కామన్‌వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ హీనా సిద్ధూ ప్రేమకథ ఏ బాలీవుడ్ సినిమా కథకూ తీసిపోదు!

ఫొటో సోర్స్, HeenaShootingOfficial/Facebook
- రచయిత, సూర్యాంశీ పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో హీనా సిద్ధూ బంగారు పతకం సాధించింది.
25 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో పతకం సాధించిన మరుక్షణం హీనా వెనక్కి తిరిగి తన కోచ్ కూడా అయిన భర్తను కౌగిలించుకుంది. ఆ తర్వాత ఆనందంతో రౌనక్ ఆమెను ఒడిలోకి ఎత్తుకున్నాడు.
ఈ క్షణాన్ని అక్కడున్న ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో చాలా అందంగా బంధించారు. వీరిద్దరినీ కలిపిన ప్రేమ కథేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి అప్పుడే అందరి మనసుల్లో మొదలైంది.
ఆ సమయంలో తీసిన ఫొటో నెట్టింట్లో వైరల్ అయ్యింది.
అంతే... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రౌనక్ పండిత్, హీనా సిద్ధూలకు ఫోన్ చేశాను. రౌనక్ హహహా అంటూ గట్టిగా నవ్వుతూ ఇలా అన్నాడు - "మా ఇద్దరి ప్రేమకథ బాలీవుడ్ మసాలా ప్రేమకథలకు ఏ మాత్రం తీసిపోదు."

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE
ఒకరంటే ఒకరికి పట్టరాని ద్వేషమట!
2006లో రౌనక్ పండిత్ షూటింగ్ కెరీర్ శిఖరాయమానంగా సాగిపోతున్న సమయం. ఆ సంవత్సరం జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సమరేశ్ జంగ్‍తో కలిసి ఆయన 25 మీ. స్టాండర్డ్ పిస్టల్ విభాగం టీం ఈవెంట్‌లో బంగారు పతకం సాధించాడు.
అదే సంవత్సరం జరిగిన ఆసియన్ క్రీడల్లో 25 మీ. స్టాండర్డ్ పిస్టల్ టీం ఈవెంట్‌లో రజత పతకం గెల్చుకున్నాడు.
మహారాష్ట్రకు చెందిన రౌనక్ పండిత్ పుణెలోని బాలేవాడీ షూటింగ్ రేంజ్‌లో ట్రెయినింగ్ పొందేవాడు.
షూటింగ్‌లో పతకం గెల్చుకొని తిరిగొచ్చిన 21 ఏళ్ల రౌనక్ జోరు మీదుండగా.. సరిగ్గా అప్పుడే భవిష్యత్తు స్వప్నాలను మూటగట్టుకున్న ఓ పదిహేడేళ్ల అమ్మాయి బాలేవాడీ షూటింగ్ రేంజ్‌లో అడుగు పెడుతుంది. ఆ అమ్మాయే హీనా సిద్ధూ.
షూటింగ్‌లో కచ్చితంగా గురి చూడడం, కఠినంగా ఉండడం, తన కలలను సాకారం చేసుకోవాలనే పట్టుదల... ఇవన్నీ హీనాలో దండిగా ఉన్నట్టుగా రౌనక్ అప్పుడే గుర్తించాడు.
ఇద్దరిదీ మొండి పట్టుదలే. నకరాలూ తక్కువేం కాదు. కాబట్టి ఇద్దరికి పొసగడం ఎలా సాధ్యం మరి?
తామిద్దరం ఒకరినొకరు బాగా ద్వేషించుకున్నామని రౌనక్ చెప్పారు. రౌనక్‌ను చూడాలంటేనే హీనాకు నచ్చకపోయేది. రౌనక్ కూడా ఆమెకు పొడ కూడా గిట్టనట్టుగానే ఉండేవాడు.
"దాదాపు సంవత్సరంన్నర కాలం మేమిద్దరం ఎప్పుడూ మాట్లాడుకోలేదు" అని రౌనక్ చెప్పాడు.

