ముంబయి: విమానం ఢీకొని 39 ఫ్లెమింగోలు మృతి, పర్యావరణవేత్తల ఆందోళన ఏంటి?

ఫ్లెమింగో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏటా వేలాది ఫ్లెమింగో పక్షులు ముంబయికి వలస వస్తాయి.
    • రచయిత, చెరిలాన్ మోలన్,
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముంబై నగరంలో విమానం ఢీకొనడంతో కనీసం 39 ఫ్లెమింగోలు మృత్యువాత పడిన ఘటనపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన తర్వాత, 300 మందికి పైగా ప్రయాణికులున్న ఎమిరేట్స్ విమానం, ఏప్రిల్ 20వ తేదీ రాత్రి సురక్షితంగా ల్యాండ్ అయింది.

పక్షులు తమ సాధారణ మార్గం నుంచి విమానాలు వెళ్లే ఆకాశమార్గంలోకి మరలడమే ఈ ప్రమాదానికి కారణమా అనేది ఇంకా స్పష్టంగా తెలియడంలేదని అధికారులు తెలిపారు.

ఈ సంఘటన జరిగిన అనంతరం, ఎమిరేట్స్ ప్రతినిధి స్థానిక మీడియాతో మాట్లాడుతూ, దుబాయ్ నుండి ముంబైకి వస్తున్న విమానం, "ల్యాండింగ్‌ అవుతుండగా, పక్షులను ఢీ కొంది" అని తెలిపారు.

"విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారు. అయితే, దురదృష్టవశాత్తు, అనేక ఫ్లెమింగోలు చనిపోయాయి. ఎమిరేట్స్ ఈ విషయంపై విచారణాధికారులకు సహకరిస్తోంది" అని ఆయన చెప్పారు.

ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుండగా, మితిమీరిన భవన నిర్మాణాలే ఇలాంటి ఘటనలకు కారణమని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.

ప్రతి సంవత్సరం, వేలాది ఫ్లెమింగోలు ముంబయి వలస వచ్చి, నగరంలోని చిత్తడి నేలలను కొన్ని నెలల పాటు తమ నివాసంగా మార్చుకుంటాయి.

ఈ గులాబీ రంగు అతిథులను చూడడానికి, వాటి ఫోటోలను తీసుకోవడానికి స్థానికులు, ఫోటోగ్రాఫర్లు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఫ్లెమిగోలను ఫోటోలు తీస్తున్న సందర్శకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నవీ ముంబాయిలో ఫ్లెమింగోలను ఫోటోలు తీయడానికి ప్రజలు తరలివస్తారు

దారి మార్పే కారణమా?

ముంబయి శివారు ప్రాంతమైన ఘట్‌కోపర్‌లో సోమవారం రాత్రి కొంతమంది పిల్లలు రోడ్డుపై ఫ్లెమింగోల కళేబరాలను గుర్తించడంతో వీటి మృతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫ్లెమింగో కళేబరాలు 500 మీటర్ల వ్యాసార్థంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక కథనం పేర్కొంది.

సోమవారం అర్థరాత్రి 29 కళేబరాలు, మంగళవారం ఉదయం మరో పది కళేబరాలు లభ్యమయ్యాయని అటవీ అధికారి అమోల్ భగవత్ ఆ వార్తాపత్రికకు తెలిపారు.

పక్షులు సమీపంలోని అభయారణ్యం వైపు వెళుతూ, తమ దారిని మార్చుకోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పర్యావరణవేత్తలు స్థానిక మీడియాకు తెలిపారు.

ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను పర్యావరణవేత్త స్టాలిన్ తప్పుపట్టారు.

"ఫ్లెమింగోలు ఈ హై వోల్టేజ్ విద్యుత్ లైన్‌ల పైనుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, ఆ ప్రయత్నంలో విమానం వాటిని ఢీ కొట్టింది." అని ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు.

ఈ సంఘటనతో ముంబయి తీర ప్రాంత సమీపంలో నిర్మాణ కార్యకలాపాలపై తిరిగి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఫ్లెమింగోలు వచ్చే మరో ముఖ్య ప్రాంతమైన నవీ ముంబైలో రాబోతున్న విమానాశ్రయం గురించీ పర్యావరణవేత్తలు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నారు.

విమానాశ్రయ నిర్మాణం, అక్కడ ట్రాఫిక్ మరిన్ని ఫ్లెమింగో మరణాలకు దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)