BBC గ్రౌండ్ రిపోర్ట్: యూపీ అత్యాచార కేసులో ఎన్నో మలుపులు!

ఉన్నావ్‌లోని బాధితురాలి ఇంటిముందు పోలీసు భద్రత

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/BBC

ఫొటో క్యాప్షన్, ఉన్నావ్‌లోని బాధితురాలి ఇంటిముందు పోలీసు భద్రత
    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ఉన్నావ్ నుంచి

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో తెరపైకి వచ్చిన అత్యాచార ఉదంతం అనేక మలుపులు తిరుగుతోంది. బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, అతడి అనుచరులు కలిసి తనపై అత్యాచారం చేశారని ఓ యువతి ఆరోపించడం, తరవాత ఆ యువతి తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోవడం తదితర పరిణామాలన్నీ రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి.

ఎమ్మెల్యేను కాపాడటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ బాధిత యువతి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ ఉదంతం సంచలనంగా మారింది.

మొదట బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్, అతని అనుచరులు కలిసి గత ఏడాది జూన్‌లో తనపై అత్యాచారం చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. దాంతో యువతి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కేసును వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారనీ, అతడి సోదరుడూ, అనుచరులు కలిసి తన తండ్రిని తీవ్రంగా కొట్టారనీ, తన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారనీ బాధితురాలు ఆరోపించారు.

మరోపక్క ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై పోలీసులు బాధితురాలి తండ్రిని అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీలో ఉండగానే ఆయన చనిపోయారు.

ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే పోలీసులు అతడిని తీవ్రంగా కొట్టారని, శరీరంపై అనేక గాయాలున్నాయని, ఆ దెబ్బలు తాళలేకే అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడి మరణంపై విచారణ కొనసాగుతోంది.

మరోపక్క ఏడాది క్రితం బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన ఓ ఎఫ్‌ఐఆర్‌పై ఏప్రిల్ 12న విచారణ జరగనుంది. ఆ ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు ఏకపక్షంగా నమోదు చేశారనే ఆరోపణలూ ఉన్నాయి.

‘ఎఫ్‌ఐఆర్‌ను తప్పుగా నమోదు చేసిన పోలీసు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశాం. వాళ్లు అప్పుడు జరిగిన దాడిపై ఏకపక్షంగా ఫిర్యాదు నమోదు చేశారు. రెండు వర్గాల వారి వాదనను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. తరవాత బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతుల్ సెంగర్‌ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అతడిని కూడా అరెస్టు చేశారు’ అని ఉన్నావ్ జిల్లా మెజిస్ట్రేట్ ఎన్‌.జి. రవికుమార్ పేర్కొన్నారు.

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ సోదరుడే అతుల్ సెంగర్. మంగళవారంనాడు పోలీసులు అతడిని అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఏడాది కాలంగా తాను ఎదుర్కొన్న పరిణామాలన్నింటినీ బాధితురాలు మంగళవారంనాడు జిల్లా మెజిస్ట్రేట్‌ ముందు వెల్లడి చేశారు. బయటికొస్తూ తన తండ్రి మరణాన్నీ, తనపై జరిగిన అత్యాచారాన్నీ గుర్తు చేసుకుంటూ ఆమె రోదించారు.

ఉన్నావ్

ఫొటో సోర్స్, Samiratmaj mishra/BBC

ఇద్దరిదీ ఒకే ఊరు

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌దీ, బాధితురాలిదీ ఒకే గ్రామం. ఉన్నావ్‌కు 12 కి.మీ. దూరంలోని మఖి గ్రామంలోనే వాళ్లిద్దరి నివాసం. గ్రామంలో భారీ విలాసవంతమైన ఇల్లు ఎమ్మెల్యేది. అతడి ఇంటి ప్రాంగణంలోనే అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. మరోపక్క రెండు గదులున్న చిన్న ఇల్లు బాధితురాలిది.

బీబీసీ ప్రతినిధులు బాధితురాలి ఇంటికి వెళ్లేసరికి దానికి తాళం వేసుంది. కానీ ఆ ఇంటి లోపల బాధితురాలి కుటుంబ సభ్యులున్నారు. ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు.

‘పొద్దున్నుంచీ గ్రామంలోని వీధుల్లో కనీసం పది మంది కూడా కనిపించలేదు. అందరూ ఇళ్లలోనే ఉన్నారు. వాళ్లంతా చాలా భయపడుతున్నారు. సమస్యల్ని ఎవరు మాత్రం కోరుకుంటారు? ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడనప్పుడు గ్రామస్థులు మాత్రం ఎలా మాట్లాడతారు’’ అని పేరు గోప్యంగా ఉంచాలని కోరిన ఓ వ్యక్తి అన్నారు.

గ్రామస్థులు ఏమంటున్నారు?

ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ స్థానికంగా బాగా పలుకుబడి ఉన్న నేత. నాలుగు దఫాలుగా వేర్వేరు పార్టీల నుంచి, వేర్వేరు స్థానాల నుంచి పోటీ చేస్తూ అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్నారు. కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కుల్దీప్, తరవాత బీఎస్పీ, ఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికలకు కొన్ని రోజుల ముందే బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

బీబీసీ ప్రతినిధులు ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ఇంటికి కూడా వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి దాదాపు ఓ డజను మంది టీవీ చూస్తూ కనిపించారు. తమ వాదనను ఎవరూ పట్టించుకోవట్లేదనీ, యువతి తరఫు వాళ్లపై అందరూ ఎక్కువ జాలి ప్రదర్శిస్తున్నారని వాళ్లు అన్నారు.

‘యువతి తండ్రి పప్పూ సింగ్‌పై, అతడి ముగ్గురు సోదరులపై ఎన్ని కేసులు నమోదయ్యాయనే విషయాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. మీడియా ఒత్తిడికి భయపడే పోలీసులు, అధికారులు మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు’ అని ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న హిమాన్షు త్రివేది అనే వ్యక్తి చెప్పారు.

ఉన్నావ్‌లోని ఎమ్మెల్యే కుల్దీప్ ఇల్లు

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/BBC

ఫొటో క్యాప్షన్, ఉన్నావ్‌లోని ఎమ్మెల్యే కుల్దీప్ ఇల్లు

గతేడాది ఆ యువతి కిడ్నాప్ అయినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమనీ, తనంతట తానే ఎక్కడికో వెళ్లిందని వాళ్లు చెబుతున్నారు. ‘వాళ్లకు ఎమ్మెల్యే నుంచి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. వాటిని ఒప్పుకోవట్లేదనే ఇలా ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటిదాకా కుల్దీప్‌పై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఆయనెప్పుడూ ఎలాంటి నేరాలు చేయలేదు’ అని సలీల్ సింగ్ అనే వ్యక్తి పేర్కొన్నారు.

సోమవారంనాడు మఖి గ్రామ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయన స్థానంలో రాకేష్ సింగ్ మంగళవారం స్టేషన్ బాధ్యతలు చేపట్టారు. బాధితురాలి తండ్రి పప్పు సింగ్‌పై 29 కేసులు ఉన్నాయనీ, ఆమె మామయ్యపై 14 కేసులు, ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సింగ్‌పై 3 కేసులు నమోదయ్యాయనీ రాకేష్ చెప్పారు. ఎమ్మెల్యేపైన మాత్రం ఎలాంటి కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు.

మరోపక్క గ్రామస్థులు మాత్రం ఎమ్మెల్యే, అతడి సోదరుడిపై నేరారోపణలను కొట్టిపారేయట్లేదు.

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి మరణం విషయంలో ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆ కేసులో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెబుతోంది.

ఉన్నావ్

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/BBC

తప్పు చేసినవాళ్లెవరినీ వదలబోమని స్వయంగా యూపీ సీఎం యోగీ అన్నారు. ఈ పరిణామాలను దురదృష్టకరంగా పేర్కొంటూ, లఖ్నవూ ఏడీజీని ఈ కేసును లోతుగా విచారించమని ఆదేశించినట్టు, దోషులు ఎంతటి వారైనా, ఏ స్థానంలో ఉన్నవాళ్లయినా సరే సహించబోమని యోగీ వివరించారు.

ఎమ్మెల్యేపైన అత్యాచార ఆరోపణలు చేసిన యువతి మాట్లాడుతూ, తాను న్యాయం కోసం ఉన్నావ్‌లోని ప్రతి పోలీసు అధికారి దగ్గరకు వెళ్లాననీ, కానీ ఫలితం లేకపోయిందనీ చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని కుల్దీప్ సింగ్, అతడి అనుచరుల నుంచి తరచూ ఒత్తిళ్లు ఎదురయ్యేవని యువతి బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3న ఎమ్మెల్యే సోదరుడు యువతి తండ్రిపై దాడి చేశాడు.

యువతి తండ్రిపై పోలీసులు తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల చర్యలు, ఎమ్మెల్యే వైఖరితో విసిగిపోయిన యువతి ముఖ్యమంత్రి ఇంటి ఎదురుగా కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించడంతో ఈ పరిణామాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వచ్చాయి.

ఒకప్పుడు ఎమ్మెల్యే, బాధిత యువతి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బాగానే ఉండేవనీ, ఈ మధ్యే ఇలా వ్యవహరిస్తున్నారనీ, క్రమంగా రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం పెరిగిపోయిందనీ యువతి బంధువొకరు తెలిపారు.

ప్రస్తుతం యువతి కుటుంబ సభ్యులు న్యాయం కోసం అర్థిస్తూ, తమ ఇంటిని పోలీసుల సంరక్షణకు వదిలేశారు. నిత్యం కోలాహలంగా ఉండే గ్రామంలో, ఎమ్మెల్యే ఇంటి ఆవరణలో ఇప్పుడు నిశ్శబ్దం నెలకొంది. న్యాయం గెలుస్తుందో, లేదో.. దోషులకు శిక్ష పడుతుందో లేదోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)