ఫొటో సోర్స్, Reuters
విదేశీ కోచ్ ఫీజుతో కొలిక్కి వచ్చిన వ్యవహారం!
తన సన్నాహాలను మరింత మెరుగుపర్చుకోవడం కోసం ఉక్రేనియన్ కోచ్ అన్నాటోలీని తమ కోచ్‌గా పెట్టుకుందామని రౌనక్ భావించాడు.
కానీ విదేశీ కోచ్ ఖర్చు ఒక్కడే భరించడం అంటే మామూలు విషయం కాదు. దాంతో 'హీనాతో దోస్తీ చేస్తే పోలా' అని అనుకున్నాడు. తనొప్పుకుంటే కోచ్ ఫీజు ఇద్దరం కలిసి కట్టెయ్యొచ్చు అన్నది అతడి ఆలోచన.
అలా 2009-10లో హీనాతో దోస్తీ కుదిరినట్టు రౌనక్ బీబీసీతో చెప్పాడు. ఆ విధంగా తామిద్దరి మధ్య సయోధ్య కుదిరించిన క్రెడిట్ ఉక్రేనియన్ కోచ్‌కే దక్కుతుందని ఆయనన్నాడు.

ఫొటో సోర్స్, INSTAGRAM
మోకాళ్లపై కూర్చొని లవ్ చేస్తున్నానని చెప్పేశా..!
ఇద్దరూ ఒకే కోచ్ వద్ద శిక్షణ పొందతున్న సమయంలో ఒకరి గురించి మరొకరికి అర్థం కాసాగింది. హీనా సిద్ధూ, రౌనక్ పండిత్‌లిద్దరికీ తామిద్దరం పరస్పర ప్రతిబింబాలమని అనిపించసాగింది.
ట్రెయినింగ్ తర్వాత ఇద్దరూ కలిసి గడిపేవారు. అయితే ఇద్దరిలో ఎవ్వరూ తమ మనసులో ఏముందో బయటకు చెప్పలేకపోయారు. అయితే తమ మనసులోని అలజడి మాత్రం ఇద్దరికీ అర్థమవుతోంది.
ఆ తర్వాత, ఓరోజు సాయంత్రం రౌనక్, హీనాలిద్దరూ దిల్లీలోని ఒక మాల్‌లో సినిమా చూడ్డానికి వెళ్లారు.
సినిమా చూశాక ఇద్దరూ ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. సరిగ్గా అప్పుడే రౌనక్ మాటల్లో "ఇంతకంటే మంచి అవకాశం మరొకటి లేదు అని నాకనిపించింది. వెనుకా ముందూ ఏమీ ఆలోచించకుండా మోకాళ్లపై కూర్చుండిపోయా. ఉంగరం చేతిలో పట్టుకొని మనసులో మాట చెప్పేశా."
హీనా ఈ ఆకస్మిక పరిణామానికి కాసేపు నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత చిన్నగా చిరునవ్వు నవ్వింది. ఆ తర్వాత రౌనక్‌కు ఓకే చెప్పేసింది.

