ఆసియా క్రీడల్లో అమ్మమ్మలు: భారత బ్రిడ్జి జట్టులో అత్యధికులు 60 దాటినవారే

- రచయిత, వందన
- హోదా, టీవీ ఎడిటర్, ఇండియన్ లాంగ్వేజెస్
ఆసియా క్రీడల్లో భారత్ నుంచి బామ్మలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిటైర్మెంట్ వయసు దాటిపోయి చాలా కాలమే అయినా ఇండోనేసియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మాత్రం వారికి చోటు దక్కింది.
ఈ పోటీల్లో పాల్గొంటున్న రీటా చోస్కీ వయసు 79 కాగా హేమా దేవరా, కిరణ్ నాడార్‌లకు 67 ఏళ్లు దాటాయి. ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన 'బ్రిడ్జి' ఆటలో వీరంతా తమ ప్రతిభ చూపనున్నారు. భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 24 మంది బ్రిడ్జి క్రీడాకారుల్లో 60 ఏళ్లు దాటినవారు చాలామంది ఉన్నారు.
పేక ముక్కలతో ఆడే ఈ ఆటకు తొలిసారి ఆసియా క్రీడల్లో చోటివ్వడంతో వీరిలో చాలామందికి కల నెరవేరినట్లయింది.

ఫొటో సోర్స్, HemaDevra
ఒకప్పుడు ముక్కలు పట్టుకోవడం కూడా రాని 'జోకర్'.. ఇప్పుడు 'కింగ్'
భారత బృందంలోని హేమా దేవరా ఎవరో కాదు. కేంద్ర మాజీ పెట్రోలియం మంత్రి మురళీ దేవరా భార్య ఆమె. యాభయ్యేళ్ల వయసు వరకు ఆమె తన కుమారుల బాగోగులు చూసుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చించేవారు. లేదంటే రాజకీయ నేత అయిన భర్త మురళి దేవరాతో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించేవారు.
ఆమె కన్నవారి ఇంట్లో పేకాట పేరెత్తినే ఇంతెత్తున లేచేవారట. కానీ, పెళ్లి తరువాత పరిస్థితి మారిపోయింది. ప్రతి శనివారం సాయంత్రం 4 గంటలైతే చాలు భోరున వర్షం కురుస్తున్నా కూడా లెక్క చేయకుండా మురళి దేవరా స్నేహితులు వారింటికి వచ్చి వాలిపోయేవారు. ఇక అప్పుడు ఆట మొదలైతే ఎప్పటికి ముగుస్తుందో ఎవరికీ తెలిసేది కాదు.
అప్పట్లో హేమా దేవరా అంటే మురళి దేవరా భార్యగానే అందరికీ తెలుసు. కానీ, తరువాత కాలంలో ఆమె కుమారులు ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీల్లో చేరడం.. భర్త కూడా రాజకీయాల్లో బాగా తీరికలేకుండా గడపడంతో ఆమెకు ఏమీ తోచేది కాదు. దీంతో ఆమె బ్రిడ్జి ఆడటం నేర్చుకున్నారు.
బిల్‌గేట్స్, వారెన్ బఫెట్‌లతోనూ పోటీ
బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ వంటి ప్రపంచ ప్రముఖులతోనూ హేమా దేవరా బ్రిడ్జి ఆడారు.
''మొదట్లో చాలా కష్టంగా అనిపించేది. ఆ ఆట గురించి నాకు ఏమీ తెలియకపోవడంతో అంతా అయోమయంగా ఉండేది. కానీ, ఇప్పుడు నేను ఎవరికైనా బ్రహ్మాండంగా శిక్షణ కూడా ఇవ్వగలను'' అంటూ ఆమె ఉత్సాహంగా చెప్పుకొచ్చారు.
బ్రిడ్జి ఆట బాగా నేర్చుకున్నాక ఆమె క్లబ్‌లు, టోర్నీల్లో ఆడేవారు. ఎన్నో ట్రోఫీలు కూడా గెలుచుకున్నారు.
ఓసారి ఒక టోర్నీలో ఆమె చాంపియన్‌షిప్ గెల్చుకుంటే బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా తన భర్తే వచ్చారని, ఆయన చేతుల మీదుగానే బహుమతి అందుకున్నానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ మధుర క్షణాలను మర్చిపోలేనంటారామె.

