కశ్మీర్: హిందూ ముస్లింలను ఒక చోటికి చేరుస్తున్న కళా ప్రదర్శన

ఫొటో సోర్స్, CHUSHOOL MAHALDAR
- రచయిత, సమీర్ యాసిర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత పాలనలోని కశ్మీర్ నుంచి దాదాపు 28 ఏళ్ల క్రితం వేర్వేరు ప్రాంతాలకు పారిపోయిన కశ్మీరీ హిందూ కళాకారులను మళ్లీ తమ ముస్లిం సహచరులతో కలిపింది ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్.
ఇరు సముదాయాల వారికీ ఇదొక గొప్ప భావోద్వేగాల కలయికగా నిలిచింది.
అవ్‌తార్ క్రిష్ణ రైనా ఒక కశ్మీరీ హిందూ. లేదా కశ్మీరీ పండిట్. 1990లో ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఎప్పుడూ తన స్వస్థలానికి రాలేదు.
తమ సముదాయంలోని తోటి కళాకారులు, శిల్పులతో కలిసి ఈ ప్రత్యేకమైన కళా ప్రదర్శన కోసం వచ్చారు. అలా ఆయన మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి తన ఇంటికి వచ్చారు. అక్కడే ఆయన తన ఒకనాటి సహచర ముస్లిం కళాకారులను కలుసుకున్నారు.
ఈ ప్రాంతంలో భారత పాలనను వ్యతిరేకిస్తూ హింసాత్మక తిరుగుబాటు ప్రారంభించిన ముస్లిం మిలిటెంట్ల భయంతో 1990 దశకంలో ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిన దాదాపు 2 లక్షల మంది కశ్మీరీ పండిట్లలో రైనా ఒకరు.
"ఒక రోజు ఇంటికి వచ్చినపుడు వేర్పాటువాద మిలిటెంట్లు ఇంటి బయట అంటించిన ఒక పోస్టర్ చూశాను. రాత్రుళ్లలో మమ్మల్ని చూసి మొరుగుతున్న నీ కుక్కకు విషం పెట్టి చంపమని వారు అందులో రాశారు" అని ఆయన చెప్పారు.
చాలామంది హిందువులు పారిపోయిన ఆ "భయంకరమైన నెల"లో తమ వాళ్లందరినీ చంపేస్తారేమోనని ఆయన భావించారు.
"నాతోపాటూ ఏదీ తీసుకెళ్లలేదు, కట్టుబట్టలతో వెళ్లిపోయాను" అని రైనా చెప్పారు. ఇప్పుడు ఆయన మధ్య ప్రదేశ్‌లో ఒక పెయింటర్‌గా పనిచేస్తున్నారు. "నేనెప్పటికీ తిరిగి రాలేకపోయేవాణ్ని, అలా రావాలనే ఆసక్తి కూడా నాలో లేకుండా పోయింది" అన్నారు.
రైనా ఈ కళా ప్రదర్శనకు వచ్చినపుడు, మహమ్మద్ అష్రఫ్ అనే ఒక పాత స్నేహితుడు ఆయన్ను పలకరించారు.
ఈ మాజీ ఉన్నతాధికారి తనతో పాటూ ఒక పెయింటింగ్ వెంట తెచ్చారు. 2014 వరదలతో కశ్మీర్ అతలాకుతలం అయినప్పుడు అష్రఫ్ తన ఇంటి నుంచి ఆ ఒక్క పెయింటింగ్‌ను మాత్రమే కాపాడుకోగలిగానని ఆయన చెప్పారు.
"1985లో ఈ బొమ్మ నువ్వే వేశావ్, గుర్తుందా? ఈ పెయింటింగ్ మాత్రమే తీసుకుని నేను ఇంటి నుంచి బయటపడ్డా" అని రైనాతో అష్రఫ్ అన్నారు.
చెక్కిళ్లపై నుంచి కన్నీళ్లు కారుతుండగా రైనా ఆ పెయింటింగ్‌ను తన చేతుల్లోకి తీసుకున్నారు.

ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసిన నిర్వాహకులు సరిగ్గా ఇలాంటి అనుబంధాల పునరుద్ధరణనే ఆశించారు.
"కళ అనేది క్లిష్టమైన అంశాల గురించి సంభాషించే భాష" అంటారు కశ్మీరీ ముస్లిం కళల ప్రచారకర్త ముజ్తాబా రిజ్వీ. ఆయన తన సమకాలీన కళాకారుడు వీర్ మున్షీతో కలిసి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
"చాలా అడ్డుగోడలు, దురభిప్రాయాలు తొలగిపోయాయి. సామాజిక సంబంధాల మెరుగుదలకు కళ ఓ మాధ్యమంలా పని చేయగలుగుతుంది."
రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌లో ఒకప్పుడు సిల్క్ ఫ్యాక్టరీగా పేరు పొందిన వందేళ్ల నాటి పాత భవనం శిథిలాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన ఆదివారం (జూన్ 24) ముగిసింది.

