బంగ్లాదేశ్: భారీ పేలుడు, అగ్నికీలలలో 40 మందికి పైగా మృతి, గాయపడినవారితో నిండిపోయిన ఆసుపత్రులు

ఫొటో సోర్స్, Reuters
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ సమీపంలోని ఒక స్టోరేజ్ డిపోలో చోటుచేసుకున్న భారీ పేలుడు, అనంతరం వ్యాపించిన మంటలలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
చిట్టగాంగ్ సమీపంలోని సీతకుండ పట్టణంలో ఉన్న కంటైనర్ స్టోరేజ్ డిపోలో ఈ ప్రమాదం జరిగింది.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు వందల మంది అక్కడి చేరుకున్నప్పటికీ డిపోలోని కంటైనర్లు ఒక్కటొక్కటిగా పేలిపోతుండడంతో మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు.
కొన్ని కంటైనర్లలో రసాయనాలు ఉండడం వల్లే మంటలు మరింత తీవ్రమయ్యాయని భావిస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో పారిశ్రామిక అగ్నిప్రమాదాలు ఎక్కువ. సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయన్న ఆరోపణలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రమాదంలో గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే సూచనలున్నాయి.
ప్రమాద స్థలానికి సమీపంలోని ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. రక్తం కొరత ఏర్పడడంతో రక్తదానం చేయాలని కోరుతున్నారు.
బంగ్లాదేశ్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో స్టోరేజ్ డిపోలో మంటలు వ్యాపించాయి.
వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
వారంతా మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుండగానే భారీ పేలుడు సంభవించింది.
దీంతో మంటలను అదుపు చేసేందుకు వెళ్లినవారందనీ అగ్నికీలలు చుట్టుముట్టాయి. పేలుడు ధాటికి కొందరు గాల్లోకి ఎగిరిపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
''పేలుడు ధాటికి నేను ఉన్న చోటి నుంచి సుమారు 30 అడుగుల దూరం ఎగిరిపడ్డాను. నా కాళ్లు, చేతులు కాలిపోయాయి" అని లారీ డ్రైవర్ తొఫాయెల్ అహ్మద్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.
పేలుడు, మంటల కారణంగా భస్మీపటలమైన డిపో నుంచి స్వచ్ఛంద సేవకులు ఆదివారం ఉదయం మృతదేహాలను బయటకు తెస్తున్న దృశ్యాలను అందరినీ కలచివేస్తున్నాయి.
అగ్నిమాపక సిబ్బందిలో అయిదుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
చాలామంది ప్రజల ఆచూకీ ఇంకా దొరకలేదు. పేలుడుకి ముందు అక్కడ మంటలు వ్యాపించిన ఘటలను కవర్ చేయడానికి వెళ్లిన కొందరు జర్నలిస్టుల ఆచూకీ కూడా ఇంకా తెలియలేదు.
పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. ఘటన స్థలానికి సమీపంలోని భవనాల అద్దాలు పగిలిపోయాయి.
పేలిపోయిన వస్తువులు, శిథిలాలు చాలా దూరం వరకు ఎగిరిపడ్డాయి. పేలుడు స్థలానికి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న తన కొలనులో కూడా శిథిలాలు వచ్చిపడ్డాయని స్థానిక దుకాణదారుడు ఒకరు చెప్పారు.
''అగ్నిగోళాలు వర్షంలా పడ్డాయి'' అంటూ ఆ భయానక దృశ్యాన్ని ఆయన వర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images
2020లో లెబనాన్‌లోని బేరూత్‌లో చోటుచేసుకున్న భారీ పేలుడుతో తాజా పేలుడును పోలుస్తున్నారు స్థానికులు.
పేలుడు శబ్దం 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు చెప్పారని ఢాకాలోని బీబీసీ రిపోర్టర్ అక్బర్ హొస్సేన్ చెప్పారు.
పేలుడు తరువాత ప్రస్తుతం అక్కడ తుక్కుతుక్కయిన షిప్పింగ్ కంటైనర్లు, కుప్పకూలిన గోదాం పైకప్పు కనిపిస్తున్నాయి.
ఆ ప్రాంతమంతా ఘాటైన వాసన వస్తోందని స్థానిక జర్నలిస్ట్ ఒకరు బీబీసీతో చెప్పారు.
అగ్నిమాపక సిబ్బంది ఆదివారం నాటికి కూడా ఇంకా మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలలో ఉన్నారు. ఇంకా మంటల మధ్య చిన్నచిన్న పేలుళ్లు సంభవిస్తుండడంతో మంటలను అదుపుచేయడం వారికి సాధ్యం కావడం లేదు.
''రసాయనాల కారణంగా మేం ఇంకా మంటలను అదుపులోకి తేలేకపోతున్నాం'' అని బంగ్లాదేశ్ ఫైర్ సర్వీసెస్ ప్రధానాధికారి మెయినుద్దీన్ చెప్పారు.
రసాయనాలు సముద్రంలోకి చేరకుండా చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్‌లోని ప్రధాన ఓడరేవు, రెండు అతి పెద్ద నగరమైన చిట్టగాంగ్‌కు సమీపంలో ఉండే ఈ సీతాకుండ ప్రధానమైన ట్రాన్సిట్ పాయింట్.
విదేశాలకు ఎగుమతి కావాల్సి ఉన్న లక్షలాది డాలర్ల విలువైన దుస్తులు ఈ స్టోరేజ్ డిపోలో ఉన్నాయని అక్కడి అధికారి ఒకరు చెప్పారు.
దుస్తుల ఎగుమతుల విషయంలో బంగ్లాదేశ్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది.
అయితే, ఇక్కడ పరిశ్రమలలో భద్రతాప్రమాణాలు పాటించడం చాలా తక్కువ. ఇటీవల కాలంలో ఇక్కడ పరిశ్రమలలో అనేక అగ్ని ప్రమాదాలు జరిగాయి.
2005 నుంచి ఇప్పటి వరకు జరిగిన 12 భారీ ప్రమాదాల గురించి ఢాకా ట్రిబ్యూన్ పత్రిక ఆదివారం తన కథనంలో రాసింది. ఈ 12 ప్రమాదాలలో అగ్ని ప్రమాదాలు, భవనాలు కూలిపోవడం, రసాయనాల లీకేజ్ వంటివి ఉన్నాయి.
వీటి కారణంగా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి:
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
- సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్: భారత చరిత్రను మలుపు తిప్పిన ఈ వీరుడి కథ నిజమా, కల్పనా?
- Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











