అభిప్రాయం: తాజ్‌పై అంత కోపమెందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీజేపీ నేతలు ప్రేమకు అంత వ్యతిరేకమా? ఆ పదమే వాళ్లకు అస్సలు నచ్చదా? లేకపోతే ప్రపంచమంతా ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్‌మహల్‌ని వాళ్లెందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు?
తాజ్‌మహల్ భారతీయ సంస్కృతికి ఏమాత్రం ప్రతీక కాదని కొన్నాళ్ల క్రితం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
మొన్నీమధ్య యూపీ ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక బ్రోచర్ నుంచి తాజ్ మహల్‌ని తొలగించింది.
తాజాగా అదే రాష్ట్రానికి చెందిన సంగీత్ సోమ్ అనే ఎమ్మెల్యే తాజ్‌ని భారతీయ సంస్కృతికి అంటుకున్న మరకగా అభివర్ణించారు. దాన్ని నిర్మించినవాళ్లని ద్రోహులుగా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Venugopal Bollampalli
తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం పదిహేడవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
1656 నుంచి 1668 మధ్య భారత్‌లో పర్యటించిన ఫ్రాంకోయిస్ బెర్నియర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు, ఆ పాలరాతి అద్భుతాన్ని భారతీయులు ఎంతగా ఇష్టపడతారన్న విషయాన్ని తన ట్రావెలోగ్‌లో వివరించారు.
‘కాలమనే చెక్కిట జారిన కన్నీటి చుక్క తాజ్’ అని నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images
తాజ్‌ని చూడకుండా ఇప్పుడు ఏ విదేశీ యాత్రికుడి భారత పర్యటనా పూర్తవదు. ఏ దేశ ప్రభుత్వాధినేతలైనా, ప్రపంచస్థాయి సెలెబ్రిటీలైనా ఆ పాలరాతి అందాల్ని చూడకుండా దేశం నుంచి కాలు బయటపెట్టరు.
అంతెందుకు... ప్రిన్సెస్ డయానా తాజ్ ముందు దిగిన ఫొటోని అభిమానులు అంత త్వరగా మరచిపోగలరా!
ఇప్పటికీ తాజ్ ప్రేమకు చిహ్నమే. అందుకే ఏటా నలబై లక్షల మంది భారతీయులు ఆ ప్రేమ మందిరాన్ని సందర్శిస్తారు. ఏటా రెండు లక్షలమంది విదేశీ యాత్రికులు కూడా తాజ్ చెంతకు చేరతారు.

ఫొటో సోర్స్, Getty Images
రకరకాల కారణాలతో నిత్యం వార్తల్లో ఉండే తాజ్, మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. వివాదాస్పద నేతగా పేరున్న బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్, తాజ్‌ని నిర్మించింది ద్రోహులని పేర్కొన్నారు.
‘షాజహాన్ తన తండ్రినే చెరశాలలో వేశాడు. అతడు హిందువులందర్నీ నాశనం చేయాలనుకున్నాడు. మేం చరిత్రని మారుస్తాం’ అని ఆయన అన్నారు.
సంగీత్ సోమ్ వ్యాఖ్యలు పూర్తిగా అతడి వ్యక్తిగతమైనవనీ, వాటితో పార్టీకి ఏమాత్రం సంబంధంలేదని బీజేపీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయినా సరే అతడి వ్యాఖ్యలకు ప్రజలు సోషల్ మీడియాలో ఘాటుగానే స్పందించారు. చాలామంది సంగీత్ సోమ్‌పైన జోకులూ, వ్యంగ్యాస్త్రాలతో దాడి చేశారు.
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అయితే, ‘స్వాతంత్ర్య దినోత్సవం నాడు మోదీ ఎర్రకోటలో ప్రసంగించరా? దాన్ని కూడా షాజహానే కట్టించాడు కదా’ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా అలాంటి వ్యాఖ్యే చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
తాజ్‌కి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలన్నీ మతపరమైన విద్వేషాల్ని రెచ్చగొట్టే ప్రయత్నాల్లో భాగమేనన్నది చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ వ్యాఖ్యల పరమార్థమేంటో తెలుస్తుందని వాళ్లంటారు.
ఆర్థిక అభివృద్ధి పరంగా చూపించడానికి ఏమీ లేనప్పుడు, మతపరమైన విశ్వాసాల గురించి చర్చ లేవదీయడం రాజకీయ వ్యూహాల్లో భాగమేననీ, దాని వల్ల వచ్చే ఫలితాలు ఎప్పుడూ నేతలకు లాభదాయకంగానే ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








