర్ ధర్మేంద్ర చెప్పారు.
ఒకవేళ వెన్నుపూస కలిసిపోయినట్లయితే.. వేరు చేయటం కొంచెం కష్టం. ఎందుకంటే.. చిన్నారి పురుషాంగం పనిచేయకుండా పోయే ప్రమాదముంది.

ఫొటో సోర్స్, SPL
చికిత్స ఎలా ఉంటుంది?
తల్లి గర్భంలో ఇటువంటి బిడ్డ ఉన్నట్లయితే.. తల్లిదండ్రులు గర్భాన్ని తొలగించటం గురించి ఆలోచిస్తారేమో చూడాలి.
గర్భధారణ అనంతరం నాలుగైదు నెలల తర్వాత.. బిడ్డ పరిస్థితి సోనోగ్రఫీ ద్వారా తెలుస్తుందని డాక్టర్లు చెప్తున్నారు.
ఇటువంటి కేసుల్లో మరొక పద్ధతిని కూడా అవలంబిస్తారని డాక్టర్ ధర్మేంద్ర పేర్కొన్నారు.
‘‘మహిళ గర్భంలో ఒకరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండి.. ఒకరు సక్రమంగా అభివృద్ధి చెందుతూ మరొకరు సరిగా అభివృద్ధి చెందకపోతుంటే.. అభివృద్ధి చెందకుండా ఉన్న పిండాన్ని ఇంజక్షన్ ద్వారా తొలగించవచ్చు. తద్వారా.. సరిగా అభివృద్ధి చెందుతున్న బిడ్డకు తల్లి నుంచి సంపూర్ణ పోషకాలు అందుతాయి. ఒకవేళ అలా చేయకపోతే.. తల్లి నుంచి అందే పోషకాలు గర్భంలో ఉన్న పిల్లలందరికీ పంపిణీ అవుతుంటాయి. దానివల్ల ఏ ఒక్క బిడ్డా సరిగా ఎదగదు’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కవల పిల్లల జననానికి కారణం...
కవలలు పుట్టటానికి కారణాలేమిటనే అంశం మీద.. ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ - కృత్రిమ గర్భధారణ) ఆధారంగా పరిశోధనలు జరిగినట్లు డాక్టర్ ధర్మేంద్ర చెప్పారు.
‘‘ఐవీఎఫ్‌ను ఉపయోగించటం ద్వారా.. మహిళ గర్భంలోకి ఒకటి కన్నా ఎక్కువ అండాలు చేరతాయి. ఫలితంగా కవలలు పుడతారు. అంటే.. ఎన్ని అండాలు ఉంటే అంతమంది పిల్లలు పుట్టే అవకాశముంది’’ అని ఆయన పేర్కొన్నారు.
లేబరేటరీలోని టెస్ట్ ట్యూబ్‌లో.. అండాన్ని, వీర్యాన్ని కలపటం ఐవీఎఫ్ ప్రక్రియ. ఇలా ఏర్పడిన పిండాన్ని తల్లి గర్భంలో ప్రవేశపెడతారు.
ఐవీఎఫ్ తరహాలో జరిగే గర్భధారణలో ఇటువంటి కవలల ఉదంతాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. సహజంగా గర్భం దాల్చే మహిళల్లోనూ ఇటువంటివి కనిపిస్తుంటాయని డాక్టర్ ధర్మేంద్ర తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు.. ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- బాడీహ్యాకర్లు: సాహసోపేతం, స్ఫూర్తిదాయకం.. భీతావహం
- అమ్మానాన్న చనిపోయాక నాలుగేళ్లకు ఈ బుజ్జిగాడు పుట్టాడు!
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- అమృత కన్నీటి కథ : ‘‘నన్ను గదిలో బంధించే వారు... ప్రణయ్‌ని మరచిపోవాలని రోజూ కొట్టేవారు’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








