ఆస్కార్ అవార్డులు: క్రిస్ రాక్‌ను విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టడంపై పెదవి విప్పిన జాడా పింకెట్

ఆస్కార్, విల్ స్మిత్, జాడా పింకెట్ స్మిత్

ఫొటో సోర్స్, Getty Images

ఆస్కార్ అవార్డుల వేదికపై విల్ స్మిత్, క్రిస్ రాక్‌ను చెంపదెబ్బ కొట్టిన సంఘటన కలకలం రేపింది. భార్య జాడా పింకెట్ స్మిత్‌పై క్రిస్ రాక్ జోక్ చేయడంతో స్మిత్ ఆయనపై చేయి చేసుకున్నారు. స్మిత్ చేసిన పనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది.

అయితే, ఈ ఘటనపై జాడా స్మిత్ పెదవి విప్పలేదు. ఎట్టకేలకు, మంగళవారం ఆమె ఈ వ్యవహారంపై మొదటిసారి నోరువిప్పారు.

ఆస్కార్ వేదికపై జరిగిన సంఘటనను ఉద్దేశిస్తూ, "సీజన్ ఫర్ హీలింగ్" (కోలుకునేందుకు సమయం) అని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.

విల్ స్మిత్ చర్యలను ఆస్కార్ అవార్డుల నిర్వాహకులు ఖండించారు.

కాగా, సోమవారం విల్ స్మిత్, తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. భౌతిక దాడి అనేది "విషపూరితం, విధ్వంసకరం" అని అన్నారు.

మార్చి 27 ఆదివారం, లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై ఈ ఘటన జరిగింది. స్టాండప్ కమెడియన్ క్రిస్ రాక్, జాడా స్మిత్ జుట్టు గురించి జోక్ చేయడంతో విల్ స్మిత్ ఆగ్రహానికి గురయ్యారు. వేదికపైకి ఎక్కి రాక్‌ను చెంపదెబ్బ కొట్టారు.

ఈ ఏడాది విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.

వీడియో క్యాప్షన్, విల్ స్మిత్: తన పెళ్లాంపై కుళ్లు జోకు వేసిన కమెడియన్‌‌ చెంప పగలగొట్టిన హాలీవుడ్ హీరో

"ఇది కోలుకోవడానికి సమయం. అందుకోసమే నేనిక్కడ ఉన్నాను"

జాడా స్మిత్ అలోపీషియా అనే జబ్బుతో పోరాడుతున్నారు. దాని కారణంగా ఆమె జుట్టు మొత్తం ఊడిపోయింది.

గత రెండు రోజులుగా ఈ సంఘటనపై జాడా స్మిత్ ఏ రకమైన వ్యాఖ్యలూ చేయలేదు. చివరికి, మంగళవారం జాడా స్మిత్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ పెట్టారు.

"ఇది కోలుకోవడానికి సమయం. అందుకోసమే నేనిక్కడ ఉన్నాను" అని ఆమె రాశారు.

జరిగిన సంఘటనపై, విల్ స్మిత క్షమాపణలపై రాక్ ఇంకా స్పందించలేదు.

అయితే, ఈ సంఘటన తరువాత క్రిస్ రాక్ తదుపరి షోకు టికెట్లకు డిమాండ్ అమాంతం పెరిగిపోయాయని రిపోర్టులు చెబుతున్నాయి.

ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తరువాత విల్ స్మిత్ తన తొలి ఆస్కార్ అవార్డును అందుకున్నారు. కింగ్ రిచర్డ్ సినిమాలో టెన్నిస్ స్టార్స్ వీనస్, సెరెనా విలియమ్స్ తండ్రి రిచర్డ్ విలియమ్స్ పాత్ర పోషించారు విల్ స్మిత్.

సోమవారం రిచర్డ్ విలియమ్స్ ఈ ఘటనపై స్పందించారు. విల్ స్మిత్ చర్యను ఖండిస్తూ, అలాంటి సంఘటన జరిగినందుకు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలీదు. కానీ, ఆత్మరక్షణకు తప్ప ఎవరు, ఎవరిని కొట్టినా ఖండించాల్సిందే" అని ఆయన ఎన్‌బీసీకి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)