ఆటలో జోడీయే జీవితంలోనూ..
ఇక డైబ్భై తొమ్మిదేళ్ల రీటా చోస్కీ కథ మరింత ఆసక్తికరం. ప్రస్తుతం ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నవారిలో అత్యంత ఎక్కువ వయసు క్రీడాకారిణి ఆమే.
1970 నుంచి ఈ ఆట ఆడుతున్న రీటాకు పతకాల సాధన ఒక అలవాటుగా మారిపోయింది. ఆమె తన వయసు 79 అని కలలో కూడా అనుకోరట.
బ్రిడ్జి ఆటే ఆమెకు జీవిత భాగస్వామిని వెతికిపెట్టింది. ఓసారి బ్రిడ్జి ఆడుతున్నప్పుడు డాక్టర్ చోస్కీని కలుసుకున్నారు. ఆ తరువాత వారిద్దరు జోడీ ఆడేవారు. ఆ సమయంలోనే రీటా మొదటి భర్త మరణించారు. కొద్దికాలం తరువాత చోస్కీ, రీటా పెళ్లిచేసుకున్నారు.
1990లో చోస్కీ మరణించారు, ఆ తరువాత రీటా కుమారులు చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు.
రీటా ఒక్కరే భారత్‌లో ఉండిపోయారు. అయితే, తానేమీ ఒంటరి కాదు, పేక ముక్కలే తన తోడు అని అంటారామె.

ఆటే ఆమెకు గుర్తింపు తెచ్చింది
మరో క్రీడాకారిణి అరవై ఏడేళ్ల కిరణ్ నాడార్‌కు బ్రిడ్జి ఆటతో పాటు కళాకృతుల సేకరణ అభిరుచి. స్వయంగా ఓ ఆర్ట్ మ్యూజియం నిర్వహిస్తున్నారు కూడా.
కిరణ్ భర్త హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపక చైర్మన్ శివ్ నాడార్.
అయితే, బ్రిడ్జి ఆటతో కిరణ్ నాడార్‌కు సొంతంగా గుర్తింపు వచ్చింది.

ఫొటో సోర్స్, KiranNadar
అయితే, భారత బ్రిడ్జి జట్టులో క్రీడాకారులంతా అరవై ఏళ్లకు పైబడినవారు కావడంతో ఆరోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. వారిలో చాలామంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ మందులు వాడుతున్నారు.
దీంతో డోపింగ్ సమస్యలు తలెత్తకుండా ఇండియన్ బ్రిడ్జి అసోసియేషన్, ఆటగాళ్లు ఈ విషయాన్ని నేషనల్ డోపింగ్ ఏజెన్సీకి ముందే తెలియజేశారు.
ఆసియా క్రీడల్లో ఈ ఆటకు చోటు దక్కడం, భారతీయ జట్టు పాల్గొంటుడడం దేశంలో పరిస్థితులను మారుస్తుందని.. ఈ ఆటపై చాలామందిలో ఉన్న వ్యతిరేక భావనలను ఇది పోగొడుతుందని ఇండియన్ బ్రిడ్జి అసోసియేషన్‌కు చెందిన ఆనంద్ సామంత్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- సచిన్‌ను అందరికన్నా ఎక్కువ భయపెట్టిన క్రికెటర్ ఆయనే
- బీబీసీ స్పెషల్: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ఎడారీకరణ ముప్పు
- ‘తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి’ కానీ..
- ఆంధ్రకి 100 కిలోమీటర్లలో ‘టిబెట్’.. చూసొద్దామా?
- లైఫ్‌స్టైలే వినోద్ కాంబ్లీ ఫెయిల్యూర్‌కు కారణమా?
- నా ఎముకలు విరిచేసి పోలీసులకు అప్పగించాలని ఆ విద్యార్థులు ప్లాన్ చేశారు
- కేరళ వరదలు: 26 సెకన్లలో చిన్నారిని కాపాడిన జవాను
- ఫొటోల్లో లక్షల ఏళ్ల భారత చరిత్ర!
- అమెరికాకు ఆ పేరు పెట్టిన మధ్యయుగాల నాటి మ్యాప్ ఇదే
- సిపాయిల తిరుగుబాటు: పబ్‌లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








