#BeingMuslim: ‘ఎక్కడ ఏం జరిగినా, అది ముస్లింలే చేశారని అనుకునేవాణ్ని’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాహ్నవీ మూలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
శుభమ్ అనే కుర్రాడికి ఈమధ్య మసీదుకు రమ్మని ఆహ్వానం అందింది. దాంతో అతడిలో ఉత్సాహంతో పాటు భయం కూడా మొదలైంది.
ముంబైలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే కుర్లా ప్రాంతంలో శుభమ్ ఉంటాడు. అయినా అంతకు ముందెప్పుడూ అతడు మసీదులోకి వెళ్లలేదు. ఇస్లాం గురించి కూడా అతడికి పెద్దగా తెలీదు.
అందుకే మసీదుకి వెళ్లేముందు అతడిలో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. అక్కడి వాళ్లను ఏ ప్రశ్నలు అడగకూడదో, ఏం మాట్లాడితే వారికి కోపమొస్తుందోనని తేల్చుకోలేకపోయాడు.
‘ముస్లింలు శుక్రవారాలు మాత్రమే స్నానం చేస్తారని అనుకునేవాణ్ణి. లవ్ జిహాద్ (అమ్మాయిలను తమ మతంలోకి మార్చడం కోసమే ముస్లింలు పథకం ప్రకారం ప్రేమ-పెళ్లి చేసుకుంటారని చేసే ఆరోపణలనే 'లవ్ జిహాద్' అంటున్నారు)కు పాల్పడతారనీ, టెర్రరిస్టులుగా శిక్షణ తీసుకుంటారనీ, మసీదులోకి వెళ్లేముందు తమ వేలిని రక్తంలో ముంచుతారనీ.. ఇలా వాళ్ల గురించి రకరకాల అపోహలుండేవి’ అని శుభమ్ చెప్పారు.
అతనొక్కడికే కాదు, ఇతర మతాలకు చెందిన చాలామందికి తమ గురించి ఇలాంటి అపోహలే ఉన్నాయని ముంబైలోని ‘జమాత్-ఎ-ఇస్లామీ హింద్’ అనే సంఘానికి అనిపించింది. అందుకే వాళ్లు ‘మసీద్ పరిచయ్’ పేరుతో ఓ కొత్త కార్యక్రమానికి తెరతీశారు.
అందులో భాగంగా ఇతర మతస్థులను, ముఖ్యంగా హిందువులను మసీదులోకి ఆహ్వానిస్తూ, ఇస్లాం గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి.
‘ఇస్లాం గురించి ఇతర మతస్థుల్లో ఉన్న అపోహల్ని దూరం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ‘ఇస్లాం ఫర్ ఆల్’ అనే పేరుతో దీన్ని నిర్వహిస్తున్నాం’ అని కుర్లాలోని ‘జమాత్-ఎ-ఇస్లామీ హింద్’ సంఘం అధ్యక్షుడు హసీబ్ భట్కర్ తెలిపారు.

కుర్లాలో ముస్లింల సంఖ్య ఎక్కువ. అందుకే మొదట అక్కడ ఉండటానికి కాస్త ఇబ్బంది పడినట్లు జనార్థన్ జాంగ్లే అనే టీచర్ చెప్పారు.
‘1992 తరవాత టీచర్లందరికీ ప్రభుత్వం ఇక్కడే ఇళ్లను కేటాయించింది. దాంతో మరో మార్గం లేక కుర్లాకు వచ్చాం. ఇక్కడ ముస్లింల సంఖ్య ఎక్కువ కావడంతో, తాము ఉండగలమో, లేదోనన్న అనుమానంతో చాలామంది ఇళ్లను అద్దెకు ఇచ్చి వెళ్లిపోయారు. నాతో పాటు ఇంకొందరం ఇక్కడే ఉండిపోయాం.
చాలామందిలా నాక్కూడా వాళ్లపైన రకరకాల అనుమానాలుండేవి. మసీదులోకి మహిళలను ఎందుకు రానివ్వరనే సందేహం కలిగేది. నా స్నేహితుడు చనిపోయినప్పుడు ఒకే ఒక్కసారి నేను మసీదులోకి వెళ్లా.
కానీ ఈ మధ్య ‘మసీద్ పరిచయ్’ కార్యక్రమం వల్ల నా ఆలోచనలో చాలా తేడా వచ్చింది. మసీదులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎందుకు నిర్వహిస్తారనే విషయాలపైన అవగాహన కలిగింది.

వాళ్లు చేసే ప్రార్థనలకు అర్థమేంటో వివరించారు. రెండు మతాలకూ మధ్య దూరాన్ని తగ్గించడానికి ఇదో మంచి ప్రయత్నం’ అని జనర్థాన్ తన అనుభవాలను వివరించారు.
‘నమాజ్ చేసేప్పుడు అందరినీ ఒకేలా చూస్తారు. ముందు వచ్చిన వాళ్లు ముందు వరసలో, ఆలస్యంగా వచ్చిన వాళ్లు వెనక వరసలో కూర్చుంటారు తప్ప అక్కడ పేదా, గొప్పా తేడాలు కనిపించలేదు’ అని శుభమ్ అన్నారు.
‘ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా చాలా ద్వేషపూరిత పోస్టులు వైరల్ అవుతున్నాయి. వాటిని చాలామంది విశ్వసిస్తున్నారు. వాళ్లందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఆలోచనల్లో ఎంతో కొంత మార్పు వస్తుంది. వాళ్లలో పేరుకుపోయిన ద్వేషం కొంతైనా తగ్గుతుంది’ అన్నది శుభమ్ మాట.
ఇవి కూడా చదవండి
- ఆఫ్రికన్ చారిత్రక గాథ: వాంఛ తీర్చుకుని చంపేస్తుంది: కాదు, జాతి పోరాట యోధురాలు
- ‘ప్రచారానికే మొదటి ప్రాధాన్యం’
- 'లోన్ కోసం బ్యాంకుకెళ్తే.. ఆడపిల్లలు మీరేం బిజినెస్ చేస్తారు అన్నారు'
- స్పైడర్ మ్యాన్ : గాల్లో వేలాడే పిల్లాడ్ని కాపాడిన లైవ్ వీడియో
- ఐర్లాండ్ అబార్షన్ రెఫరెండం: ఆమె ప్రాణాలు కోల్పోయింది.. ఈమె చరిత్ర తిరగరాసింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









