#గమ్యం: సెలవుల్లో ఇంటర్న్‌షిప్ - ఉద్యోగ వేటలో మెరుగైన అవకాశాలు
- రచయిత, అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం. పరీక్షల కాలం మరి కొద్ది రోజుల్లో పూర్తికాబోతోంది. వేసవి సెలవులు మొదలవుతున్నాయి. పరీక్షలు విజయవంతంగా పూర్తిచేసి ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అని విద్యార్థులంతా ఉవ్విళ్లూరుతూ ఉంటారు.
ఇదంతా అవసరమే. కానీ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో సెలవులన్నింటినీ సరదాలు, సంబరాలకే వెచ్చించడం సరికాదు. ఈ ఖాళీ సమయాన్ని అర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో ఒకటి ఇంటర్న్‌షిప్.
ఇంటర్న్‌షిప్ ఎలా చేయాలి, ఎక్కడ దొరుకుతుంది, సంస్థను ఎలా ఎంపిక చేసుకోవాలి వంటి అంశాలపై Careers360.com ఇంజనీరింగ్ విభాగం ఎడిటర్ ప్రభ ధవళ ఈ వారం 'గమ్యం'లో వివరిస్తున్నారు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి. మీ సందేహాలకు ప్రభ సమాధానం ఇస్తారు.
ఇంటర్న్‌షిప్ అనగానే సాధారణంగా అదేదో మెడికల్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేశాక ఏదో ఒక హాస్పటల్లో తీసుకునే ప్రత్యేక శిక్షణ అని, అది కేవలం వారికే పరిమితం అని ఒకప్పుడు ఓ అపోహ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.
ఇంటర్న్‌షిప్ అనేది ఇప్పుడు అందరూ చేయాల్సిందే అని ఏఐసీటీఈ ఇటీవలే ఒక నిబంధన పెట్టింది. ఇది విద్యార్థులకు చాలా ఉపయోగకరమైన నిర్ణయం. ఎందుకంటే తరగతి గదిలో నేర్చుకునేదానికీ ఉద్యోగంలో చేరాక చెయ్యాల్సిన పనికీ చాలా తేడా ఉంటుంది. మన విద్యావిధానం తరగతి గదిలో నేర్చుకోవడంపైనే ఎక్కువ దృష్టి సారించడం వల్ల విద్యార్థుల నైపుణ్యాలకు, కంపెనీలు ఆశిస్తున్న నైపుణ్యాలకు మధ్య చాలా దూరం ఏర్పడుతోంది. ఈ దూరాన్ని తగ్గించడంలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు చాలా ఉపయోగపడతాయి. అంతేకాదు, వీటివల్ల ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు కూడా పెరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటర్న్‌షిప్ ఎక్కడ, ఎలా చేయవచ్చు?
గ్రాడ్యుయేషన్ (ఇంజనీరింగ్ లేదా సాధారణ డిగ్రీ) పూర్తి చేసినవాళ్లకు ఎన్నో ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. internshala.com, hellointern.com, twenty19.com వంటి ఎన్నో వెబ్‌సైట్లు వివిధ కంపెనీలు, సంస్థలు అందించే ఇంటర్న్‌షిప్‌ల వివరాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నాయి. వీటితోపాటు ఆయా కంపెనీల వెబ్‌సైట్లలో కూడా ఆ సమాచారం అప్‌డేట్ అవుతూ ఉంటుంది.
ఇంటర్న్‌షిప్ ఎలా ఎంపిక చేసుకోవాలి?
మీరు ఏం చదువుతున్నారు? ఏ రంగంలో లేదా ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటున్నారు? మీ వద్ద ఎంత సమయం అందుబాటులో ఉంది? ఇంటర్న్‌షిప్ కోసం వెళ్లే సంస్థలో రోజూ ఎంతసేపు గడపాల్సి ఉంటుంది? వంటి అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
కంపెనీని ఎలా ఎంపిక చేసుకోవాలి?
ముందుగా ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్న కంపెనీ ప్రొఫైల్ చూడాలి. కంపెనీ ప్రొఫైల్ బాగా లేకపోతే మీరు చేసే ఇంటర్న్‌షిప్‌తో మీకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. గతంలో ఎవరైనా ఇక్కడ ఇంటర్న్‌షిప్ చేశారేమో పరిశీలించండి. ఈ మధ్య చాలామంది ఆన్‌లైన్‌లో రివ్యూలు రాస్తున్నారు. వాటిని విశ్లేషించాలి. వారి అనుభవాలను తెలుసుకోవాలి.
ఇవి కూడా మర్చిపోవద్దు!
మీరు చేసిన లేదా నేర్చుకున్న పనికి సంబంధించి ఏమైనా అస్సెస్‌మెంట్ ఉంటుందా, గ్రేడింగ్ లేదా సర్టిఫికెట్ ఇస్తారా వంటి అంశాలు చాలా ముఖ్యం. ఇలాంటి సర్టిఫికెట్లతో ఉద్యోగవేట కొద్దిగా సులభమవుతుంది. ఇవి సాధారణ అభ్యర్థులకు మీకు మధ్య ఉన్న పోటీలో మిమ్మల్ని ఒక మెట్టు పైన నిలబెడతాయనడంలో సందేహం లేదు.
ఇవి కూడా చదవండి.
- #గమ్యం: వైజ్ఞానిక పరిశోధకులకు అండ.. కేవీపీవై స్కాలర్షిప్
- #గమ్యం: వైద్య అనుబంధ రంగాలు - అవకాశాలు ఎక్కువ, అభ్యర్థులు తక్కువ
- #గమ్యం: విదేశాల్లో మెడిసిన్ చదవాలన్నా నీట్ తప్పనిసరి
- #గమ్యం: ‘గేట్’ స్కోరుతో మీకు తెలియని ఉపయోగాలు
- #గమ్యం : 2020 తర్వాత వైద్యరంగంలో ఈ కోర్సులదే హవా
- #గమ్యం: ఎప్పటికీ వన్నె తరగని హోటల్ మేనేజ్మెంట్
- #గమ్యం: లా చదివితే లాయరే కానక్కర్లేదు
- #గమ్యం: జేఈఈలో విజయం సాధించడం ఎలా?
- #గమ్యం: జేఈఈ, ఎంసెట్... ఇంకా ఏమేం రాయొచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









