భారత్‌ ఉత్పత్తులపై నిషేధాన్ని పాకిస్తాన్ ఎత్తివేయక తప్పదా?

మోదీ, షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, షుమైలా జాఫరీ
    • హోదా, బీబీసీ న్యూస్

విధ్వంసకర వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒకవైపు సహాయక చర్యలు, మరోవైపు ఉపశమన చర్యలను చేపడుతోంది. అయితే, ఇప్పటికే దేశంలోని మూడో వంతు పంట భూమి నీట మునిగింది.

ఆహార పదార్థాల కొరతను దృష్టిలో ఉంచుకొని భారత్‌ నుంచి కూరగాయలు, ఇతర ఆహార వస్తువుల దిగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తాజాగా పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ సంకేతాలు ఇచ్చారు.

2019లో జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో ఆర్థిక లావాదేవీలను పాకిస్తాన్ స్తంభింపజేసింది. మరోవైపు సరిహద్దుల వెంబడి దిగుమతులపైనా నిషేధం విధించింది.

కానీ, తాజా వరదల వల్ల పాక్‌లోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కూరగాయలతోపాటు మార్కెట్‌లోని నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో భారత్ నుంచి ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునే ఆలోచనను పాక్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఇస్మాయిల్ చెప్పారు.

ఇప్పటికే ఈ ప్రతిపాదనపై వాణిజ్య, ఆర్థిక కార్యదర్శులతో చర్చలు జరిపామని ఇస్మాయిల్ వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రతిపాదనను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్తామని, ఆ తర్వాత దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభిస్తుందని ఆయన అన్నారు.

‘‘పన్ను రహిత దిగుమతులకు మేం అనుమతిస్తాం. ముఖ్యంగా భూ సరిహద్దుల గుండా దిగుమతులకు అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి’’అని ఆయన చెప్పారు.

పాకిస్తాన్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

యూటర్న్ ఎందుకు?

రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను బాగు చేసేందుకు తాజా సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తోంది. అయితే, పాక్ క్యాబినెట్ దీనికి ఆమోదం తెలుపుతుందా? లేదా భారత్ ఎలా స్పందిస్తుంది? లాంటి అంశాలపై ఇది ఆధారపడుతుంది. మరోవైపు ఇలా నిషేధాన్ని ఎత్తివేసే అంశాన్ని పరిశీలించడం ఇదేమీ తొలిసారి కూడా కాదు.

ఈ విషయంపై పొలిటికల్ సైంటిస్ట్ ఫహాద్ హుమయూన్ బీబీసీతో మాట్లాడారు. ‘‘ఈ విషయంలో చాలాసార్లు యూటర్న్‌లు తీసుకోవడం లేదా మాట ఇచ్చి వెనక్కి వెళ్లడం లాంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సమస్య ఆర్థిక అంశాలతో ముడిపడి లేదు. ఇది పూర్తి రాజకీయ సమస్య’’అని ఫహాద్ అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ తర్వాత ప్రధాన మంత్రిగా షాబాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకున్నప్పుడు భారత్‌తో సంబంధాలను మళ్లీ పునరుద్ధరిస్తారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూర్చేలా దిల్లీలోని పాకిస్తానీ హైకమిషన్‌లో ప్రత్యేకంగా ఒక వాణిజ్య అధికారిని కూడా నియమించారు. మరోవైపు షాబాజ్ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాలకు మంచిదని ఆయన అన్నారు.

అయితే, ఇమ్రాన్ ఖాన్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో షాబాజ్ ప్రభుత్వం మళ్లీ వెనక్కి తగ్గింది. ఆ వాణిజ్య అధికారి నియామకంలో ప్రత్యేకత ఏమీలేదని, ఇది సాధారణ ప్రక్రియేనని చెప్పుకొచ్చింది. మరోవైపు భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పునరుద్ధరిస్తారనే వార్తలను వాణిజ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. తమ పాత విధానంలో ఎలాంటి మార్పూలేదని తెలిపింది.

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, AFP

గత ఏడాది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రతిపాదన పరిశీలనకు వచ్చింది. అప్పటి ప్రభుత్వంలో ప్రధాన మంత్రికి వాణిజ్య సలహాదారుగా పనిచేసిన రజాక్ దావూద్ దీనిపై మాట్లాడారు. భారత్‌తో ద్వైపాక్షిక బంధాలను పునరుద్ధరించడం తప్పనిసరని, నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన చెప్పారు. ఇది రెండు దేశాలకు మేలు చేస్తుందని అన్నారు. అయితే, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ప్రతిపాదనను ఇమ్రాన్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది.

‘‘ఆర్థికంగా చేకూరే ప్రయోజనాలు లేదా ఆర్థికంగా రెండు దేశాలు అనుసంధానం కావడంపై పాకిస్తాన్‌కు స్పష్టమైన అవగాహన ఉంది. నిజానికి భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించాలని వరుసగా మారుతూ వచ్చిన ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. ఇదే విషయాన్ని దేశ జాతీయ భద్రతా విధాన పత్రంలోనూ పేర్కొన్నారు’’అని ఫహాద్ చెప్పారు.

