‘హిజాబ్ వేసుకుని చెస్ ఆడమంటే నేనాడలేను’

ఫొటో సోర్స్, facebook/SoumyaSwaminatham
- రచయిత, ఏ. నంద కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇరాన్‌లో జరగనున్న ఆసియన్ చెస్ ఛాంపియన్‌షిప్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు భారత చెస్ క్రీడాకారిణి, మహిళా గ్రాండ్ మాస్టర్ సౌమ్య స్వామినాథన్ ప్రకటించారు.
ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారిణులు తలకు తప్పనిసరిగా స్కార్ఫ్ (హిజాబ్) ధరించాలనే నిబంధన ఉండడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిబంధన తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉందని 29 ఏళ్ల సౌమ్య అన్నారు.
''ప్రస్తుత పరిస్థితుల్లో నా వ్యక్తిగత హక్కులను కాపాడుకోవాలంటే ఇరాన్ వెళ్లకపోవడమే ఏకైక మార్గం'' అంటూ ఆమె తన ఫేస్‌బుక్ వాల్‌పై పోస్ట్ చేశారు.
కాగా ఆసియా చెస్ ఛాంపియన్‌షిప్‌ను జులై 26 నుంచి ఇరాన్‌లోని హమాదాన్‌లో నిర్వహించనున్నారు.
'ఏ మాత్రం రాజీపడలేను'
నిర్వాహక దేశం తీరుపై సౌమ్య ఫేస్‌బుక్ వేదికగా తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇండియాలో 5వ ర్యాంకు క్రీడాకారిణి అయిన ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో .. ''ఇరాన్‌లో నిర్వహించనున్న ఆసియా చెస్ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లలేకపోతున్నందుకు క్షమించండి. బలవంతంగా నేను బురఖా లేదా హెడ్‌స్కార్ఫ్ ధరించలేను. అక్కడ చెస్ ఆడాలంటే హెడ్ స్కార్ఫ్ ధరించడం తప్పనిసరి అని నిబంధన ఉంది. అది నా ప్రాథమిక మానవ హక్కులకు భంగం కలిగిస్తోంది. మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోంది.
అందుకే నా హక్కులను కాపాడుకునేందుకు నేను ఇరాన్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. ఇలాంటి అధికారిక ఛాంపియన్‌షిప్‌లలో ఆటగాళ్ల హక్కులు, సంక్షేమానికి ఏమాత్రం ప్రాధాన్యాన్నివ్వకపోవడం చాలా అసంతృప్తిని కలిగిస్తోంది.
దేశం తరఫున ఆడటాన్ని నేనెప్పుడూ గర్వంగానే భావిస్తాను. ఇప్పుడు కూడా జాతీయ జట్టుకు ఎంపికైనా కూడా ఇంత ముఖ్యమైన పోటీల్లో పాల్గొనలేకపోతున్నందుకు బాధపడుతున్నాను.
జీవితంలో ఆటకే అత్యంత ప్రాధాన్యమిస్తూ, ఆట కోసం సర్దుకుపోవడానికి సిద్ధపడతాం.. కానీ, ఈ విషయంలో రాజీపడలేను'' పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, facebook/HeenaSidhu
రెండేళ్ల కిందట హీనా సిద్ధూదీ ఇదే నిర్ణయం
ఇరాన్‌లో జరిగే టోర్నీల్లో ఇలా హెడ్ స్కార్ఫ్ నిబంధన కారణంగా పోటీల్లో పాల్గొనకపోవడమన్నది ఇదే తొలిసారి కాదు.
2016లో భారత షూటింగ్ క్రీడాకారిణి హీనా సిద్ధూ కూడా ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ పోటీల నుంచి తప్పుకొన్నారు.
ఆసియా ఎయిర్‌గన్ ఛాంపియన్‌షిప్-2016కి భారత్ నుంచి ఆమె ఎంపికైనప్పటికీ క్రీడాకారిణులు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలన్న నిబంధనతో విభేదిస్తూ ఇరాన్ వెళ్లలేదు.
గత ఏడాది టెహ్రాన్‌లో నిర్వహించిన 'మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్-2017'లో జార్జియాకు చెందిన ఉమన్ గ్రాండ్‌మాస్టర్ నజీ పైకిడ్జ్ కూడా ఇదే కారణాలతో పోటీలో పాల్గొనేందుకు నిరాకరించారు.
ఆ పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా హిజాబ్ కానీ, హెడ్ స్కార్ఫ్ కానీ ధరించాలని నిబంధన పెట్టడంతో ఆమె పోటీల నుంచి తప్పుకొన్నారు.
ఆటగాళ్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది: కోనేరు హంపి
ఇస్లామిక్ దేశాల్లో జరిగే పోటీల్లో హిజాబ్, హెడ్‌స్కార్ఫ్‌తో ఆడడం సాధారణమే. అలాంటి సందర్భాల్లో నేను స్కార్ఫ్‌తో ఆడాను. ఆ నిబంధన ప్రకారం ఆడాలా వద్దా అన్నది క్రీడాకారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి అభిప్రాయపడ్డారు.
మరోవైపు 2016లో ఇదే కారణంతో ఇరాన్‌లో పోటీల నుంచి వైదొలగిన షూటర్ హీనాసిద్ధూ సౌమ్య స్వామినాథన్‌కు మద్దతు పలికారు. ఒక నిజమైన క్రీడాకారిణిగా ఉన్నందుకు ఆమెను చూసి గర్విస్తున్నాన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