ఫొటో సోర్స్, INSTAGRAM
2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా బ్రేకప్ అయ్యేదే కానీ...
2010 కామన్వెల్త్ క్రీడల్లో హీనా 10 మీ. ఎయిర్ పిస్టల్ టీం ఈవెంట్‌లో హీనా గోల్డ్ గెల్చుకుంది.
2011లో షూటర్లంతా 2012 లండన్ ఒలింపిక్స్ కోసం సిద్ధం కాసాగారు. రౌనక్ దగ్గర కోచింగ్ తీసుకోవడం మంచిదని హీనాకు అనిపించింది.
ఆ సమయంలో రౌనక్ తన కెరీర్ విషయంలో అసంతృప్తితో ఉన్నాడు. దాంతో హీనాకు మద్దతు ఇవ్వడమే మంచి నిర్ణయం అని అతడు భావించాడు.
ఆ విధంగా 2011లో రౌనక్ హీనాకు కోచ్ అయ్యాడు.
ఇద్దరి మధ్య రిలేషన్ మొదలైన కొద్దిరోజులకే ఒకరు కోచ్ అవతారం ఎత్తగా, మరొకరు విద్యార్థిగా మారిపోయారు.
ట్రెయినింగ్ సమయంలో ఇద్దరి దృష్టీ కేవలం ట్రెయినింగ్ పైనే ఉండేది. అయితే ట్రెయినింగ్ సందర్భంగా ఇద్దరి మధ్యా చాలా గొడవ జరిగేది.
క్రీడలకు సంబంధించిన మానసిక పరిస్థితులను అర్థం చేసుకోవడం కోసం ఒక సైకాలజిస్ట్ అవసరం అని రౌనక్ భావించాడు. అలా అతడు కెనడాకు చెందిన ఓ ప్రసిద్ధ సైకాలజిస్టును టీంలో భాగం చేశారు. అప్పుడిక 2012 ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి.
హీనా కృషి, రౌనక్ ట్రెయినింగ్ మంచి ఫలితాలు ఇవ్వసాగాయి. హీనా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యేదే కానీ తన ప్రత్యర్థికి మద్దతుగా వచ్చిన గుంపు చేసిన అల్లరితో ఆమె ఏకాగ్రత దెబ్బతింది. దాంతో ఆమె ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
ఈ ఘటన హీనాను బాగా కుంగదీసింది. దాదాపు రెండు నెలల పాటు ఆమె బాధపడుతూనే గడిపింది.
తమ రిలేషన్ ఇక్కడితో ముగిసిపోతుందని ఇద్దరికీ అప్పుడే అనిపించింది. తామిద్దరం బాగా గొడవ పడతుంటాం కాబట్టి ఈ రిలేషన్ ముందుకు సాగడం సాధ్యం కాదని హీనా భావించినట్టు రౌనక్ బీబీసీతో చెప్పారు.
అయితే రౌనక్ మాత్రం విశ్వాసం కోల్పోలేదు. తనకు కొంత సమయం ఇవ్వాలని ఆయన హీనాను కోరాడు.
ఆ సమయంలో కెనడాకు చెందిన సైకాలజిస్ట్ ఇద్దరికీ బాగా సహాయం చేశాడు. కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ల మధ్య రిలేషన్ మళ్లీ మెరుగుపడింది.

ఫొటో సోర్స్, INSTAGRAM
2013లో పెళ్లి
ఆ తర్వాతి నుంచి ఇద్దరూ అన్ని టోర్నమెంట్లలో ఒక టీంలాగా పటిష్టంగా కనిపించసాగారు. దాంతో 2013లో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
పెళ్లి తర్వాత 2014 తమకు చాలా గొప్పగా గడిచిందని హీనా బీబీసీతో చెప్పింది. ఆ సంవత్సరమే తాను షూటింగ్ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకున్నానని తెలిపింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్ హీనానే.
ఈ సంవత్సరం జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న తర్వాత హీనా బీబీసీతో మాట్లాడుతూ, ఈ విజయానికి క్రెడిట్ రౌనక్‌కే దక్కుతుందని చెప్పింది. ఆయనే తనను 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి 25 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లోకి రావడానికి సహాయపడ్డాడని ఆమె తెలిపింది.
కానీ.. నిజం చెప్పాలంటే ఈ విజయం వెనుకున్న అసలు హీరో 'విశ్వాసం'! హీనా, రౌనక్‌ల మధ్య ఒక విద్యార్థి, కోచ్‌గానే కాకుండా, భార్యాభర్తలుగా కూడా వికసించిన విశ్వాసమే వారిని విజయతీరాలకు చేర్చింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