అయితే, అసలు సమస్య అంతా రాజకీయంగానే ఉంటోందని ఫహాద్ అన్నారు. ఈ రాజకీయ సమస్యను పరిష్కరించకపోతే పాక్‌కు ప్రస్తుతం చాలా నష్టం చేకూరే అవకాశముందని ఆయన విశ్లేషించారు.

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

నమ్మకం.. నమ్మకం.. నమ్మకం..

లాహోర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎల్‌సీసీఐ)లోని పాకిస్తాన్-భారత్ ట్రేడ్ డెస్క్‌కు కన్వీనర్‌గా ఉజ్మా షాహిద్ పనిచేశారు. 2019లో జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఈ డెస్కును కూడా తొలగించారు.

‘‘అప్పట్లో రాత్రికిరాత్రే వాణిజ్యంపై నిషేధం విధించాలని పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వందల మంది వ్యాపారులు, మహిళల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. ఒక్క రోజులోనే వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి’’అని ఉజ్మా వివరించారు.

రెండు వైపులా ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆమె చెప్పారు. ‘‘ప్రజల మధ్య మంచి సంబంధాలు, స్నేహం ఉండేవి. కానీ, ఒక్క దెబ్బతో అన్నీ ధ్వంసం చేశారు’’అని ఉజ్మా అన్నారు.

ఉజ్మా కూడా సరిహద్దుల వెంబడి జౌళీ వ్యాపారాన్ని చేసేవారు. అప్పట్లో పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తను లక్షల్లో నష్టపోయానని ఆమె చెప్పారు. తనతోపాటు పనిచేసిన భారతీయ ఎగుమతిదారులు కూడా ఇలానే నష్టపోయారని ఆమె వివరించారు.

‘‘కశ్మీరీల కోసం పోరాటం పేరుతో మా జీవనోపాధిపై కొట్టారు. ఇప్పటికీ ఆ నష్టాల నుంచి మేం కోలుకోలేకపోతున్నాం’’అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, ఈ సంక్షోభంతో ఆ దేశ భవిష్యత్తు ఏం కానుంది?

ఈ సారైనా అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యాపారులకు ముందుగానే తెలియజేయాలని, కాస్త గడువు ఇవ్వాలని ఆమె కోరారు. ‘‘ఇప్పుడు కూడా నెలల నుంచి వాణిజ్యాన్ని పునరుద్ధరిస్తారని ఎదురుచూస్తున్నాం. కానీ, ఏమీ జరగడం లేదు’’అని ఆమె అన్నారు.

రెండు దేశాల మధ్య పాక్షికంగా వాణిజ్య బంధాలను పునరుద్ధరిస్తారని మీడియాలో వస్తున్న వార్తలపై ఉజ్మా అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై వ్యాపారుల్లో నమ్మకం పూర్తిగా పడిపోయిందని ఆమె అన్నారు.

‘‘అప్పట్లానే మళ్లీ జరగదని మాకు ఎవరు హామీ ఇస్తారు? రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా సంక్లిష్టంగా మారిపోయాయి. అసలు సంబంధాల్లో స్థిరత్వాన్ని ఆశించడం దండగ’’అని ఆమె వ్యాఖ్యానించారు.

2019కు ముందు రెండు దేశాల మధ్య తాజా పళ్లు, కూరగాయలు, బట్టలు, చేనేత ఉత్పత్తులు, జిప్సమ్, మార్బుల్, మసాలా దినుసులు తదితర వస్తువులు వాఘా సరిహద్దుల గుండా ఎగుమతులు, దిగుమతులు జరిగేవి.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో వరద బీభత్సం... తిండి కోసం తిప్పలు పడుతున్న జనం

‘‘ఇద్దరికీ మేలే’’

వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలనే నిర్ణయం రాజకీయాలతో ముడిపడి ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఇది రెండు దేశాలకూ మేలు చేస్తుందని ఆర్థికవేత్త హదియా మజీద్ అన్నారు. రెండు దేశాలకే కాదు, ఈ ప్రాంతం మొత్తానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.

‘‘పాకిస్తాన్ కోణంలో ఆలోచిస్తే, ఈ దిగుమతులతో ప్రజలకు ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచొచ్చు. ఫలితంగా ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయొచ్చు. పరిస్థితి మరింత దిగజారే వరకు ఎదురుచూడకుండా చేయాల్సిన పనులపై పాక్ ప్రభుత్వం దృష్టిపెట్టాలి’’అని ఆయన చెప్పారు.

మోదీ, షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

‘‘ద్వైపాక్షిక వాణిజ్యంతో ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుంది. రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ప్రజల మధ్య బంధాలు పెనవేసుకుంటాయి. ఇది రెండు దేశాలకూ మంచిదే’’అని ఆయన అన్నారు.

‘‘ఈ వాణిజ్యాన్ని మళ్లీ పునరుద్ధరిస్తే, వస్తువుల ధరలు తగ్గుతాయి. ఒక దేశంలో అనుసరిస్తున్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం మరో దేశం పరిశీలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో సమయం, డబ్బు ఆదా అవుతాయి. కార్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి’’అని ఆయన వివరించారు.

‘‘ఈ వాణిజ్యంతో సరిహద్దులకు రెండు వైపుల ఉండే ప్రజలూ లబ్ధి పొందుతారు. దీంతో రెండు దేశాల బంధాలు గాడిన పడతాయి’’అని హదియా వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)