"సమాజాల మధ్య వంతెనలు నిర్మించే శక్తి కళకు మాత్రమే ఉంది" అంటారు కళా చరిత్రకారుడు రతన్ పరిమూ. ఆయనో కశ్మీరీ హిందూ.
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ అంతా కళాకృతులతో నిండిపోయింది. ఆ ప్రాంతంలో జరిగిన సంఘర్షణల్లో ప్రజలు అనుభవించిన బాధల లోతులను అవి కళ్లకు కడుతున్నాయి.
ఒక బొమ్మలో ఒంటిపై ఏ అచ్ఛాదనా లేని ఒక వ్యక్తి, తనను ముళ్ల కంచె గట్టిగా చుట్టేసినా, చిరునవ్వులు చిందిస్తుంటాడు. అతడు కశ్మీరీ హిందూ అని తను ధరించిన జంధ్యంతో మాత్రమే తెలుస్తుంది.
"హిందువైనా, ముస్లిమైనా కాశ్మీరులో సామాన్యుడి కథ ఇదే" అంటారు కళాకారుడు చుసుల్ మహాల్దర్. 'స్ట్రగులింగ్ స్మైల్' అనే పేరుతో ఆయన తన సెల్ఫ్ పోట్రెయిట్ చిత్రించారు.

మున్షీ ఏర్పాటు చేసిన ఒక కళాకృతి తిరుగుతున్న వస్తువులతో ఉంటుంది. "మనం సంఘర్షణలో ఉన్నప్పుడు మాత్రమే దాన్నుంచి బయటపడడం ఎంత కష్టంగా ఉంటుందో తెలుస్తుంది అన్న అంశాన్ని ఇది చూపిస్తుంది" అని మున్షీ చెప్పారు. ఆయన కూడా ఒకప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోయినవారే.
ప్రదర్శనా స్థలం మధ్యలో ఉన్న తిరగబడిన పడవ ఇటీవల కాలంలో కశ్మీర్ ఎలా తలకిందులైందో చూపిస్తుందని కళాకారులు చెబుతారు.
"పడవ దిగువ వైపు కూడా చూడడం చాలా ముఖ్యం". అదెప్పుడూ నీళ్లలోనే ఉంటుంది అంటారు మున్షీ

ప్రదర్శన ప్రవేశ మార్గంలో కశ్మీరీ ముస్లిం కళాకారుడు మమూన్ అహ్మద్ వేసిన 30 అడుగుల (9.1 మీటర్ల) పొడవున్న ఒక పెయింటింగ్ ఉంటుంది. సిరాతో వేసిన ఈ చిత్రంలో మనకు ఎముకలు, చెట్లు కనిపిస్తాయి. అది చావుబతుకులను సూచిస్తుంది.
"జాగ్రత్తగా నడువు" అనే అర్థం వచ్చే ఉర్దూ పదం 'రువేదా' స్ఫూర్తితో ఈ పెయింటింగ్ వేశారు.
"ఇది కశ్మీర్‌లోని సంఘర్షణ కథను చెబుతుంది, దీని పక్క నుంచి నడుస్తుంటే, అది హిందూ, ముస్లింల మధ్య ఖాళీని కలిపే వంతెనలా అనిపిస్తుంది" అని ఆయన అంటారు.
బీజేపీ, పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి, ప్రస్తుతం ఇక్కడ రాజకీయ అస్థిరత ఉన్నప్పటికీ, దీన్ని చూడాలనే ఆసక్తితో వందలాది మంది ఈ ప్రదర్శనను చూడడానికి వస్తున్నారు.
"ఇది గుండెను పిండేస్తోంది. కానీ ఒక భిన్నమైన అనుభవం" అని స్థానిక కాలేజీలో ఆర్ట్ స్టూడెంట్ సాయిబా ఖాన్ అన్నారు.
తన జీవితంలో ఎప్పుడూ కాశ్మీరీ పండిట్ సముదాయానికి చెందిన కళాకారుడిని కాదు కదా, తానసలు కశ్మీరీ పండిట్‌నే చూడలేదని ఆమె అన్నారు.
"వారి శిల్పాలు, పెయింటింగ్స్, కళాకృతులు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రదర్శన పరిపూర్ణం అయ్యింది."

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








