బీజేపీ మళ్లీ ‘హిందుత్వ’నే ప్రధానాస్త్రం చేయనుందా?

ఫొటో సోర్స్, PTI
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టాక అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. కానీ మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆ పార్టీ ఇప్పుడు అసలైన పరీక్షను ఎదుర్కొనబోతోంది.
గుజరాత్‌లో బీజేపీ 'గౌరవ్ యాత్ర'లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు మోదీ, అమిత్ షా, బీజేపీలకు అగ్నిపరీక్షగా మారాయి.
ప్రస్తుతం గుజరాత్‌లో మోదీ అభివృద్ధి స్లోగన్ అనేక విమర్శలను ఎదుర్కొంటోంది.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్‌లో బీజేపీని ఓడించడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
ఈ నేపథ్యంలో హిందుత్వకు పర్యాయపదంగా భావించే యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ గుజరాత్ బరిలోకి దింపడం వెనుక వ్యూహమేంటి? అన్నది ఆసక్తికరంగా మారింది.
అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రశాంత్ దయాళ్, "2002, 2007 ఎన్నికల్లో బీజేపీ హిందుత్వ అజెండాతో ఎన్నికలకు వెళ్లింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో, 2014 లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహం మార్చి అభివృద్ధి అజెండాతో వెళ్లారు. ప్రస్తుతం అభివృద్ధి నమూనాను ప్రజలు అంగీకరించడం లేదని తెలుస్తోంది. అందుకే బీజేపీ మరోసారి హిందుత్వ అజెండాను రంగం మీదకు తెస్తోంది. యోగిని బరిలోకి దింపడంలోని ఆంతర్యం ఇదే" అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ 'గౌరవయాత్ర'కు ఎదురుగాలి
కొన్ని నెలలుగా బీజేపీకి వ్యతిరేకంగా 'గుజరాత్‌లో అభివృద్ధి వెర్రి'గా మారిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో149 నియోజకవర్గాల్లో, పదిహేను రోజుల పాటు గౌరవ్ యాత్ర కొనసాగనుంది.
అనేకచోట్ల వికాస్ యాత్రకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో రాహుల్ 'నవసర్జన్ యాత్ర'కు మంచి ప్రతిస్పందన వస్తోంది.
అందువల్లే బీజేపీ మరోసారి తన పాత హిందుత్వ ఫార్ములానే అనుసరిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ ఆర్‌కే మిశ్రా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ, షా మేజిక్ మళ్లీ పని చేస్తుందా?
గుజరాత్‌లో బీజేపీ 22 ఏళ్లుగా అధికారంలో ఉంది.
ఇన్నాళ్లూ మోదీ, అమిత్ షా చాణక్యంతో బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించింది. అయితే గుజరాత్ ఎన్నికలు మాత్రం బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి.
నోట్ల రద్దు, జీఎస్టీకి వ్యాపార వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకత, పటేళ్ల రిజర్వేషన్, దళితులపై దాడులు వంటి అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా మారాయి.
ఈ సారి ఎలాగైనా గుజరాత్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న రాహుల్ గాంధీ.. మోదీ, షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
అయితే క్షేత్రస్థాయిలో బలంగా ఉండడం బీజేపీకి కలిసి వచ్చే అంశం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశాంత్ దయాళ్ ప్రకారం, "గుజరాత్‌లో బీజేపీని ఓడించడం అంత సులభమేం కాదు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ఇటీవలి భారీ వర్షాల తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. దానికి తోడు రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ విజయంతో కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ అంశాలన్నీ రాబోయే ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయి."
గౌరవ యాత్ర ముగింపు సందర్భంగా అక్టోబర్ 16న గాంధీనగర్ సమీపంలోని భాట్ గ్రామంలో బీజేపీ 'గౌరవ్ మహాసమ్మేళన్' పేరిట భారీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి బీజేపీ శ్రేణులు లక్షల్లో తరలి వస్తారని భావిస్తున్నారు.
'గౌరవ్ యాత్ర' ఏ మేరకు సఫలం అయిందన్నది, ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తేలుతుంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








