తెలంగాణ: పెళ్లి కూతుర్ని బలవంతంగా ఎత్తుకెళ్లిన కుటుంబ సభ్యులు.. పోలీసులేమంటున్నారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ
నిజామాబాద్ జిల్లాలో అమ్మాయి (21), అబ్బాయి (22) ప్రేమించుకున్నారు. పెళ్లి చేయమని ఇంట్లో అడిగారు. యువతి ఇంట్లో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వీరు ఆర్య సమాజ్‌లో పెళ్లికి సిద్ధమయ్యారు. ఇంతలో యువతి తరపు బంధువులు పెళ్లి వేదిక దగ్గరకు గుంపుగా వచ్చి దాడిచేసి అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ కథనంతో పాటు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లిన దృశ్యాలు కూడా మీడియాలో ప్రసారమయ్యాయి.
ఈ అంశం మీద బీబీసి పోలీసులను సంప్రదించింది. అంత బాహాటంగా దాడి చేసి అమ్మాయిని ఎత్తుకెళ్లిన ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.
దీనికి సమాధానంగా.. కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
వరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని నిజామాబాద్ ఎసిపి సుదర్శన్ తెలిపారు.
ఆ యువతి వాంగ్మూలం తీసుకుని ఎక్కడకు వెళ్తానంటే అక్కడకు పంపుతామని చెప్పారు.
అసలు వీరెవరు?
అబ్బాయి ప్రణదీప్. ఇతనిది రేంజల్ మండలం వీరన్నగుట్ట. అమ్మాయిది మాక్లూర్ మండలం కొత్తపల్లి.
అమ్మాయి చాకలి కులానికి చెందినవారు కాగా.. అబ్బాయి ముదిరాజ్ కులనికి చెందిన వారు.
అమ్మాయి తండ్రి గల్ఫ్ దేశాల్లో పనివెతుక్కుంటూ వెళ్లారు. తల్లి బీడీ కార్మికురాలు. అబ్బాయి తండ్రి చనిపోయారు. తల్లి వ్యవసాయం చేస్తుంటారు.

మూడేళ్ల నుంచి ప్రేమ
‘‘మేం మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. అమ్మాయికి 21 ఏళ్లు. నాకు 22. ఇద్దరం నిజామాబాద్ లోని ఎస్సెస్సార్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాం. నేను ఉద్యోగం వచ్చాక అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లి చేయమని అడుగుదాం అనుకున్నా. ఉద్యోగం లేకపోతే పిల్లను ఇవ్వరు కదా. కానీ ఈ లోపే వాళ్లింట్లో విషయం తెలిసి అమ్మాయి అన్నలు (కజిన్స్) నాకు కాల్ చేసి హెచ్చరించారు.’’ అని ప్రణదీప్ బీబీసీతో చెప్పారు.
ఆ వేడిలో మాట్లాడకూడదని కొన్ని రోజులు ఆగిన ప్రణదీప్.. తర్వాత మళ్లీ వారికి కాల్ చేశానని.. అమ్మాయిని తనకిచ్చి పెళ్ళి చేయాలని బాగా చూసుకుంటానని చెప్పానని వివరించారు. వారు వినలేదని . ఇది నెల కింద జరిగిందని తెలిపారు.
‘అమ్మాయికి చెప్పకుండా ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. నిశ్చితార్థం కూడా నిర్ణయించారు. దీంతో అమ్మాయి నాకు ఫోన్ చేసింది. పెళ్లి చేసుకోమంది. దీంతో ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాం. పెళ్లి గురించి ఎలా తెలిసిందో అమ్మాయి తరపు వాళ్లకు తెలిసింది. వాళ్లు వచ్చి అమ్మాయిని గట్టిగా కొట్టి తీసుకెళ్లిపోయారు. నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను.’ అని ప్రణదీప్ తెలిపారు.
అమ్మాయి ఇంటికి వెళ్లి మాట్లాడి చెబుతామని పోలీసులు అన్నారని ప్రణదీప్ వివరించారు.
మరి పోలీసులు ఏమన్నారు
అబ్బాయి ఫిర్యాదు మేరకు అమ్మాయి బంధువులపై కిడ్నాప్ కేసు పెట్టామని నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ బీబీసీకి తెలిపారు.
అమ్మాయిని తీసుకువచ్చి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 161 ప్రకారం వాంగ్మూలం తీసుకుని కోర్టులో ప్రవేశపెడతాం.
ఆ తరువాత అమ్మాయి ఎక్కడకు వెళతానంటే, అక్కడ వదిలిపెడతామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









