కృత్రిమ మేధ: చైనాతో పోటీపడాలంటే భారత్‌కు ఉన్న అనుకూలతలివే

ఫొటో సోర్స్, Getty Images
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో భారత్ కేంద్రం కాగలదా?- ఈ ప్రశ్నకు ఔననే సమాధానమిస్తోంది 'నీతీ ఆయోగ్'. ఇది సాకారమయ్యే అవకాశముందని పరిశోధక విశ్లేషకుడు ఆర్.శశాంక్ రెడ్డి చెప్పారు. ఇదెలా సాధ్యమో ఆయన వివరించారు.
కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) రంగం బాగా విస్తరిస్తోంది. ఇందులో మరిన్ని విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే పనిలో నాయకత్వం వహించేందుకు భారత్ ఇటీవలే ముందుకొచ్చింది.
అత్యంత శక్తిమంతమైన, అత్యంత సంపన్న దేశాలు ఇప్పటికే ఈ రంగంలో పోటీపడుతున్నాయి. ఇప్పుడు పోటీలోకి భారత్ వచ్చింది.
ఒక దేశ శక్తిసామర్థ్యాలతో ముడిపడిన అన్ని అంశాల్లో- ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి సహా- ఏఐ తన వంతు పాత్ర పోషిస్తుంది. ఈ రంగంలో నాయకత్వం వహించడం అంతర్జాతీయంగా ఆధిపత్యాన్ని సాధించేందుకు దోహదం చేస్తుంది.
కృత్రిమ మేధ రంగంలో అమెరికా, చైనా భారీస్థాయిలో పెట్టుబడి పెడుతున్నాయి. మరి భారత్‌కు ఏమైనా అవకాశం ఉందా? ఉందనే చెబుతోంది ఈ నెల్లో నీతీ ఆయోగ్ విడుదల చేసిన నివేదిక. 'కృత్రిమ మేధపై జాతీయ వ్యూహం' పేరుతో ఈ సంస్థ దీనిని రూపొందించింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఏంచేయగలదు?
ఏఐకు సంబంధించిన ప్రాథమిక పరిశోధనల్లో, వనరుల్లో అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ చాలా వెనకబడి ఉందని నివేదిక చెబుతోంది.
అమెరికాతో పోలిస్తే భారత్‌లో పరిశోధకులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఏఐపై పరిశోధనలకు ప్రత్యేకించిన ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాల్లోని విభాగాలు మరీ తక్కువగా ఉన్నాయి.
అమెరికాకు చెందిన గూగుల్, అమెజాన్, చైనాకు చెందిన బైడు, అలీబాబా లాంటి భారీ సంస్థలు ఉన్నతస్థాయి పరిశోధనలపై పెట్టుబడి పెట్టగలవు. అయితే అలాంటి సంస్థలేవీ భారత్‌లో లేవు.
కానీ భారత్‌కు తనవైన అనుకూలతలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో పెద్దసంఖ్యలో ఇంజినీర్లు
పెద్దసంఖ్యలో ఇంజినీర్లు ఉండటం, స్టార్టప్ పరిశ్రమలు విస్తరిస్తుండటం, స్మార్ట్‌ఫోన్ వాడకందార్ల సంఖ్య పెరిగిపోతుండటంతో అందుబాటులోకి వస్తున్న డేటా లాంటి అంశాలు భారత్‌కున్న అనుకూలతలు.
ఏఐపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. నీతీ ఆయోగ్ నివేదిక ఈ క్రమంలో వెలువడినదే.
వాణిజ్యం, దేశ రక్షణ మొదలుకొని అనేక రంగాల్లో ఏఐ వినియోగానికి ఉన్న అవకాశాలను గుర్తించేందుకు, ఏఐ విస్తృత వినియోగం చూపే ప్రభావాలను అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఏఐపై జాతీయ వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సంవత్సర బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యధిక దేశాలకు భారత్ ఏఐ కేంద్రంగా తయారుకావడం జాతీయ వ్యూహంలో భాగంగా ఉంటుంది. అందరి అవసరాలకు కృత్రిమ మేధను ఉపయోగించాలనే ప్రస్తావన నీతీ ఆయోగ్ నివేదికలో ఉంది.
దేశంలో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, స్మార్ట్ సిటీలు-మౌలిక సదుపాయాలు, పట్టణ రవాణా అంశాల్లో కృత్రిమ మేధ వినియోగంతో అత్యధిక ప్రయోజనం కలుగుతుందని నివేదిక చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
సవాళ్లు ఏమిటంటే..
ఏఐను పెద్దయెత్తున వినియోగించడంలో ఉన్న సవాళ్ల గురించి కూడా నీతీ ఆయోగ్ నివేదిక చర్చించింది.
