తెలంగాణ: ఉడత తోక అంత పని చేసిందా?

ఫొటో సోర్స్, chevella rajesh
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ తెలుగు ప్రతినిధి
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పద్మారం గ్రామానికి చెందిన రైతు ఎ.వేంకటేశ్వర రెడ్డిని 'ఉడత తోక' మూడేళ్ల నుంచి అష్టకష్టాలు పెడుతోంది.
2015లో తనకున్న ఐదు ఎకరాల పొలంలో వేంకటేశ్వర రెడ్డి చెరకు పంట సాగు చేశారు. అయితే, ఒక రోజు ఆయన పొలంలోనే ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ తెగిపడటంతో పంటంతా కాలిపోయింది. దాంతో పాటు పొలంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కాలిపోయాయి.
విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, విద్యుత్ సిబ్బంది పంటపొలాన్ని సందర్శించి విద్యుత్ లైన్ తెగిపడటం వల్లే పంట నష్టం సంభవించిందని నిర్ధారించారు.
అయితే, తనకు నష్టపరిహారం ఇవ్వాలని ఆ రైతు విద్యుత్ అధికారులకు మొరపెట్టుకంటే వాళ్లు ఉడత తోక వల్ల లైన్ తెగిపడింది.. పంట కాలిపోయిందని సమాధానం ఇచ్చారు.
'11 కేవీ లైన్ విద్యుత్ పోల్‌ను ఉడత ఎక్కింది. దాని తోక 11 కేవీ లైన్ వైరుకు తగలడంతో 11 కేవీ లైన్ వైరు కాలి పడిపోయింది. దీంతో కిందనున్న చెరుకు పంట కాలిపోయింది'' అని విద్యుత్ అధికారులు లిఖితపూర్వంగా సమాధానం ఇవ్వడంతో రైతు అవాక్కయ్యారు.

ఫొటో సోర్స్, chevella rajesh
'ఉడత తోక వల్లే అంటే ఎలా నమ్మాలి'
మూడేళ్ల నుంచి జరిగిన నష్టాన్ని అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. వారి నుంచి ఇలాంటి సమాధానమే వస్తోందని రైతు వేంకటేశ్వర రెడ్డి బీబీసీకి ఫోన్‌లో తెలిపారు.
''ఆరు ఎకరాల్లో చెరుకు పంట వేశాను. అందులో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా ఉన్నాయి. 11 కేవీ లైను తెగిపోయి పంట కాలిపోయింది. దీనిపై నష్టపరిహారం కోసం విద్యుత్ అధికారులను చాలా సార్లు కలిశాను. ఉడత తోక వల్లే నీ పంటకాలిపోయింది. దానితో మాకు సంబంధమే లేదు అంటున్నారు'' అని ఆయన చెప్పారు.
ఉడత తోక వల్ల హైటెన్షన్ వైరు తెగిపోయిందంటే ఎలా నమ్మాలని రైతు ప్రశ్నిస్తున్నారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే ఆరు లక్షల వరకు నష్టపోయాను. పంట చేతికందక అప్పులు తీర్చలేదు. దీంతో అప్పు ఇచ్చిన వాళ్లు నా భూమిని లాక్కున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి అని వేంకటేశ్వర రెడ్డి కోరుతున్నారు.

ఫొటో సోర్స్, chevella rajesh
'క్షేత్రస్థాయిలో పరిశీలించాకే నివేదిక ఇచ్చాం'
ఉడత తోక వల్లే షార్ట్ సర్క్యూట్ జరిగి పంట కాలిపోయిందని విద్యుత్ శాఖ అడిషనల్ డివిజనల్ ఇంజినీర్ నవీన్ కుమార్ బీబీసీకి తెలిపారు.
''పంట కాలిపోయిన ప్రదేశాన్ని స్వయంగా వెళ్లి పరిశీలించా.11 కేబీ లైన్లకు సంబంధించి కండక్టర్‌కు సపోర్టుగా ఇన్సులెటర్ పెడుతాం. దానిపై ఉడత ఎక్కింది. దాని తోక.. వైరుకు తగలగడంతో షార్ట్ సర్ట్య్కూట్ జరిగింది. అక్కడ చనిపోయిన ఉడత కూడా కనిపించింది. వాటి ఆధారంగానే నివేదిక ఇచ్చాను'' అని ఆయన వెల్లడించారు.
ఒక్కోసారి చిన్న ఆకు తాకినా విద్యుత్ వైర్లు కలిసిపోయి లైన్ ట్రిప్ అవడం జరుగుతుందని నవీన్ కుమార్ తెలిపారు.

ఫొటో సోర్స్, chevella rajesh
'ఉడత తోకతో వైరు తెగడం అసాధ్యం'
ఉడత తోక వల్ల 11 కేవీ విద్యుత్ లైన్ తెగడం అసాధ్యమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని తెలంగాణ విద్యుత్ శాఖలో పనిచేసిన ఉన్నతాధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.
''విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన లైన్ వల్లే ఆ రైతు పంటకు నష్టం వాటిల్లింది. అందువల్ల వారే బాధ్యత వహించాలి. పంట నష్టం చెల్లింపుపై విద్యుత్ శాఖలో ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు లేవు. కానీ, ఇలాంటి అరుదైన సందర్భంలోనైనా విద్యుత్ శాఖ బాధ్యత వహించాలి.'' అని అన్నారు.
''ఎలాంటి లాభాలు ఆశించకుండానే చాలా మంది రైతులు తమ పంటపొలాల నుంచి హై టెన్షన్ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తున్నారు. రూ.40 వేల కోట్ల బడ్జెట్ ఉన్న సంస్థ ఇలాంటి అరుదైన సందర్భంలో బాధ్యత తీసుకోకపోతే ఎలా?'' అని ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








