వాట్సాప్ వదంతులు: చిన్న పిల్లలకు చాక్లెట్లు పంచారని గ్రామస్తుల దాడి.. బీదర్‌లో హైదరాబాద్ వాసి మృతి

ఫొటో సోర్స్, Reuters
హైదరాబాద్ యువకులను కిడ్నాపర్లుగా భావించిన బీదర్‌లోని స్థానికులు వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన మొహమ్మద్ ఆజం ఉస్మాన్‌సాబ్ (32), అతని స్నేహితులు మొహమ్మద్ సల్మాన్ అలీనూర్, తల్హ ఇస్మాయిల్ ఖురేషీ, నూర్ మొహమ్మద్ సాదిఖ్‌లు శుక్రవారం ఆరద్ తాలూకా హండికెర గ్రామంలోని తమ స్నేహితుడు మొహమ్మద్ బషీర్ అఫ్రోజ్‌ను కలిసేందుకు శుక్రవారం వెళ్లారు.
మధ్యాహ్న భోజనానంతరం తిరుగు ప్రయాణంలో బాల్కుట్ గోకుల్ తండా వద్ద ఫొటోలు తీసుకుందామని ఆగారు. ఆ సమయంలో హండికెర నుంచి తండాకు వస్తున్న పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టారు.
ఖతర్‌లో పనిచేసే ఖురేషీ ఈ మధ్యనే కొత్త కారు కొన్నారు. కారు కొన్న ఆనందంతో, ఖతర్ నుంచి తీసుకొచ్చిన చాక్లెట్‌లు పిల్లలకు పంచి పెట్టారు. అయితే, చాక్లెట్‌లు పంచడం చూసిన స్థానికులు వారిని కిడ్నాపర్లుగా భావించారు.
కొత్త కారుకు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేటు లేకపోవటం, పిల్లలకు చాక్లెట్లు పంచుతుండటంతో వీళ్లు పిల్లల్ని ఎత్తుకెళ్లేవారేనని స్థానికులు అనుమానించి, వాట్సప్‌లో సందేశాలు పంపించారని స్థానిక పోలీసులు తెలిపినట్లు హిందూ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఒక గుంపుగా స్థానికులంతా వచ్చి వీరిపై దాడికి దిగారు. హండికెర గ్రామానికి చెందిన అఫ్రోజ్ స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఆవేశంతో ఊగిపోతున్న స్థానికులు అతని మాటల్ని పట్టించుకోలేదు.

దీంతో స్నేహితులంతా కారులో ఎక్కి వేగంగా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అఫ్రోజ్ కూడా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
స్థానికులంతా కారు వెళుతున్న మార్గంలోని ముర్కి గ్రామస్తులకు ఫోన్లు, వాట్సప్ మెసేజ్‌ల ద్వారా సమాచారం ఇచ్చి.. కారును ఆపాలని కోరారు.
‘మదర్ ముర్కి’ అనే పేరుతో ఉన్న వాట్సప్ గ్రూప్‌లో స్నేహితులు, వారి కారు ఫొటోలు, వీడియోలను విస్తృతంగా షేర్ చేశారని పోలీసులు తెలిపారు.
దీంతో ముర్కి గ్రామస్తులు కారును అడ్డుకునేందుకు రోడ్డుపై చెట్టు, బండరాళ్లు అడ్డంగా పెట్టారు. వేగంగా ప్రయాణిస్తున్న కారు వాటిని దాటేందుకు ప్రయత్నించి పక్కనే ఉన్న కల్వర్టులో పడిపోయింది.
ఇంతలో కొందరు స్థానికులు కమల్ నగర్ పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. మరికొందరు కారులో ఉన్న యువకుల్ని బయటకు లాగి వారిపై దాడికి దిగారు. నలుగురు పోలీసులు వచ్చిన తర్వాత కూడా స్థానికుల గుంపు యువకులపై దాడి చేస్తూనే ఉందని, పోలీసులు వారించినా, విడిపించేందుకు ప్రయత్నించినా ఆగలేదని హిందూ పత్రిక పేర్కొంది.
గ్రామస్తులంతా శాంతించే సరికే మొహమ్మద్ ఆజం ఉస్మాన్‌సాబ్ మృతి చెందాడని, గాయపడిన అతని స్నేహితుల్ని హైదరాబాద్ తరలించారని వివరించింది. వీరిని విడిపించే క్రమంలో కమల్ నగర్ పోలీసు స్టేషన్ నుంచి వచ్చిన పోలీసులకు కూడా గాయాలయ్యాయని హిందూ పత్రిక తెలిపింది.
కాగా, ఈ సంఘటనకు కారణమైన 34 మందిని అదుపులోకి తీసుకున్నామని, కమల్ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశామని బీదర్ పోలీసు సూపరింటెండెంట్ డీ దేవరాజా తెలిపారు.
‘మదర్ ముర్కి’ వాట్సప్ గ్రూపు అడ్మిన్, ఇందులో ఫొటోలు, వీడియోలు షేర్ చేసిన వారిని కూడా శనివారం అరెస్టు చేశామని ఆయన తెలిపారు.
ప్రజలెవరూ వదంతుల్ని ప్రచారం చేయొద్దని, నమ్మొద్దని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు.
గాయపడ్డ మిగతా ముగ్గురినీ హైదరాబాద్ మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల, సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ పరామర్శించారు. ఘటనా స్థలంలో చనిపోయిన ఆజం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, శనివారం ఎర్రకుంటలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారని నమస్తే తెలంగాణ పత్రిక తెలిపింది.
ఆజం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడని వివరించింది.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: కత్తి మహేశ్ - పరిపూర్ణానంద బహిష్కరణలు దేనికి సంకేతం?
- హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు?
- ఉత్తరప్రదేశ్ మహిళలకు పాలమూరు వనితల పాఠాలు
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- ప్రపంచం నుంచి చీకటిని మానస తరిమేయాలనుకుంటోంది. ఇలా..
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు : బీబీసీ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్
- హాలీవుడ్ సినిమాల రేంజ్లో జైళ్ల నుంచి తప్పించుకున్నారు వీళ్లంతా
- అమెరికా-బ్రిటన్ చారిత్రక సంబంధాలకు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలుకుతారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