ఈ సవాళ్లలో మొదటిదేంటంటే- ఏఐ వినియోగం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రెండో సవాలు ఏంటంటే భారత్‌కు వనరుల కొరత తీవ్రంగా ఉంది. ఏఐపై పరిశోధనలు చేసి, ఆ టెక్నాలజీని ఉపయోగించేంత పరిజ్ఞానముంగలవారి కొరత భారత్‌లో చాలా ఎక్కువగా ఉంది. ఏఐ వినియోగానికి వీలు కల్పించే విస్తృత డేటా నెట్‌వర్క్‌లు కూడా దేశంలో లేవు. ఏఐ టెక్నాలజీ, అందులో ఇమిడి ఉన్న గోప్యత, భద్రత అంశాల గురించి పెద్దగా అవగాహన లేదు.
డేటా సేకరణ, వినియోగం నియంత్రణ దేశంలో ప్రాథమిక దశలోనే ఉంది. ఏఐ లాంటి శక్తిమంతమైన టెక్నాలజీ దుర్వినియోగమయ్యేందుకు ఈ పరిస్థితి ఆస్కారం కల్పిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
సవాళ్లను అధిగమించాలి ఇలా..
దేశంలో ఏఐ వినియోగానికి ఉన్న అవరోధాలను తొలగించేందుకు, దీనిపై పరిశోధనలను పెంచేందుకు నీతీ ఆయోగ్ ఒక ప్రణాళికను ప్రతిపాదించింది. దీని ప్రకారం-
దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఏఐపై మౌలిక పరిశోధనలు చేపడతాయి. ఏఐలో లోతైన పరిజ్ఞానం ఉన్న ప్రత్యేక కేంద్రాలు ఏఐను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రైవేటు రంగంతో కలిసి పనిచేస్తాయి.
ఈ ప్రణాళిక అమలైతే వినూత్న ఆవిష్కరణలకు తోడ్పడేలా జాతీయస్థాయిలో ఏఐ మార్కెట్ కేంద్రం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
'భారత్ పోటీపడబోదు'
ఏఐ రంగంలో చైనాతో పోటీపడగల స్థితిలో భారత్ లేదని, భారత్ పోటీపడబోదని నీతీ ఆయోగ్ నివేదిక వ్యాఖ్యానించింది. అయితే తనకున్న అనుకూలతలను అవకాశాలుగా మలచుకొని, చైనా, పాశ్చాత్య దేశాల పరిధిలో లేని మార్కెట్లకు భారత్ కేంద్రం కాగలదని తెలిపింది.

ఫొటో సోర్స్, Alamy Stock Photo
ఉద్యోగాలపై ప్రభావం?
ఇప్పుడున్న ఉద్యోగాలపై ఏఐ ప్రతికూల ప్రభావం ఉంటుందా అనే అంశంపై నివేదికలో ఎలాంటి ప్రస్తావనా లేదు.
ఏఐకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఇప్పుడున్న వాదనలు చాలా వరకు ఊహాజనితమే, మరీ ముఖ్యంగా భారత్ విషయంలో.
ఇప్పుడున్న కొన్ని ఉద్యోగాలు ఏఐ వాడకం పెరిగితే ఉనికిలోనే లేకుండా పోయే ఆస్కారమైతే ఉంది. కొన్ని దేశాల్లో జరిగినట్లుగా, ఏఐతో కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశం కూడా మెండుగా ఉంది. ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటుందనేది అప్పుడే చెప్పలేం.
నీతీ ఆయోగ్ నివేదికలో ప్రతిపాదించిన వ్యూహాన్ని ప్రభుత్వ తుది వ్యూహంగా పరిగణించరాదు. దీనిని మార్పు దిశగా వేసిన నమ్మకమైన తొలి అడుగుగా చెప్పొచ్చు.
(ఆర్.శశాంక్ రెడ్డి 'కార్నెగీ ఇండియా' సంస్థలో రీసర్చ్ అనలిస్ట్)
ఇవి కూడా చదవండి:
- ఫుట్‌బాల్: మెస్సీని కలుసుకొనేందుకు రష్యాకు కేరళ యువకుడి సైకిల్ యాత్ర
- ఉత్తర కొరియా క్రీడా చరిత్ర: ఒకసారి బాంబులు.. మరోసారి రాయబారాలు
- మీ జాబ్‌ను రోబో మింగేస్తుందా?
- #గమ్యం: బ్యాంకింగ్ రంగ ఉద్యోగాలకు కంప్లీట్ గైడ్
- మీరు ఎక్కే విమానం ఎంత వరకు సురక్షితం?
- చైనా బ్యాంకులు స్వదేశంలోకంటే విదేశాల్లోనే ఎక్కువ అప్పులు ఇస్తున్నాయి. ఎందుకు?
- #mPassport Seva: దేశంలో ఎక్కడి నుంచైనా పాస్‌పోర్ట్ అందించే సరికొత్త యాప్ విశేషాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









