సింగపూర్ ఇతర దేశాలకన్నా ఎందుకు ముందుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సారా కీటింగ్
- హోదా, బీబీసీ ట్రావెల్
కొన్ని నెలల క్రితం నేను సింగపూర్‌కు వెళ్లినపుడు నాకు మొదటిసారిగా 'కియాసువిజం' అనుభవంలోకి వచ్చింది.
ఓ శనివారం ఆర్కార్డ్ రోడ్డులో షాపింగ్ చేశాక, నేను ఎమ్‌ఆర్‌టీ (రైలు) స్టేషన్‌కు వెళ్లాను. అక్కడ స్టేషన్ నిండా జనం ఉన్నారు.
అయితే అక్కడ రెండు ఎస్కలేటర్లు ఉన్నా, అందరూ లిఫ్టు వద్దే నిలబడ్డం నాకు ఆశ్చర్యం కలిగించింది. లిఫ్టు రాగానే అందరూ దానిలో చొరబడ్డారు.
దీనికి వ్యతిరేకమైన అనుభవాలు కూడా నాకు తారసపడ్డాయి. ఒకసారి నేను మా పాపతో వెళుతుండగా, పాప నిద్ర లేస్తుందేమో అన్న భయంతో నిర్మాణ కార్మికులందరూ కొద్దిసేపు తమ పని నిలిపేశారు. వర్షం కురిసేటప్పుడు నేను బస్సు దిగుతుంటే, తడిచిపోతానని నాకు తమ గొడుగులు ఇచ్చిన వాళ్లున్నారు. మరి అలాంటప్పుడు లిఫ్ట్‌లో ఎక్కడానికి మాత్రం ఎందుకంత పోటీ పడ్డారు?
నాకు తొందరలోనే దీనినే 'కియాసు' అని అంటారని తెలిసింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనాలోని హొక్కెయిన్ మాండలికంలో 'కియా' అంటే భయం, 'సు' అంటే కోల్పోవడం - అంటే 'కోల్పోతామనే భయం'. 2007లో దీనిని ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చేర్చడం జరిగింది. దానికి అర్థం - 'గుంజుకునే, తమకే చెందాలనే ధోరణి' అని పేర్కొన్నారు.
మనుగడ కోసం పోరాటమే దీనికి కారణమని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన డాక్టర్ లియాంగ్ చాన్ హూంగ్ తెలిపారు. కేవలం 53 ఏళ్ల వయసున్న ఈ ఆగ్నేయాసియా దేశం, సాంస్కృతికంగా భిన్నమైన దేశాల మధ్య ఉంటూ, నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటుంటుంది.
''సింగపూర్ ప్రజల మెదళ్లలోకి స్వయం సమృద్ధి సాధించాలనే భావనను చొప్పించారు. ఎప్పుడూ అవకాశాల కోసం చూడాలి, అందరికన్నా ముందుండాలి, ఇది సమాజంలో భాగమైపోయింది.'' అని హూంగ్ అన్నారు.
క్లుప్తంగా చెప్పాలంటే, ఏదైనా కోల్పోవడాన్ని సింగపూర్ వాసులు భరించలేరు. అంతే కాదు, ఆఫర్లన్నా వాళ్లకు చాలా ఇష్టం. లేటెస్ట్ మోడల్ ఫోన్ కోసం వాళ్లు ఎంత సేపైనా క్యూల్లో నిలబడగలరు.
2015లో నిర్వహించిన ఒక సర్వేలో సింగపూర్ ప్రజల ముఖ్యమైన 10 నమ్మకాలలో పోటీతత్వం, వ్యక్తిగత స్వార్థంతో పాటు 'కియాసు' కూడా ఒకటని తేలింది. అదే సమయంలో కుటుంబ సంబంధాలు, స్నేహం, నిజాయితీలు కూడా ఆ జాబితాలో చోటు చేసుకున్నాయి.
సమస్య ఏమిటంటే, సింగపూర్ వాసులు ఆ రెండింటి మధ్య సమతుల్యత సాధించడానికి ఇబ్బంది పడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ సింగపూర్‌లోనే 'కియాసువిజం'ను తీసిపారేసేవారూ ఉన్నారు. జానీ లావ్ అనే కళాకారుడు 1990ల నుంచి 'మిస్టర్ కియాసు' అనే కామిక్ పాత్ర ద్వారా దాన్ని ఎగతాళి చేస్తున్నారు.
మొదట దానికి మిశ్రమ ప్రతిస్పందన లభించింది.
''60 శాతం మంది దానిని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తే, 40 శాతం మంది నవ్వుకున్నారు. ఇతర దేశాల ముందు సింగపూర్ ప్రజలను చులకన చేస్తున్నారని అన్నారు'' అని లావ్ తెలిపారు.
అయితే క్రమక్రమంగా మిస్టర్ కియాసు పాపులర్ అయింది. ఆ పేరుతో మెక్‌డొనాల్డ్స్ బర్గర్ కూడా విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే ఇటీవలి కాలంలో 'కియాసువిజం'పై రాజకీయనాయకులు, ఇతరుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
కియుక్ షియావో అనే రాజకీయవేత్త - ఇతరుల కన్నా ముందుండాలనే అత్యాశతో కియాసు ఎంట్రప్రెన్యూర్లు దీర్ఘకాలిక ప్రణాళికకన్నా స్వల్పకాలిక లాభాల కోసం చూస్తున్నారని ఆరోపించారు.
కానీ చాలా మంది సింగపూర్ వాసులు మాత్రం కియాసు స్ఫూర్తిని కొనసాగించాలనుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'కియాసు పేరెంట్స్'
నేను కవల పిల్లల తల్లి అయిన సెసీలియా లియాంగ్‌ను 'కియాసు పేరెంట్స్' ఇంకా ఉన్నారా అని ప్రశ్నించాను.
''ఎందుకు లేరు? నేను కూడా అలాంటి తల్లినే'' అన్నారామె.
తల్లి కావడానికి ముందు చదువు విషయంలో తన పిల్లలపై ఒత్తిడి పెట్టకూడదని ఆమె అనుకున్నారు. కానీ తల్లి అయ్యాక కథ మారిపోయింది.
''పోటీ ఎక్కువగా ఉండడంతో నా పిల్లలు ఇతరులకన్నా వెనుకబడిపోకూడదని భావించాను'' అన్నారు సెసీలియా.

ఫొటో సోర్స్, Getty Images
సహజ వనరులు లేకే..
ఆమె భర్త లిమ్ సూన్ జిన్ కూడా ఆమె అభిప్రాయంతో ఏకీభవించారు. సింగపూర్‌కు సహజ వనరులు లేకపోవడం వల్లే ఇలా పోటీ పెరుగుతోందని జిన్ అన్నారు. ''మా పూర్వీకులంతా కూడా పోటీతత్వంతోనే జీవించారు. అందుకే మేం కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచే దాన్ని అలవరుస్తున్నాం'' అని జిన్ తెలిపారు.
''మాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. పోటీతత్వంతో ఉండడమే ఇక్కడ మా ప్రధాన వనరు.''
బహుశా అందుకేనేమో సింగపూర్‌ను 'ఎలాగైనా సాధించాలనే పట్టుదల' గల దేశంగా పేర్కొంటుంటారు.
ఇవి కూడా చదవండి
- తండ్రిని ఆకలి ఓడించింది, ఆ తండ్రిని కొడుకు గెలిపించాడు.. రాహుల్ 'గోల్డ్' కోస్ట్ స్టోరీ ఇదీ!
- ‘అప్పుడు అంబేడ్కర్ పేరు పలకడానికి సిగ్గుపడేదాన్ని.. ఇప్పుడు గర్వపడుతున్నా’
- లాస్ట్ డేట్ ఏప్రిల్ 27: సూర్యుడిపైకి మీ పేరు.. ఇలా పంపించొచ్చు
- సిరియా రసాయన దాడులపై ‘తీవ్ర’ పరిణామాలు తప్పవు.. 48 గంటల్లో కీలక నిర్ణయాలు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








